7 రోజులూ సమరమే

12 Dec, 2013 01:21 IST|Sakshi
7 రోజులూ సమరమే

సాక్షి, హైదరాబాద్: శాసనసభ శీతాకాల సమావేశాలు ఏడు రోజులు జరగనున్నాయి. గురువారం ప్రారంభమై డిసెంబర్ 20వ తేదీ శుక్రవారంతో ముగుస్తాయి. బుధవారం సాయంత్రం శాసనసభాపతి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన సభా వ్యవహారాల మండలి (బీఏసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు బీఏసీ భేటీకి హాజరు కాలేదు.
 
 డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ఎన్.రఘువీరారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి, విప్‌లు ఆరేపల్లి మోహన్, ఈరావత్రి అనిల్, వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష నేత వైఎస్ విజయలక్ష్మి, పార్టీ ఎమ్మెల్యేలు భూమా శోభా నాగిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మేకతోటి సుచరిత, టీడీఎల్పీ ఉప నేతలు గాలి ముద్దుకృష్ణమనాయుడు, పి.అశోక్ గజపతిరాజు, మోత్కుపల్లి నర్సింహులు, పార్టీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకరరావు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, టీఆర్‌ఎస్ పక్ష నేత ఈటెల రాజేందర్ , పార్టీ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు, మజ్లిస్ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, బీజేపీ పక్ష నేత యెండల లక్ష్మీనారాయణ, సీపీఐ పక్ష నేత గుండా మల్లేశ్, సీపీఎం పక్ష నేత జూలకంటి రంగారెడ్డి, లోక్‌సత్తా పక్ష నేత జయప్రకాశ్ నారాయణ్ తదితరులు భేటీలో పాల్గొన్నారు. సభను రెండు రోజులు మాత్రమే నిర్వహిస్తామని ప్రభుత్వం తరఫున ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తొలుత ప్రతిపాదించారు. అయితే విపక్షాలు అందుకు అంగీకరించలేదు. సభను ఏటా 50 రోజులకు తగ్గకుండా నిర్వహించే సంప్రదాయముందని, దాన్ని పాటించాలని డిమాండ్ చేశాయి. ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. మరో రోజు పెంచుతామని పేర్కొంది. 15 రోజులు జరపాలని టీఆర్‌ఎస్, 10 రోజులు జరపాలని టీడీపీ డిమాండ్ చేశాయి. చివరికి దామోదర జోక్యం చేసుకుని, గత శీతాకాల సమావేశాల మాదిరిగానే 7 పనిదినాల పాటు సభ జరుగుతుందని చెప్పారు.
 
 విభజన సరికాదు: విజయమ్మ
 
 బీఏసీ ప్రారంభంలోనే విజయమ్మ మాట్లాడారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, విభజన సరికాదని అన్నారు. సమైక్యాంధ్రను కోరుతూ సభలో తీర్మానం చేసి  కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు సమైక్యాంధ్రప్రదేశ్‌ను కోరుతున్నందున వారి మనోభావాలను గుర్తించి సభలో తీర్మానం చే యాలని ప్రతిపాదించారు.
 
 అందుకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. మంత్రులు ఆనం, రఘువీరా, టీడీపీ నేతలు అశోక్‌గజపతిరాజు, ధూళిపాళ్ల తదితరులు మౌనం దాల్చారు. సమైక్యమన్న పదం కూడా వారి నోటి నుంచి రాలేదు. గాలి తనతో పాటు తెచ్చిన పత్రం చదివారు. విభజనపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల తీరు అప్రజాస్వామికమన్నారు. సమైక్యాంధ్ర తీర్మానం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆ ప్రతిపాదనకు ఎర్రబెల్లి అడ్డు తగిలారు. తెలంగాణకు అనుకూలంగా పార్టీ నిర్ణయం తీసుకున్నాక ఇప్పుడిక్కడ సమైక్యాంధ్ర తీర్మానం చేయాలని ఎలా ప్రతిపాదిస్తారు? తెలంగాణ ఏర్పాటు అప్రజాస్వామికమనడమేమిటి? బీఏసీలో ఏం చెప్పాలో పేర్కొంటూ పార్టీ ముందే తయారు చేసిచ్చిన కాగితంలో అప్రజాస్వామికం అన్న పదం లేకపోయినా దాన్నెలా చదువుతారు?’ అని ప్రశ్నించారు.
 
 గాలి అన్న ‘అప్రజాస్వామికం’ అనే మాటలను పట్టించుకోవద్దని స్పీకర్‌ను కోరారు. టీడీపీ రెండు నాల్కల ధోరణి చూసి ఇతర పార్టీల నే తలంతా అవాక్కయ్యారు. సమైక్య తీర్మానం చేయాలన్న వైఎస్సార్‌సీపీ ప్రతిపాదనకూ ఎర్రబెల్లి అభ్యంతరం తెలిపారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి గతంలో అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం చేయించారని, ఇప్పుడు సమైక్య తీర్మానమెలా అడుగుతారని ప్రశ్నించారు. అయితే సీఎంగా వైఎస్ అసెంబ్లీలో ఎప్పుడూ తెలంగాణపై తీర్మానం చేయలేదని, అదంతా అసత్య ప్రచారమని శోభా నాగిరెడ్డి వెంటనే అభ్యంతరం చెప్పారు. తెలంగాణ పై స్టేక్‌హోల్డర్లతో చర్చించి ఏకాభిప్రాయానికి రావాలని, విభజన వల్ల తలెత్తే సమస్యల పరిష్కారంపై చర్చ జరగాలని, ఇందుకు రోశయ్య నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మాత్రమే ప్రకటన చేశారని గుర్తు చేశారు. దాన్నే తెలంగాణపై తీర్మానమంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సమైక్య తీర్మానం చేయడానికి ప్రభుత్వం అంగీకరించకపోవడంతో వైఎస్సార్‌సీపీ ప్రతినిధులు నిరసన తెలిపి వాకౌట్ చేశారు.
 
 
 సమావేశాల తొలి రోజు గురువారం దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మృతికి నివాళులు అర్పించాలని, తర్వాత ఇటీవలి వరదలతో నష్టపోయిన రైతాంగానికి సహాయక చర్యలపై చర్చించాలని బీఏసీలో నిర్ణయించారు. విభజన బిల్లు సభకు ఎప్పుడొస్తుందని ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ప్రశ్నించారు. ఇది ఊహాజనితమైన ప్రశ్న అంటూ ప్రభుత్వం బదులిచ్చింది. బిల్లు సభకు రాగానే సభ్యులకు తెలియజేస్తామని, తరవాత బీఏసీని సమావేశపరిచి చర్చకు తేదీని నిర్ణయిస్తామని సభాపతి హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతారన్న ప్రచారం సాగుతోందని అక్బరుద్దీన్ ప్రస్తావించారు. అప్పుడు బిల్లు కన్నా ముందే అవిశ్వాసాన్ని చేపడతారా అని అడిగారు. అది ఊహాగానమని, అవిశ్వాసం వచ్చినప్పుడు ఆలోచిస్తామని ప్రభుత్వం పేర్కొంది. బీఏసీకి ముందు దామోదర కాసేపు స్పీకర్‌తో ఆయన చాంబర్లో భేటీ అయ్యారు. తరవాత ఈటెల, హరీశ్‌లతో కలిసి ఎంఐఎంఎల్పీ కార్యాలయానికి వెళ్లారు.
 
 18 దాకా మండలి
 శాసనమండలి బీఏసీ సమావేశం చైర్మన్ చక్రపాణి అధ్యక్షతన జరిగింది. మండలి సమావేశాలను డిసెంబర్ 18 దాకా జరపాలని నిర్ణయించారు.
 
 బీఏసీ అనంతరం ఎవరేమన్నారంటే..
 
 సమైక్య తీర్మానం ప్రతిపాదిస్తాం: విజయమ్మ
 ‘‘సభలో సమైక్య తీర్మానం ప్రతిపాదిస్తాం. ఎవరు మద్దతిచ్చినా తీసుకుంటాం. సమైక్యంగా ఉంచాలంటూ సభలో తీర్మానం చేయాలని బీఏసీలో కోరితే ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. అందుకే వాకౌట్ చేశాం. వరుస తుపానులు, ధరల పెరుగుదల, విద్యుత్ చార్జీల పెంపు, బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు తదితరాలపై సభలో చర్చించాలి’’
 ప్రభుత్వం భయపడుతోంది: ముద్దుకృష్ణమ
 ‘సమస్యలపై చర్చకు ప్రభుత్వం భయపడుతోంది’
 తక్షణం చర్చించాలన్నాం: ఈటెల
 ‘విభజన బిల్లు సభకు వచ్చిన వెంటనే చర్చకు చేపట్టాలని బీఏసీలో డిమాండ్ చేశాం. ప్రజా సమస్యలపైనా చర్చించాలని పట్టుబట్టాం’
 అంబేద్కర్ విగ్రహం పెడతామన్నారు: హరీశ్
 ‘అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు బీఏసీలో స్పీకర్ వెల్లడించారు’
 రెండు వారాలు జరపాలన్నాం: గుండా మల్లేశ్
 ‘పలు ప్రజా సమస్యలున్నందున కనీసం రెండు వారాలపాటైనా అసెంబ్లీని నిర్వహించాలని కోరాం’
 బీఏసీలో కొత్త సంప్రదాయం: జూలకంటి
 ‘ఎన్ని రోజులు సభ నిర్వహిస్తారు, ఏ బిల్లులు చర్చిస్తారో ముందుగా చెప్పేవారు. ఈసారి అలా చేయకుండా బీఏసీలో కొత్త సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు’
 

మరిన్ని వార్తలు