ఏపీ సర్కార్ దొంగదెబ్బ!

31 Mar, 2017 21:38 IST|Sakshi
ఏపీ సర్కార్ దొంగదెబ్బ!

బడ్జెట్ సమావేశాలు ముగిసిన గంటల్లోనే కరెంట్ చార్జీల పెంపు
ఇది దుర్మార్గం, రాజకీయ దిగజారుడు
ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోండి
లేదంటే భారీ మూల్యం తప్పదు: వైఎస్ఆర్ సీపీ


అమరావతి: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ముగిసిన కొన్ని గంటల్లోనే విద్యుత్తు చార్జీలు పెంచటం టీడీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేఖ మనస్తత్వానికి, రాజకీయ దిగజారుడుకు నిదర్శనమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి విద్యుత్తు చార్జీలు పెంచాలన్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని పార్టీ హెచ్చరించింది. ఈ మేరకు ఆ పార్టీ ఓ పత్రికా ప్రకటనలో పలు విషయాలను పేర్కొంది.

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగేళ్లలోనే మూడుసార్లు ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపడాన్ని వైఎస్ఆర్ సీపీ తీవ్రంగా ఆక్షేపించింది. విద్యుత్తు చార్జీల పెంపు మీద ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు ఏమన్నారో గుర్తుచేసుకోవాలని, కరెంట్ చార్జీలు వీలుంటే తగ్గిస్తాం అన్న చంద్రబాబు ముచ్చటగా మూడోసారి చేస్తున్న ఈ దుర్మార్గాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించింది.

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన మరుక్షణమే రూ.800 కోట్ల మేర విద్యుత్ చార్జీలు పెంచుతూ అధికారికంగా ప్రకటన చేయడం అంటే ప్రజలను దొంగ దెబ్బతీయటమేనని పేర్కొంది. 2009తో పోలిస్తే అంతర్జాతీయ మార్కెట్‌లో బొగ్గు ధరలు సగం కంటే ఎక్కువగా తగ్గాయని, ఇలాంటి సమయంలో విద్యుత్తు చార్జీలను పెంచాల్సిన అవసరమే లేదని ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ స్పష్టం చేసింది. విద్యుత్ పంపిణీ సంస్థలకు చెల్లించాల్సిన సబ్సిడీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఎత్తున ఎగవేయటం వల్లే డిస్కమ్‌లు ఆ భారాన్ని ప్రజల మీద మోపుతున్నాయన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని పార్టీ అభిప్రాయపడింది. విద్యుత్ చార్జీల పెంపును వెంటనే వెనక్కు తీసుకొని పక్షంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికావటంతో పాటు భారీ మూల్యం చెల్లించుకొనక తప్పదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.

2017-18 ఏడాదికిగానూ 3.6 శాతం విద్యుత్‌ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పెరిగిన ఛార్జీలు శనివారం నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా ఛార్జీల పెంపు నుంచి వ్యవసాయ విద్యుత్‌కు మినహాయింపు లభించగా, అలాగే గృహ వినియోగదారులకు 1-200 యూనిట్ల వరకూ ఎలాంటి పెంపు లేదు. 200 యూనిట్లు నుంచి 500 వందల యూనిట్ల వరకూ 3శాతం పెంచింది. విద్యుత్‌ ఛార్జీల పెంపుతో రూ.800 కోట్లు భారం పడనుంది.

మరిన్ని వార్తలు