ఏమి హాయిలే ‘హల’

26 Jul, 2019 10:08 IST|Sakshi
జగనన్నే అండగా.. సంతోషం శ్వాసగా ‘సాగు’పో..

భరోసా.. ఇక కులాసా

సేద్యం నల్లేరుపై నడకే..

పెట్టుబడి నిధితో ఉచిత బీమా

కష్టాలే రానీ.. కన్నీళ్లేరానీ.. పొలాలనన్నీ.. హలాల దున్ని..  విరామమెరుగక పరిశ్రమించే.. కర్షక వీరులకు నేనున్నానంటూ ముందుకొచ్చారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఇలాతలంలో హేమం పండించేందుకు పూర్తి ‘భరోసా’ ఇచ్చారు. వైఎస్సార్‌ రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయం అందించేందుకు నడుం బిగించారు. ఇంకేముంది ఏమి హాయిలే ‘హల’ అంటూ ధరణీపుత్రులు ఏరువాక సాగుతున్నారు. 

సాక్షి, ఏలూరు (పశ్చిమ గోదావరి): ఇప్పటివరకూ రైతు కష్టానికి ప్రతిఫలం ఉంటుందన్న గ్యారంటీ లేకపోయింది. పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందనే నమ్మకమూ లేకుండా పోయింది. ప్రకృతి కన్నెర్ర చేసినా రైతులు కుంగిపోయేవారు. ప్రభుత్వం మోసం చేసినా పల్లెత్తి మాట్లాడేవారు కాదు. కష్టమైనా..నష్టమైనా మౌనంగానే భరించేవారు. ఈ సమస్యలన్నింటినీ తన పాదయాత్రలో గుర్తించిన వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నదాతలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వైఎస్సార్‌ రైతు భరోసా పథకం ద్వారా ఏడాదికి రూ.12,500 అందిస్తానని స్పష్టం చేశారు. అన్నట్టుగానే అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోపే పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. కౌలు రైతులకూ దీనిని వర్తింపజేసేందుకు ముందడుగు వేశారు. ఈ మేరకు ఇప్పటికే విధి విధానాలు ఖరారు చేసి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మేరకు బడ్జెట్‌లోనూ నిధులు కేటాయించారు.

జిల్లాలో ఇలా...
భరోసా అందుకునే కుటుంబాలు : 4.70 లక్షలు 
ఉచిత బీమా అందుకునే రైతులు : 6.40 లక్షలు 
బీమా వల్ల సర్కారుపై భారం : రూ.44.80కోట్లు 

4.70 లక్షల కుటుంబాలకు లబ్ధి
రైతు భరోసా పథకం ద్వారా జిల్లాలో 4.70 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధికలగనుంది. ఈ ఏడాది సుమారు రూ.587 కోట్లు భరోసా పథకం ద్వారా రైతులకు అందించనున్నారు.

రూపాయికే బీమా - రైతులకు బీమా పథకాన్నీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. వైఎస్సార్‌ ఫసల్‌ బీమా యోజనను రూపాయికే అందించనున్నారు. దీనివల్ల జిల్లా వ్యాప్తంగా 6.40 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఈ నేపథ్యంలో రూ.44.80కోట్ల మేర రైతులు ప్రయోజనం పొందనున్నారు. అలాగే కౌలు రైతులకూ అన్ని ప్రభుత్వ పథకాలు వర్తించేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేందుకూ సీఎం జగన్‌ చారిత్రాత్మక ముందడుగు వేశారు. దీనివల్ల  ఇన్‌పుట్‌ సబ్సిడీతో పాటు వ్యవసాయశాఖ అందించే రాయితీలన్నీ కౌలు రైతులకూ వర్తిస్తాయి.

భరోసాతో కులాసా
ఇప్పటివరకూ పంటల సాగుకు బయట వ్యక్తుల నుంచి  రైతులు అప్పులు తెచ్చుకొనేవారు.  ప్రకృతి వైపరీత్యాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల పంటలు నష్టపోతే పెట్టిన పెట్టుబడి కూడా రాని దుస్థితి ఉండేది. దీంతో పంట చేతికిరాక, మరోవైపు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక తీవ్ర మనోవేదనకు గురయ్యేవారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వ్యవసాయం దండగ కాదు పండగలా చేయాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రైతు భరోసా పథకాన్ని అమలులోకి తెచ్చారు.

బీమాతో ధీమా
ఇప్పటివరకూ వర్షాభావం, ప్రకృతి వైఫరీత్యాల వల్ల పంటలు కోల్పోతే రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. పంటలకు బీమా చేసినా కంపెనీలు నిబంధనల సాకుతో ప్రయోజనం చేకూర్చేవి కాదు.  దీనికి తోడు ఈ ఖరీఫ్‌ సీజన్‌లో పంట నష్టపోతే వచ్చే ఖరీఫ్‌కు కూడా పరిహారం రైతు చేతికి అందని పరిస్థితులు కోకొల్లలు. దీనికి తోడు మిర్చి, పత్తి, వరి పంటలకు బీమా ప్రీమియం అధికంగా ఉండటంతో చాలా మంది బీమా చేయించుకునేందుకు ఆసక్తి చూపేవారు కాదు. కౌలు రైతులకు అసలు బీమానే వర్తించేది కాదు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క రైతుకూ బీమా సదుపాయాన్ని కల్పిస్తామని, ఆ బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని వైఎస్‌ జగన్‌ హామీ ఇవ్వడంతో రైతుల మోముల్లో చిరునవ్వులు వెల్లివిరుస్తున్నాయి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు