'డిప్యూటీ సీఎం ప్రకటన మేరకే మాపై కేసులు'

3 Jul, 2015 19:30 IST|Sakshi
'డిప్యూటీ సీఎం ప్రకటన మేరకే మాపై కేసులు'

కర్నూలు: ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రకటన మేరకే తమపై కేసులు పెట్టారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. బలంతో పోలీసు కేసులు పెట్టి  వైఎస్సార్ సీపీని అణిచేస్తామని గతంలో డిప్యూటీ సీఎం బహిరంగంగా ప్రకటన చేశారని ఈ సందర్భంగా ఎస్వీ మోహన్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన ప్రకటనకు అనుగుణంగానే అందరిమీదా కేసులు పెట్టాలని చూస్తున్నారని ప్రభుత్వ తీరును విమర్శించారు. ఇటీవల ఓ ఫ్లెక్సీ కాల్చారని ఆరోపిస్తూ డోన్ ఎమ్మెల్యే  బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారని మోహన్ రెడ్డి తెలిపారు.

 

జిల్లాలో వైఎస్సార్ సీపీ బలంగా ఉందని..  దీనిలో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందన్న ఆక్రోశంతో నాయకులను భయపెట్టాలనే ఉద్దేశంతో అధికార పార్టీ ఇలా కేసులు బనాయిస్తుందన్నారు. అంతకుముందు భూమా నాగిరెడ్డి మీద అక్రమంగా కేసు పెట్టారని.. ఇంతలోనే మళ్లీ కేసు పెట్టారన్నారు.  తప్పుడు ఫిర్యాదుతోనే భూమాపై కేసు పెట్టారన్నాడు. ప్రభుత్వోద్యోగి మీద నేర పూరితంగా ఏమైనా చేస్తేనే సెక్షన్- 353 నమోదు చేయాలన్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ పట్ల దురుసుగా ప్రవర్తించారని.. ఎందుకలా చేశారని అడిగితే అరిచి ఏం చేద్దామనుకుంటాన్నావని నాగిరెడ్డిని  ఏకవచనంతో సంబోధించారన్నారు. అరెస్టు చేయమంటావా అని బెదిరింపు ధోరణితో మాట్లాడటంతో నాగిరెడ్డి కూడా దీటుగా మాట్లాడారే తప్ప వాళ్లను తిట్టింది లేదన్నారు.

 

ప్రభుత్వం పెట్టే కేసులకు కర్నూలు జిల్లాలో ఏ నాయకుడూ, కార్యకర్తా కూడా భయపడరని తెలిపారు. కేసులకు భయపడే వాళ్లు ఈ జిల్లాలో రాజకీయాల్లో రారని మోహన్ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై తాను అసెంబ్లీ హక్కుల తీర్మానాన్నిప్రవేశపెడతామన్నారు. భూమా నాగిరెడ్డి అరెస్టుపై శనివారం ప్రజా ఉద్యమం చేపడతామన్నారు.

మరిన్ని వార్తలు