వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ పీటర్స్‌ మృతి

13 May, 2018 13:49 IST|Sakshi
పీటర్స్‌ మృతదేహం వద్ద నివాళులర్పిస్తున్న ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మేయర్‌ సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్‌బాషా

కడప కార్పొరేషన్‌ : కడప నగర పాలక సంస్థ 23వ డివిజన్‌ కార్పొరేటర్‌ జోసెఫ్‌ చంద్రభూషణం పీటర్స్‌ (71) మృతి చెందారు. కొంత కాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం 11 గంటలకు తుదిశ్వాస విడిచారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మేనత్త కుమారుడు పీటర్స్‌. 1947 నవంబర్‌ 23న ఎంఎస్‌ పీటర్, సుగుణమ్మ దంపతులకు జేసీబీ పీటర్స్‌ జన్మించారు. ఆయన కెమిస్ట్రీ అధ్యాపకునిగా పలమనేరు, జిల్లాలోని ప్రభుత్వ పురుషుల కళాశాలల్లో పని చేశారు.

వైఎస్‌ఆర్‌ తొలిసారి మంత్రి పదవి చేపట్టినపుడు ఆయనకు వ్యక్తిగత సలహాదారునిగా పని చేశారు. తర్వాత వయోజన విద్య సహాయ సంచాలకులుగా, పులివెందుల, సింహాద్రిపురం కళాశాలల్లో ప్రిన్సిపాల్‌గా సేవలందించారు. అనంతరం స్వచ్ఛందంగా పదవీ విరమణ పొంది, రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2005లో కడప నగర పాలక సంస్థ కో ఆప్షన్‌ సభ్యుడిగా ఎంపికయ్యారు. 2014లో మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ తరఫున 23వ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలుపొందారు. కో ఆప్షన్‌ సభ్యునిగా, కార్పొరేటర్‌గా ఆ ప్రాంత అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు.

పలువురి సంతాపం : కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మేయర్‌ సురేష్‌బాబు, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా.. ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. వారితోపాటు టీడీపీ నాయకులు పుత్తా నరసింహారెడ్డి, హరిప్రసాద్, గోవర్థన్‌రెడ్డి, సుభాన్‌బాషా, కార్పొరేటర్లు బోలా పద్మావతి, వైఎస్‌ఆర్‌సీపీ నగర అ««ధ్యక్షుడు పులి సునీల్‌ నివాళులు అర్పించారు. పీటర్స్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు