త్వరలో వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ విస్తృతం

11 Jan, 2014 03:29 IST|Sakshi

ఒంగోలు, న్యూస్‌లైన్: వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్‌ను త్వరలో విస్తృత పరచనున్నట్లు ఆ విభాగం రాష్ట్ర కన్వీనర్ నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో పలువురు న్యాయవాదులతో ఆయన శుక్రవారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన పేరుతో కాంగ్రెస్, టీడీపీలు రాజకీయాలు చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ధ్వజమెత్తారు. ఆ పార్టీ నేతల కుట్రలను ఎండగట్టేందుకు న్యాయవాదులు ముందుకు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో లీగల్ సెల్ కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కమిటీకి సంబంధించిన అంశాలపై న్యాయవాదులతో చర్చించారు. ప్రజా సమస్యలను పరిష్కరించలేని కాంగ్రెస్ పార్టీ.. రాష్ర్ట విభజన అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం.. ప్రజల అభీష్టానికి అండగా నిలవాల్సింది పోయి కాంగ్రెస్‌తో కుమ్మక్కైందని ఆరోపించారు.
 
 ఈ నేపథ్యంలో ఉత్సాహం, ఆసక్తి ఉన్న న్యాయవాదులతో కలిసి త్వరలోనే జిల్లా కమిటీని ఏర్పాటు చేస్తామని నాగేశ్వరరావు చెప్పారు. లీగల్ సెల్ రాష్ట్ర కమిటీ సభ్యుడు నాగిరెడ్డి మాట్లాడుతూ హైకోర్టులో సీమాంధ్ర న్యాయవాదులపై టీ న్యాయవాదుల దాడి అమానుషమన్నారు. అసెంబ్లీలో సమైక్యవాదం వినిపిస్తున్న గాదె వెంకటరెడ్డి చొక్కాను టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పట్టుకోవడం విచారకరమన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర న్యాయవాదులు 180 రోజుల నుంచి కోర్టుకు హాజరు కాకుండా ఆందోళనలు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సీమాంధ్ర న్యాయవాదుల శాంతియుత నిరసన చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని నాగిరెడ్డి చెప్పారు. సమావేశానికి హాజరైన న్యాయవాదులను వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ ఎంవీవీఎస్ వేణుగోపాల్ పరిచయం చేశారు. సమావేశంలో న్యాయవాదులు చావలి రమేశ్, వి.కోటేశ్వరరావు, నక్కల వీరాంజనేయులు, కుంచాల వెంకటేశ్వర్లు, రవిశంకర్, వి.గ్రేస్‌కుమారి, వై.వెంకటేశ్వరరెడ్డి, ఈ.సురేంద్రబాబు, ఎన్.ఈశ్వరరావు, టి.బాలాజీ, ఎస్.రఘునాథరెడ్డి, డి.రామారావు, ఎం.రామకృష్ణారావు, జీవీ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు