పోలీసులా.. రౌడీలా?

3 Sep, 2013 05:06 IST|Sakshi
పోలీసులా.. రౌడీలా?

 సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్రంకోసం నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం విషమించడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన సందర్భంగా అక్కడకు వెళ్లిన తమ పట్ల కాచిగూడ ఎస్సై సైదులు, సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీసులు అమానుషంగా వ్యవహరించారని, అకారణంగా కొట్టారని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.
 
 ఈ మేరకు యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు శివకుమార్, హైకోర్టు న్యాయవాది నాగిరెడ్డి తదితరులు కమిషన్ సభ్యులు కాకుమాను పెద పేరిరెడ్డికి సోమవారం ఫిర్యాదు చేశారు. ‘‘నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న జగన్ ఆరోగ్యం విషమించడంతో గత నెల 29న జైలు అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దీంతో మా పార్టీకి చెందిన ప్రతినిధులం ఆస్పత్రికి చేరుకున్నాం. ఆస్పత్రి గేటువద్ద శాంతియుతంగా ఉన్న మాపై సివిల్ దుస్తుల్లోని పోలీసులు విరుచుకుపడ్డారు. మర్మాయవాలపై లాఠీలు, బూటు కాళ్లతో తంతూ విచక్షణారహితంగా చితకబాదారు’’ అని వివరించారు. దాడిలో ప్రతాప్‌రెడ్డితోపాటు బండారు సుధాకర్, ఎం.సరోజ్‌రెడ్డి, మాజిద్‌తోపాటు మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. అనంతరం తమను కాచిగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారని, అక్కడ ఎస్సై సైదులు పత్రికల్లో రాయలేనివిధంగా దుర్భాషలాడుతూ మళ్లీ తమపై దాడి చేశారని వివరించారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే వీధిరౌడీల్లా దాడి చేశారని, జగన్‌కు మద్దతుగా ఎవరూ రాకూడదనే ఉద్దేశంతోనే ఈ తరహా దాడికి పాల్పడ్డారని తెలిపారు.
 
 జగన్ దీక్షకు మద్దతు తెలిపే తమ హక్కుకు పోలీసులు విఘాతం కలిగించారని, అకారణంగా దాడి చేసి తమ జీవించే హక్కును కాలరాశారని పేర్కొన్నారు. ఉస్మానియా ఆసుపత్రి వద్ద విధుల్లో ఉన్న పోలీసుల ఫొటోలను చూపిస్తే తమపై దాడి చేసినవారిని గుర్తించగలమన్నారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తించి తమపై దాడికి పాల్పడిన పోలీసులు, ఎస్సై సైదులుపై క్రిమినల్ చర్యలతోపాటు శాఖాపరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కమిషన్.. ఈ వ్యవహారంపై ప్రత్యక్షంగా విచారణ జరిపి ఈనెల 19లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని తూర్పు మండల డీసీపీని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.
 

మరిన్ని వార్తలు