వైఎస్సార్‌ రైతు భరోసా.. రైతు ఇంట ఆనందాల పంట

15 Oct, 2019 11:01 IST|Sakshi
పామర్రు అసిస్సీ ఇంగ్లిషు మీడియం ఉన్నత పాఠశాల గ్రౌండ్‌లో ఏర్పాట్లు

సంక్షోభం తొలగింది.. సంక్షేమం తొంగి చూసింది. దుర్భిక్షం వీడింది.. సుభిక్షం తలుపుతట్టింది. కన్నీటి రోధన గతించింది.. సంతోష గానంతో హృది ఉప్పొంగింది. రాష్ట్రంలో అన్నదాతకు మంచి రోజులొచ్చాయి. వ్యవసాయం పునర్‌ వైభవం దిశగా పరుగులు పెడుతోంది. ఒకవైపు నిండుకుండలుగా జలాశయాలు.. మరోవైపు సాగును పండగ చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పం అన్నదాత ఇంట ఆనందాల వెలుగులు నింపుతోంది. ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ మంగళవారం నుంచి అమలు కాబోతోంది. ఈ మేరకు జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. చారిత్రాత్మక వేడుకకు పామర్రు ముస్తాబైంది.

సాక్షి, మచిలీపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌’ పథకం ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా స్థాయిలో పామర్రు అసిస్సీ ఇంగ్లిషు మీడియం ఉన్నత పాఠశాల గ్రౌండ్‌లో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఎమ్మెల్యేల సమక్షంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు ఏర్పాట్లు చేశారు. 

రైతు సంఘాల ప్రతినిధుల వినతి మేరకు..
విడతల వారీగా ఇచ్చినా ఫర్వాలేదు.. పెట్టుబడి సాయం కాస్త పెంచాలని రైతు సంఘాల ప్రతినిధులు చేసిన విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏటా ప్రకటించిన రూ.12,500 పెట్టుబడి సాయాన్ని రూ.13,500 పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాక ఐదేళ్ల పాటు ఈ పథకాన్ని అమలు చేయనుండడంతో ప్రతి రైతు ఐదేళ్లలో రూ.67,500 మేర లబ్ధి పొందనున్నారు. దీంతో రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. 

మూడు విడతల్లో..
జిల్లాలో 6,19,772 రైతు ఖాతాలుంటే ఇప్పటి వరకు పరిశీలించిన మేరకు 3,19,369 మంది అర్హులుగా తేల్చారు. వీరిలో పీఎం కిసాన్‌ పథకం కింద లబ్ధిపొందుతున్న వారు 2.15లక్షల మంది ఉన్నారు. ఇక మిగిలిన వారిలో కౌలుదారులతో పాటు కొత్తగా అర్హులైన రైతులున్నారు. ఏటా జూన్‌లో ఖరీఫ్‌ సాగు ఆరంభమవుతుంది. అందువలన మేలో రూ.7,500లు, రబీసాగుకు ముందు అక్టోబర్‌లో రూ.4వేలు, తిరిగి సంక్రాంతి సమయంలో రూ.2వేలు చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించనున్నారు. 

సర్పంచ్‌లు, ఎంపీపీ, జెడ్పీటీసీలు అర్హులే
గతంలో తాజా, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు తాజా, మాజీ సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, జెడ్పీ అధ్యక్షుల వరకు అందరూ అనర్హులుగా ప్రకటించారు. కానీ ప్రస్తుతం రైతు సంఘాల విజ్ఞప్తి మేరకు జెడ్పీటీసీల నుంచి సర్పంచ్‌ల వరకు తాజా, మాజీలు అర్హులుగా ప్రకటించారు. అంతేకాక రైతు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా అర్హులేనని, అర్హత గల రైతు చనిపోతే అతని భార్య లేదా, వారసులకు వర్తింప చేస్తామన్నారు. ఈ మేరకు అర్హులు ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్‌ 15వ తేదీ వరకు గడువునిచ్చింది. దీంతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. 

కౌలుదారుల హక్కు పత్రాలు పంపిణీ
కౌలుదారులకు మరింత భద్రత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన కౌలుదారుల రక్షణ చట్టం–2019 కింద జిల్లాలో అర్హులైన కౌలుదారులకు ఈ సందర్భంగా క్రాఫ్‌ కల్టివేటర్‌ రైట్‌ కార్డు(సీసీఆర్‌సీ)లను ఈ సందర్భంగా పంపిణీ చేయనున్నారు. రైతు భరోసా అర్హుల గుర్తింపు కోసం నిర్వహించిన క్యాంపైన్‌లో జిల్లాలో 11,962 మందిని గుర్తించారు. వీరికి రైతు భరోసా సభల్లో సీసీఆర్‌సీ కార్డులు పంపిణీ చేయనున్నారు.

అన్నదాతల్లో ఉత్సాహం
అన్నదాతల సమక్షంలో పండుగ వాతావరణంలో ‘వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌’ పథకం ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా స్థాయి వేడుకను పామర్రులో నిర్వహిస్తుండగా, గ్రామీణ జిల్లాలోని 13 నియోజకవర్గ కేంద్రాల్లో రైతుల సమక్షంలో ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు. తమ జీవితాలకు భరోసానిచ్చేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనేందుకు అన్నదాతలు ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. ఎంపిక చేసిన రైతులకు ప్రజాప్రతి నిధుల చేతుల మీదుగా చెక్‌లు పంపిణీ చేయనున్నారు. పామర్రులో జరిగే సభలో జిల్లా మంత్రులు పేర్ని వెంకట్రామయ్య(నాని), వెలంపల్లి శ్రీనివాసరావు, కొడాలి వెంకటేశ్వర రావు (నాని)లతో పాటు ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గోనున్నారు. ఇక నియోజక వర్గ స్థాయిలో జరిగే కార్యక్రమాల్లో ఆయా ఎమ్మెల్యేలు పాల్గోనున్నారు.

ఎంతో ప్రయోజనం 
రైతు భరోసా పథకం వల్ల రైతులకు ఎంతో  భరోసా లభిస్తోంది. అర్హులైన ప్రతీ రైతుకు పెట్టుబడి సాయంగా నగదుని అందజేయటం అభినందనీయం. దీని ద్వారా అప్పులు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ధైర్యంగా సాగుచేసుకోవచ్చు.   
–దాసరి అశోక్‌కుమార్, రైతు నిభానుపూడి

భరోసా పెంపు సాహసోపేతం
ప్రభుత్వం రైతు భరోసాను రూ.12,500 నుంచి రూ.13వేలకు పెంపుదల చేయటం సాహసోపేత నిర్ణయం. ఈ నిర్ణయంతో రైతుల పక్షపాతి సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి అని మరోసారి రుజువైంది. ఇక దిగులు లేకుండా సాగు చేసుకోవచ్చు.  
- కూసం పెద వెంకటరెడ్డి, రైతు, పామర్రు

రైతులను పట్టించుకున్న సీఎం ఒక్క జగనన్న
3.5 ఎకరాలను కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నా. ఎకరాకు కౌలు రూ.12 వేలు ఇవ్వాలి. పంట పెట్టుబడి ఎకరానికి రూ.20 వేల నుంచి రూ. 25వేల వరకు అవుతోంది. ప్రకృతి సహకరించి, పంట పండితే ఎకరాకు 35 నుంచి 40 బస్తాల ధాన్యం దిగుబడి వస్తుంది. ఖర్చులన్నీ పోతే ఎకరాకు పది వేలు మిగులుతుంది. అనుకోకుండా తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే పెట్టుబడి కూడా రాదు. అప్పులే మిగులుతాయి. ముప్పై ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. మా గురించి ఏ ఒక్కరూ ఆలోచించలేదు. ముఖ్యమంత్రి జగన్‌ మాకు ఏటా రూ.13,500 పెట్టుబడి నిధి అందజేయడం సంతోషంగా ఉంది. రైతుల గురించి మాట్లాడే వారు కానీ, మా బాధలు, అప్పులను పట్టించుకున్న సీఎం ఒక్క జగనన్న మాత్రమే. 
– వి. సత్యం, కౌలు రైతు, రెడ్డిగూడెం, మైలవరం  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా