జననేతగా..

5 Oct, 2013 02:49 IST|Sakshi

సాక్షి, కడప: జననేత వైఎస్‌జగన్ మరోసారి ప్రజలకు అండగా నిలుస్తున్నారు. రాష్ట్రవిభజనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఎమ్మెల్యేలు ఆకేపాటి, కొరముట్ల, గడికోట ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేశారు.
 
 ఆ తర్వాత అందరూ ఆమరణదీక్షలు చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జైలులో ఉండి కూడా సమైక్యరాష్ట్రం కోసం ఆమరణదీక్ష చేశారు. జిల్లాలోని పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా రెన్నెళ్లుగా సమైక్యరాష్ట్రం కోసం పలు రకాలుగా నిరసన కార్యక్రమాలు చేస్తూ  కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ  తెలంగాణనోట్‌ను కేంద్రకేబినెట్ గురువారం ఆమోదించడం పార్టీ శ్రేణులతో పాటు జిల్లావాసులను కలచివేసింది. ఇక విభజన ప్రక్రియను ఎవరూ ఆపలేరేమో అనే దిశగా చాలామంది డీలాపడ్డారు. ఈ క్రమంలో ప్రజలకు అండగా జగన్ నిలిచారు. ఇప్పటికే సమైక్యం కోసం దీక్ష చేసిన ఆయన మరోసారి హైదరాబాద్‌లో ఆమరణదీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు. నేటి నుంచి ఆమరణదీక్ష కొనసాగించనున్నారు.
 
 కాంగ్రెస్, టీడీపీలకు పట్టదా?:
 రాష్ట్రవిభజనపై కేంద్రం దూకుడు ప్రదర్శిస్తున్నా కాంగ్రెస్, టీడీపీ  మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం జిల్లా ప్రజలను తీవ్ర ఆవేశానికి లోనుచేస్తోంది. అధికారపార్టీ ఎమ్మెల్యేలు సమైక్యరాష్ట్రం కోసం ఎక్కడా ఉద్యమంలో పాల్గొనడంలేదు. తెలంగాణపై సీడబ్ల్యూసీ ప్రకటన చేసిన తర్వాత రాజీనామాలు చేయలేదు. ఇదేంటంటే ‘అసెంబ్లీలో తీర్మానం వీగిపోయేందుకు పదవులు అవసరమని’  కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారు. ఇదే నిజమైతే అందుకు ఎమ్మెల్యే పదవులు సరిపోతాయని, మంత్రి పదవులకు ఎందుకు రాజీనామా చేయడంలేదని జిల్లావాసులు ప్రశ్నిస్తున్నారు. అలాగే టీడీపీ నేతలు కూడా సమైక్యరాష్ట్రంపై చిత్తశుద్ధి ప్రదర్శించడంలేదు. ఇప్పటి వరకూ ఆపార్టీ అధినేత చంద్రబాబు నాయుడునోటి వెంట ‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి’ అనే మాటనే చెప్పించలేకపోయారు. పైగా ఎంపీ పదవిని సీఎం రమేష్ ఆమోదించుకోలేకపోయారు. ఓ వైపు సహచరరాజ్యసభ సభ్యుడు హరికృష్ణ రాజీనామాను ఆమోదించుకుంటే రమేష్ ఎందుకు ఆపని చేయలేకపోయారని జిల్లా వాసులు ప్రశ్నిస్తున్నారు.
 
 జగన్‌దీక్షకు మద్దతుగా రిలేదీక్షలు: కే సురేష్‌బాబు, జిల్లా కన్వీనర్, వైఎస్సార్‌సీపీ
 సమైక్యరాష్ట్రం కోసం మా అధినేత జగన్ మరోసారి ప్రాణత్యాగానికి సిద్ధమయ్యారు. నేనున్నానంటూ సమైక్య ఉద్యమకారుల్లో ధైర్యం నింపుతున్నారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా జగన్ నాయకత్వంలో సమైక్యరాష్ట్రాన్ని సాధించుకుంటాం. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మాపార్టీ నేతలు రిలేదీక్షలు చేస్తున్నారు. జగన్ ఆమరణ దీక్షకు  మద్దతుగా ఆ శిబిరాల్లో దీక్షలు కొనసాగుతాయి. ఇప్పటికైనా కాంగ్రెస్, టీడీపీ నేతలు ప్రత్యక్ష ఉద్యమంలో రావాలి. లేదంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు.
 
 జగన్‌దీక్షతో ఉద్యమకారుల్లో ధైర్యం
 కాంగ్రెస్, టీడీపీ నేతలు అండగా నిలవకపోయినా ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ఉద్యమాన్ని  కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ మలివిడత ఆమరణదీక్ష చేస్తుండటం  సమైక్యవాదుల్లో కొండంత ధైర్యాన్ని నింపింది. సమైక్యరాష్ట్రాన్ని కాపాడగలిగే ఏకైక నాయకుడు జగన్ అని ఇటీవల జరిగిన రౌండ్‌టేబుల్‌సమావేశంలో జేఏసీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.  వారి ఆశలు వమ్ముకాకుండా మరోసారి జగన్ ఆమరణదీక్షకు కూర్చోవడాన్ని   స్వాగతిస్తున్నారు. వైఎస్సార్‌పార్టీ దీక్షలకు మద్ధతు పలికి, ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు.
 

>
మరిన్ని వార్తలు