నకిలీ ఓట్లను తొలగించండి

19 Jan, 2019 03:54 IST|Sakshi
సచివాలయంలో అఖిల పక్ష నాయకులతో సమీక్ష నిర్వహిస్తున్న ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వైఎస్సార్‌సీపీ విజ్ఞప్తి

రాజకీయ పార్టీల నేతలతో సీఈవో సమావేశం 

ఓటర్ల జాబితాలో తప్పులపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని హామీ

సాక్షి, అమరావతి: అధికార తెలుగుదేశం పార్టీ గ్రామాల్లో అధికారులను లోబరుచుకుని ఓటర్ల జాబితాలో నకిలీ ఓటర్లను  చేర్పించిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. శుక్రవారం సచివాలయంలో ఏపీ ఎన్నికల సంఘం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో 54,63,579 నకిలీ ఓట్లు ఉన్నట్లు ఓటర్‌ అనలిటిక్స్‌ అండ్‌ స్ట్రాటజీ టీమ్‌(వాస్ట్‌) అనే సంస్థ గుర్తించిందని తెలిపారు. ఓటర్ల పేర్లలో చిన్నచిన్న మార్పులు చేసి నకిలీ ఓట్లను చేర్చారని విమర్శించారు. ఎలాంటి తప్పులు లేకుండా ఓటర్ల జాబితాలను రూపొందించాలని కోరారు.

తెలంగాణలోని ఓటర్లలో 20,07,395 మంది ఆంధ్రప్రదేశ్‌లోనూ ఓటు హక్కు కలిగి ఉన్నారని చెప్పారు. నిబంధనల ప్రకారం ఒక్కరికి ఒకే ఓటు ఉండాలని అన్నారు. ఒకే వ్యక్తి పేరుతో ఏకంగా 78,156 ఓట్లు ఉన్నట్లు పార్టీ ‘వాస్ట్‌’ సంస్థ గుర్తించిందని వెల్లడించారు. ఒకే నెంబరు ఓటరు ఐడీ కార్డుతో రెండు ఓట్లు ఉన్న వ్యక్తులు 9,552 మంది ఉన్నారని, ఒక్క అక్షరం మార్పుతో ఒకే పేరు కలిగిన వ్యక్తులు 19,45,586 మంది ఉన్నారని తెలిపారు. ఏపీలో ఓటర్ల జాబితాలు తప్పులతడకలుగా మారాయని అన్నారు. ఓటర్ల జాబితాల్లో తప్పులపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) హామీ ఇచ్చారని అంబటి రాంబాబు తెలిపారు.  

ఓటర్ల జాబితాల్లో అవకతవకలపై నెల రోజుల క్రితం ఫిర్యాదు చేసినా ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత మల్లాది విష్ణు అన్నారు. సమయం ఇస్తే.. ‘వాస్ట్‌’ సంస్థ వచ్చి వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని సీఈవోకు వివరించినట్లు తెలిపారు. ఆర్టీసీ ఛైర్మన్, టీడీపీ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడాలని సీఈవోను కోరామని చెప్పారు. 

ఓటర్ల జాబితాపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ట ద్వివేదీ రిజిస్టర్డ్‌ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఒటర్ల జాబితాలో తప్పులు ఉంటే రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  

మరిన్ని వార్తలు