ఎవరి కోసం సాధికారమిత్రలు!

21 Jun, 2018 10:37 IST|Sakshi

శృంగవరపుకోట: రాష్ట్రంలో వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి,  ప్రజల సొమ్ము ఖర్చు చేస్తూ పార్టీనీ బలోపేతం చేసుకునే కుట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్నారని ఎస్‌.కోట నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ కన్వీనర్‌ ఎ.కె.వి.జోగినాయుడు విమర్శించారు. బుధవారం ఎస్‌.కోటలో పలువురు వైఎస్సార్‌ సీపీ నేతలతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధికారమిత్రల నియమిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 219పూర్తిగా రాజ్యాంగ విరుద్దమన్నారు. బలమైన మహిళలను సాధికారమిత్రలుగా ఎంపిక చేస్తామనటంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. సాధికారమిత్రలు తప్ప మిగిలిన మహిళలు బలహీనులు అని ముఖ్యమంత్రి ఉద్దేశమా అంటూ ప్రశ్నించారు. డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ హామీతో అధికారంలో వచ్చిన బాబు తన హామీని మాఫీ చేసి మహిళలను మోసం చేశారన్నారు. 

  సాధికారమిత్రలకు నెలకు రూ.18,000లు వేతనంగా ఉపా«ధి హామీ నిధులు వాడుకోటానికి తెగబడ్డారన్నారు. 4,60,000 మంది సాధికార మిత్రలతో ప్రతినెలా 21న ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడతారని, సంక్షేమ పథకాల అమలు, శాఖల పనితీరును పర్యవేక్షించి, జవాబుదారీతనాన్ని  సాధికారమిత్రలు  పెంచుతారని చెప్పటం సిగ్గుచేటన్నారు. ఆయనతో పాటు సర్పంచ్‌లు టి.గంగాభవాని, ఎం.కాశీవిశ్వనాధం. ఎమ్పీటీసీ మోపాడ కుమార్,  మండల కన్వీనర్లు ఎం.సత్యన్నారాయణ, కె.కన్నంనాయుడు, నేతలు వాకాడ రాంబాబు, పి.వెంకటరమణ, కె.పాల్‌కుమార్, చింతల సత్యన్నారాయణమూర్తి, మోపాడ నాయుడు, మోపాడ గౌరినాయుడు, జి.పైడితల్లి, ఎన్‌.శ్రీనివాసరావు, రంధి అనంత్, ఎం.సోమునాయుడు తదితరులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు