వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లే టార్గెట్‌!

11 Apr, 2019 11:43 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఎన్నికల రోజు ఏజెంట్లే కీలకం. పోలింగ్‌ బూత్‌లో కూర్చుని దొంగ ఓట్లు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అటువంటి ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసో, వారిపై తప్పుడు కేసులు పెట్టించో ఎన్నికల రోజు వారు మౌనంగా ఉండేలా చేసేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు ముందస్తు ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏజెంట్లనే టార్గెట్‌ చేసి వార్ని పోలింగ్‌ బూత్‌లకు దూరంగా ఉంచేందుకు అనేక వ్యూహాలు పన్నుతున్నారు. 

డబ్బులు పంచుతున్నారంటూ ఫిర్యాదు....
వాస్తవంగా పార్టీలో దీర్ఘకాలంగా పని చేసేవారిని.. అభ్యర్థికి నమ్మకమైన వారిని పోలింగ్‌ ఏజెంట్లుగా నియమించుకుంటారు. డివిజన్‌ స్థాయిలో కీలకంగా ఉన్న వారిని వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు తమ ఏజెంట్లుగా నియమించుకున్నారు. దీంతో వీరిపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు దృష్టి సారించారు.

విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో 20 మంది వైఎస్సార్‌ సీపీ నాయకులు డబ్బులు పంచుతున్నారంటూ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై గురువారం ఎన్నికలు పూర్తయ్యే వరకు నిఘా ఉంచాలంటూ ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఇందులో ఎక్కువ మంది ఏజెంట్లుగా ఉన్నవారేనని సమాచారం. 

మైలవరం, గుడివాడల్లోనూ అదే తీరు....
మైలవరం, గుడివాడ నియోజకవర్గాలలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు ముందంజలో ఉండటంతో జిల్లాకు చెందిన ఓ మంత్రి ప్రతిపక్ష ఏజెంట్లపై దృష్టి సారించారని తెలిసింది. ఆయా నియోజకవర్గాల్లో పోలీసులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏజెంట్లపై రెండు రోజుల నుంచి నిఘా పెట్టారని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

డబ్బులు పంచుతున్నారంటూ వారిని బుధవారం రాత్రి లేదా గురువారం ఉదయం అదుపులోకి తీసుకుని స్టేషన్‌లో కూర్చోబెట్టి సాయంత్రానికి ఏ విధమైన కేసులు లేకుండా పంపేయాలని జిల్లా మంత్రి నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చాయని సమాచారం. ఎదురు తిరిగే ఏజెంట్లపై కేసులు పెట్టి కోర్టుకు పంపుతామని బెదిరించి స్టేషన్‌లోంచి కదలకుండా ఉంచేందుకు కుట్ర పన్నుతున్నారు.

మైలవరం, గుడివాడలో దొంగ ఓట్లు వేయించడానికి విజయవాడ నుంచి యువతను తరలించి గుడివాడలోని పార్టీ నేతల ఇళ్లలో ఉంచారని తెలిసింది. మద్యం వ్యాపారస్తుల సంఘంలో కీలకపాత్ర వహించే ఓ వ్యక్తి కన్నుసన్నల్లో ఈ తతంగమంతా జరుగుతోంది. 

లొంగదీసుకునేందుకు యత్నాలు...
కొన్ని నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీ ఏజెంట్లను లొంగదీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో విజయవాడ గుణదలలో ఇదే తరహాలో కొంతమంది వ్యతిరేక పార్టీల ఏజెంట్లను లొంగదీసుకుని తమకు అనుకూలంగా ఓట్లు వేయించుకున్నారు. ఏజెంట్లను బెదిరించో. భయపెట్టో, డబ్బులకు కొనుగోలు చేశో తమ పని పూర్తి చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కాగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏజెంట్లతో బంధుత్వాలు కూడా కలుపుకుని ఎన్నికల్లో సహాయం చేయమని కోరుతున్నారు. ముఖ్యంగా గన్నవరం, నందిగామ, నూజివీడు, అవనిగడ్డ తదితర ప్రాంతాల్లో ఈ తరహా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. అయితే, ఈ విషయంలో వైఎస్సార్‌ సీపీ నేతలు ప్రత్యేక దృష్టి సారించారు.

అందుకు తగిన ఏర్పాటు చేస్తున్నారు. ఏజెంట్లుగా నియమించిన వారు ఏ విధమైన కేసుల్లోనూ ఇరుక్కోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలింగ్‌ ముగిసే వరకు బూత్‌ వదిలిపెట్టి రాకుండా ఏజెంట్లకు తగిన సూచనలు చేస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు