'ప్రతి కుటుంబంలో చిరునవ్వు చూడాలి'

5 Oct, 2019 10:38 IST|Sakshi

ఆదిమూలపు సురేశ్‌

సాక్షి, ఒంగోలు : ‘మీకు ఏ కష్టం వచ్చిన తోడుగా జగనన్న ఉన్నాడనే విషయం మరిచిపోవద్దు.. మాటకు కట్టుబడి నాలుగు నెలలు గడవక ముందే మీకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారు. ఆటోడ్రైవర్లకు, మాక్సీక్యాబ్, టాక్సీ డ్రైవర్లకు ఆయన అత్యంత ప్రీతిపాత్రుడయ్యారు’ అని రాష్ట్ర విద్యాశాఖామంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. శుక్రవారం ఒంగోలులోని ఏ1 ఫంక్షన్‌ హాలులో వైఎస్సార్‌ వాహన మిత్ర కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌లు కలిగిన వాహన యజమానుల బ్యాంకు ఖాతాలకు ఆన్‌లైన్‌ ద్వారా నగదు జమ చేశారు.

జిల్లా కలెక్టర్‌ పోల భాస్కర్‌ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ వైఎస్సార్‌ వాహన మిత్ర పథకంలో రాష్ట్రవ్యాప్తంగా 173102 మంది, జిల్లాలో 8565 కుటుంబాలు రూ.10వేలు ఆర్థిక సాయన్ని పొందుతున్నాయన్నారు. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోలేకపోయి ఉంటే వారికి కూడా ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందన్నారు. ఈ పది వేలతో ఆటోకు బీమా చేయించడం, అవసరమైన మరమ్మతులు చేపట్టడం, ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ తీసుకోవడం వంటివి చేయాలని సూచించారు. నిబంధనలకు అనుగుణంగా వాహనాలను నడుపుతూ మీరు, మీ కుటుంబంతోపాటు మీ వాహనాలలో ప్రయాణిస్తున్న ప్రతి కుటుంబంలోనూ 

చిరునవ్వులు చూడాలనే ఉద్దేశాన్ని ప్రతి వాహన డ్రైవర్‌ కలిగి ఉండాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, గెలిచాక వాటిని విస్మరించి, మళ్లీ ఓటు బ్యాంకు కోసం వచ్చే వారిలా కాకుండా కేవలం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోపే 80 శాతం హామీలు నెరవేర్చిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. ఎంతో పారదర్శకంగా పాలన సాగిస్తుంటే సచివాలయ పరీక్షల్లో పేపర్‌ లీక్‌ అయిందంటూ తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. అలాంటివి ఏవైనా ఉంటే సాక్ష్యాలతో స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయాలని కోరారు.

వాహన డ్రైవర్లను ఇబ్బంది పెట్టొద్దు..
ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిందన్నారు. దీనిపై పార్లమెంట్‌లో తాము అభ్యంతరం వ్యక్తం చేశామని, అయినప్పటికీ చట్టం కార్యరూపం దాల్చిందన్నారు. కనుక ప్రతి ఒక్కరు నిబంధనలను అనుసరించాలని పేర్కొంటూనే జరిమానాలు విధించే సమయంలో కాస్తంత మానవత్వాన్ని కూడా ప్రదర్శిస్తూ, వాహన డ్రైవర్లను ఇబ్బందులకు గురి చేయవద్దంటూ పోలీసు శాఖకు, రవాణాశాఖకు విజ్ఞప్తి చేశారు. ఇంధన శాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వాహన డ్రైవర్లకు పంపిన సందేశాన్ని వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు చదివి వినిపించారు. 

కల్లబొల్లి మాటలు చెప్పం..
గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిరి కల్లబొల్లి మాటలు చెప్పి లబ్దిదారుల సంఖ్యను ఎలా కుదించాలి అని కాకుండా ఎంత ఎక్కువమందికి లబ్ది చేకూర్చాలనేదే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అందువల్లే రాష్ట్ర వ్యాప్తంగా 175352 మంది దరఖాస్తు చేసుకుంటే 173102 మందికి, జిల్లా స్థాయిలో 8704 మంది దరఖాస్తు చేసుకుంటే 8565 మందికి ప్రయోజనం కలిగిందన్నారు. రవాణాశాఖ ఉప కమిషనర్‌ భువనగిరి శ్రీకృష్ణవేణి లబ్దిదారులు, వేదికపై ఆశీనులైన అందరితో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోకుండా వాహనాలను నడుపుతామని, ప్రమాద రహిత సమాజం కోసం తోటి వారిని సైతం చైతన్యం చేస్తానంటూ ప్రతిజ్ఞ› చేయించారు.

అనంతరం పలువురు లబ్దిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. మిగిలిన వారికి గ్రామ, వార్డు వలంటీర్లు, పంచాయతీ కార్యదర్శులు త్వరలోనే వచ్చి అందిస్తారన్నారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు గజమాలతో మంత్రి సురేష్, ఎంపీ మాగుంటలను సత్కరించి కృతజ్ఞతలు చాటుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, ఆర్‌టీవో సీహెచ్‌వీకే సుబ్బారావు, జిల్లా ఇన్‌ఛార్జి అదనపు ఎస్పీ ఎ.ప్రసాద్‌కుమార్, పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్‌ మేదరమెట్ల శంకరారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ అయినాబత్తిన ఘనశ్యాం, డీసీఎంఎస్‌  మాజీ చైర్మన్‌ బెల్లం సత్యన్నారాయణ, ఎంవీఈఐ సుందరరావు, ఏఎంవీఐ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు