హోదా కోరుతూ వైఎస్సార్‌సీపీ ఆందోళన 

14 Dec, 2018 01:32 IST|Sakshi

రాజ్యసభ వెల్‌లో నిరసన తెలిపిన ఎంపీలు

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటు ఆవరణలో, రాజ్యసభలో ఆందోళన నిర్వహించింది. గురువారం ఉదయం సమావేశాలకు ముందు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ధర్నా నిర్వహించారు. హోదా కోరుతూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ రాష్ట్రానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. అనంతరం సభ ప్రారంభం కాగానే రాజ్యసభలో ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి వెల్‌లోకి వెళ్లి ఆందోళన నిర్వహించారు.

మరోవైపు ఏఐఏడీఎంకే సభ్యులు కావేరి నదీ వివాదంపై ఆందోళన చేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో రాజ్యసభ చైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు సభను శుక్రవారానికి వాయిదావేశారు. గాంధీ విగ్రహం వద్ద మాజీ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు మాట్లాడుతూ.. పదిహేనేళ్లు ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన చంద్రబాబు ఎన్నికల తర్వాత ఏపీకి అన్యాయం చేశారని మండిపడ్డారు. హోదా కోసం వైఎస్సార్‌సీపీ నాలుగున్నరేళ్లుగా నిరంతరాయంగా ఆందోళన చేస్తోందని తెలిపారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఆమరణ నిరాహార దీక్షతో సహా అనేక కార్యక్రమాలను చేపట్టారని వివరించారు. చివరికి కేంద్ర ప్రభుత్వంపై 13సార్లు అవిశ్వాస తీర్మానానికి నోటీసులున్నా స్పందించకపోవడంతో ఎంపీలు రాజీనామాలు చేసి, నిరాహార దీక్షలు చేశారని పేర్కొన్నారు. 

అమరవీరులకు నివాళులు..: 18 ఏళ్ల కిందట డిసెంబరు 13న పార్లమెంటుపై జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన భద్రతా సిబ్బందికి విజయసాయిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ నివాళులు అర్పించారు. 

మరిన్ని వార్తలు