సీఎం అండతోనే శిల్పాపై హత్యాయత్నం

25 Aug, 2017 01:10 IST|Sakshi
సీఎం అండతోనే శిల్పాపై హత్యాయత్నం

సాక్షి, హైదరాబాద్‌: నంద్యాలలో శిల్పా చక్రపాణిరెడ్డిపై జరిగిన దాడిని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. కాల్పులకు పాల్పడ్డ అభిరుచి మధును తక్షణమే అరెస్ట్‌ చేయాలని ఆ పార్టీ డిమాండ్‌ చేసింది. రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు పాలన అంతా రక్తచరిత్రే అని అన్నారు. టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, నడిరోడ్డుపై రౌడీలు వీరవిహారం చేస్తుంటే పోలీసులు పారిపోతున్నారన్నారు. రౌడీషీటర్కు గన్‌ ఎక్కడ నుంచి వచ్చిందని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఆయుధాలను పోలీస్‌ స్టేషన్‌లో ఎందుకు అప్పగించలేదని, టీడీపీ నేతలకు నిబంధనలు వర్తించవా అని అన్నారు.

ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా నంద్యాలలో నిన్నంతా టీడీపీ నేతలు వీరంగం సృష్టించారని శ్రీకాంత్‌ రెడ్డి మండిపడ్డారు. ఇంకెంతకాలం అరాచకాలు చేస్తారని అన్నారు. ప్రభుత్వమే రౌడీయిజం చేయిస్తోందని, రౌడీలను పరోక్షంగా ప్రోత్సహిస్తోందని వ్యాఖ్యానించారు. నారాయణరెడ్డిని దారుణంగా చంపినా చంద్రబాబు కనీసం చర్యలు తీసుకోలేదని అన్నారు. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, తప్పు చేసినవారిని శిక్షించాలన్నారు. కళ్ల ఎదురుగానే కాల్పులు జరిపిన వ్యక్తిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదని ప్రశ్నించారు. నడిరోడ్డుపై రౌడీలు వీరవిహారం చేస్తుంటే పోలీసులే పారిపోతున్నారన్నారు. నేతల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అభిరుచి మధును అదుపులోకి తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.


కాల్పుల ఘటన ప్రభుత్వ వైఫల్యమే..
నంద్యాలలో టీడీపీ నేతలు రౌడీయిజం చేస్తున్నారని వైఎస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. పోలీసులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారన్నారు. ముఖ్యమంత్రి మెప్పు కోసం అధికారులు, పోలీసులు యత్నిస్తున్నారని విమర్శించారు. గత నెలరోజులుగా వైఎస్‌ఆర్‌ సీపీ నేతలను టార్గెట్‌ చేశారని అంబటి అన్నారు. మూడు రోజులుగా శిల్పా కుటుంబాన్నే లక్ష్యంగా చేసుకున్నారని, కాల్పులను ప్రభుత్వ వైఫల్యంగా చూడాలన్నారు. పట్టపగలు టీడీపీ నేతలు కాల్పులు జరపడం దారుణమని, పోలీసుల వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. టీడీపీ నేతలు కాల్పులు జరుపుతుంటే పోలీసులు పారిపోయారన్నారు.