అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా

4 Feb, 2019 12:04 IST|Sakshi

సాక్షి, విజయవాడ: అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలంటూ విజయవాడలో వైఎస్సార్‌ సీపీ అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మహాధర్నా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల నుంచి అగ్రిగోల్డ్ బాధితులు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, జోగిరమేష్, అడపా శేషు, అప్పిరెడ్డి, డీఎన్ఆర్, బొప్పన భవకుమార్ తదితరులు పాల్గొన్నారు.

అగ్రిగోల్డ్‌ ఆస్తులపై ఆ ఇద్దరు కన్నేశారు
అగ్రిగోల్డ్‌ ఆస్తులపై ఆంధ్రప్రదశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్‌లు కన్నేశారని వైఎస్సార్‌ సీపీ నేత కే పార్థసారధి వ్యాఖ్యానించారు. అందుకే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరగటం లేదన్నారు. సోమవారం వైఎస్సార్‌ సీపీ అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్ధరాత్రి ఎస్సెల్ సంస్థ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయ్యారని, ఆ తరువాత సదరు సంస్థ వెనక్కి వెళ్ళిపోయిందని తెలిపారు. వెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల కోసం అనేక తాయిలాలు ఇస్తున్న చంద్రబాబు అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో మాత్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

ప్రభుత్వ పెద్దలు ఆస్తులు కాజేసే కుట్ర: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అగ్రిగోల్డ్‌కు చెందిన వేల కోట్ల రూపాయల ఆస్తులను ప్రభుత్వ పెద్దలు కాజేసే కుట్ర జరుగుతోందని వైఎస్సార్‌ సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. సోమవారం వైఎస్సార్‌ సీపీ అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్‌ బాధితులు ధైర్యం కోల్పోయి, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 11 వందల కోట్ల రూపాయలు కేటాయిస్తే 70శాతం ఉన్న చిన్న డిపాజిట్‌ దారులకు న్యాయం జరుగుతుందన్నారు. ఇటీవలి అసెంబ్లీ సమావేశాలలో గవర్నర్‌ ప్రసంగంలోనూ అగ్రిగోల్డ్‌ బాధితుల గురించి ప్రస్తావన లేదని పేర్కొన్నారు.

అసెంబ్లీ సమావేశాల బీఎసీలో కూడా ఈ అంశాన్ని చేర్చలేదన్నారు. 7.93వేల మందికి కేవలం 363కోట్ల రూపాయలు ఇస్తే ఉపశమనం కలుగుతుందన్నారు. అగ్రిగోల్డ్‌ విషయంపై ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను చాలా వరకు గోప్యంగా ఉంచారని, కోర్టుల దృష్టికి తీసుకెళ్లటం లేదని తెలిపారు. వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అగ్రిగోల్డ్‌ సమస్య పరిష్కారంపై ఉన్నారన్నారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో వారికి న్యాయం చేస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు