అచ్చెన్నాయుడూ.. నీ అబద్ధాలకు సాక్ష్యాలివిగో

5 Apr, 2017 08:44 IST|Sakshi
ప్రమాదం జరిగిన ట్యాంకును పరిశీలిస్తున్న నాయకులు ఆళ్లనాని, ప్రసాదరాజు, బలరాం తదితరులు

మొగల్తూరు ఆనంద ప్లాంట్‌ వ్యర్థాలు గొంతేరులో నేరుగా కలుపుతున్నారు
పెప్‌లైన్లను మీడియాకు చూపించిన వైఎస్సార్‌ సీపీ, సీపీఎం నేతల బృందం
తుందుర్రు ఆక్వా పార్క్‌ పనులు ఆపేవరకు పోరాటం ఆగదని హెచ్చరిక


సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు ఆనంద ఆక్వా ప్లాంట్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం ధనదాహానికి ఐదుగురు కార్మికులు బలైపోగా.. మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారు. చనిపోయినవారి కుటుంబాలను కించపరిచే విధంగా, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు దిగారు..’ అంటూ వైఎస్సార్‌ సీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని నేతృత్వంలోని బృందం మండిపడింది. ఆనంద రొయ్యల ఫ్యాక్టరీ నిర్వహణ నిబంధనల మేరకే జరుగుతోందని, ఫ్యాక్టరీ వ్యర్థాలను కలిపేందుకు గొంతేరు డ్రెయిన్‌లో వేసిన పైప్‌లైన్లను ఎప్పుడో పీకేశారని మంత్రి చెప్పారని.. ఫ్యాక్టరీ పైప్‌లైన్‌ గొట్టాలు ఇంకా గొంతేరు డ్రెయిన్‌కు అనుసంధానంగానే ఉన్న దృశ్యాలను చూపిస్తూ ఇదేంటని ప్రశ్నించారు.

ఆళ్ల నానితోపాటు నరసాపురం, పాలకొల్లు పార్టీ నియోజకవర్గ కన్వీనర్లు ముదునూరి ప్రసాదరాజు, గుణ్ణం నాగబాబు, సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్, ఇతర పార్టీ నేతలు మీడియాతో కలసి మొగల్తూరు నల్లంవారి తోటలో ఉన్న ఆనంద ఆక్వా ప్లాంట్‌ను మంగళవారం సందర్శించారు. ఇప్పటికీ ఉన్న ఈ పైప్‌లైన్లను ఐదునెలల కిందటే తొలగించేశారని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో చెప్పారని గుర్తుచేశారు. తరు వాత ఈ బృందం కార్మికుల ప్రాణాలను బలిగొన్న ప్లాంట్‌ ఆవరణలోని ట్యాంక్‌ను పరిశీలించింది. ఆ ట్యాంక్‌ నుంచి విషవాయువులకు సంబంధించిన దుర్వాసన ఇంకా తగ్గకపోవడాన్ని గమనించింది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా విద్యుదాఘాతం వల్ల ప్రమాదం జరిగినట్టుగా మసి పూసే ప్రయత్నం ఎలా చేస్తున్నారని ఆళ్ల నాని ప్రశ్నించారు. తరువాత ఈ బృందం గొంతేరు డ్రెయిన్‌ను పరిశీలించి వ్యర్థాలు ఎక్కడెక్కడ కలుస్తున్నాయనే దానిని చూసింది.

ఇక్కడకు వచ్చే దమ్ముందా..
అసెంబ్లీలో అబద్ధాలతో ప్రకటన చేసిన మంత్రి అచ్చెన్నకు దమ్ముంటే మీడియాతో కలసి ఫ్యాక్టరీ వద్దకు రావాలని నాని సవాల్‌ విసిరారు. ‘నీ అబద్ధాలకు రుజువులు అలాగే ఉన్నాయి. చూసైనా కళ్లు తెరుస్తావా’ అని ప్రశ్నించారు. తుం దుర్రులో ఆక్వా పార్క్‌ నిర్మాణం నిలిపేయాలంటూ ఉద్యమాలు ఉధృతమైన నేపథ్యంలో గత ఏడాది మార్చిలో స్థానిక రైతులు, మత్స్యకారులు, ప్రజలు ప్రభుత్వానికి మొగల్తూరులోని ఆనంద ప్లాంట్‌ విషయమై ఫిర్యాదు చేశారని చెప్పారు.

తుందుర్రులో వైఎస్‌ జగన్‌ పర్యటించిన అనంతరం ప్రభుత్వంలో కాస్త చలనం వచ్చి.. నవంబర్‌లో అధికారుల కమిటీ ఆనంద ఆక్వా ప్లాంట్‌ను పరిశీలించిందని చెప్పారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్టు నివేదిక ఇచ్చిన పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు.. పరిస్థితిలో మార్పు రాకపోతే నోటీసు కూడా ఇవ్వకుండా సీజ్‌ చేయాలని ఆదేశించిందని తెలిపారు. మరి అప్పుడు కార్మిక, పరిశ్రమలశాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్న ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు.

మరిన్ని వార్తలు