కడప గడపనుంచే నవరత్నాలకు శ్రీకారం : సీఎం జగన్‌

8 Jul, 2019 14:09 IST|Sakshi

సాక్షి, కడప : దివంగత ముఖ్యమంత్రి, మహానేత, రైతు బాంధవుడు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 70వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మహానేత జయంతి(జూలై, 8)ని ‘వైఎస్సార్‌ రైతు దినోత్సవం’గా జరుపుతున్న సంగతి తెలిసిందే. రైతు దినోత్సవం ప్రధాన కార్యక్రమాన్ని జమ్మలమడుగులో నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. సభా వేదికపైకి చేరుకున్న సీఎం జగన్‌ అక్కడ  ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. 

జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, వేలాదిమంది రైతులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రైతులను ఆదుకుంటామనే హామీలో భాగంగా రామసుబ్బమ్మ అనే మహిళకు ముఖ్యమంత్రి జగన్‌ రూ.7 లక్షల చెక్కు అందజేశారు. అప్పుల బాధ తట్టుకోలేక 2015లో రామసుబ్బమ్మ భర్త  బలవన్మరణానికి పాల్పడ్డారు. ‘వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక’ పథకాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ..

కడప నుంచే శ్రీకారం..
రైతులు, పేదలు, వృద్ధులు, విద్యార్థులకు చేయూతనిచ్చే నవరత్నాలకు కడప గడపనుంచే శ్రీకారం చుడుతున్నట్టు సీఎం జగన్‌ చెప్పారు. వైఎస్సార్‌ పెన్షన్‌ పథకం కింద అవ్వాతాతలకు రూ.2,250, దివ్యాంగులకు రూ.3వేలు, డయాలసిస్‌ పేషంట్లకు రూ.10 వేలు మంజూరు చేస్తున్నామని అన్నారు. వైఎస్సార్‌ జిల్లాకు గతంలో కంటే రెట్టింపుగా రూ.70 కోట్లు పెన్షన్‌గా ఇస్తున్నామని చెప్పారు. పెన్షన్‌ పథకానికి రూ.15,676 కోట్లు కేటాయించామన్నారు. అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే సంక్షేమ పథకాల అమలుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. పెన్షన్‌ రాని అర్హులు నేరుగా సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. ఫిర్యాదు కోసం ప్రత్యేక నెంబర్‌ను ఏర్పాటు చేస్తామని అన్నారు. తప్పులు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంక్షేమ పథకాల అమలులో కులాలు, మతాలు, వర్గాలు పరిగణించమని సీఎం పునరుద్ఘాటించారు.

రుణాలన్నీ సున్నావడ్డీకే..
రైతులందరికీ సున్నా వడ్డీకే రుణాలందిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతులకు ఉచితంగా పగటిపూట 9 గంటల కరెంట్‌ ఇస్తామని వెల్లడించారు. రైతుల బాధల్ని గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందని ఉద్ఘాటించారు. ఆక్వా రైతులకు రూ.1.50కే విద్యుత్‌ సరఫరా చేస్తామని చెప్పారు. వైఎస్సార్‌ పంటలబీమా పథకానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఖరీఫ్, రబీలలో సాగు చేసే 27 రకాల పంటలకు రైతులు చెల్లించాల్సిన ప్రీమియం వాటాను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది
రైతు బాగుంటేనే ఏ రాష్ట్రమైనా బాగుంటుందని ముఖ్యమంత్రి అన్నారు. రైతుల కోసం వైఎస్సార్‌ రైతు భరోసా పథకం ప్రవేశ పెడుతున్నామని చెప్పారు. అక్టోబర్‌ 15నుంచి వైఎస్సార్‌ రైతు భరోసా కింద రూ. 12,500 ఇస్తామని తెలిపారు. రైతుల పంట రుణాల కింద రూ. 8,750 కోట్లు ఇస్తామన్నారు. భూ యాజమానుల హక్కులను పూర్తిగా కాపాడుతామని, అదే సమయంలో రైతులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. కౌలు రైతు చట్టంలో మార్పులు తీసుకొస్తామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో కౌలు రైతులకు కొత్త చట్టం తీసుకొస్తామన్నారు. చెన్నూరు షుగర్‌ ఫ్యాక్టరీని త్వరలో తెరుస్తామని హామీ ఇచ్చారు.

ప్రతి నియోజకవర్గంలో కోల్డ్‌ స్టోరేజ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, వ్యవసాయ ల్యాబోరేటరీలు ఏర్పాటు చేసి.. రైతులకు నాణ్యమైన పురుగు మందులు, ఎరువు, విత్తనాలు ఇస్తామని వెల్లడించారు. వ్యవసాయ మిషన్‌ ఏర్పాటు చేసి ప్రతినెలా రైతు సమస్యలపై సమీక్ష చేస్తున్నామని తెలిపారు. ప్రతి రైతన్నకు ఎలా తోడుగా ఉండాలనేది ఆలోచిస్తున్నామన్నారు. పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రమాదవశాత్తు రైతు మరణించినా.. ఆత్మహత్య చేసుకున్నా ఆ కుటుంబానికి రూ. 7లక్షల చెక్‌ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇవన్నీ అధికారంలోకి వచ్చిన నెలలోపే చేశామన్నారు.  

అధికారంలోకి రాగానే గిట్టుబాటు ధరలు కల్పించాం
పామాయిల్‌ రైతులను చంద్రబాబునాయుడు సర్కార్‌ పట్టించుకోలేదని, వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గిట్టుబాటు ధరలు కల్పించామని సీఎం జగన్‌ తెలిపారు. ఏ ప్రభుత్వమైనా ఖరీఫ్‌ సీజన్‌​ వచ్చిన వెంటనే విత్తనాలు అందుబాటులోకి తేవాలని, నవంబర్‌​ నుంచి కొనుగోలు చేసి మే నాటికి అందుబాటులోకి తేవాలని చెప్పారు. గత ప్రభుత్వమే విత్తనాలు కొనుగోలు చేయాలి.. కానీ, చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విత్తనాలకు సంబంధించిన బకాయిలు కూడా చెల్లించలేదని వెల్లడించారు. వ్యవసాయశాఖ అధికారులు చంద్రబాబుకు లేఖలు రాశారని తెలిపారు. దారుణమైన పరిస్థితుల్లో కూడా రైతులకు అండగా నిలిచామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే విత్తన బకాయిలు చెల్లించామని చెప్పారు. రూ. 2వేలకోట్ల కరువు బకాయిలు చెల్లించడంలో గత సర్కార్‌ విఫలమైందన్నారు. ఆ బకాయిలను అధికారంలోకి రాగానే చెల్లించామని తెలిపారు.

మరిన్ని వార్తలు