అవిశ్వాసాన్ని ఉపసంహరించుకోలేదు: మైసూరారెడ్డి

18 Jan, 2014 03:00 IST|Sakshi
అవిశ్వాసాన్ని ఉపసంహరించుకోలేదు: మైసూరారెడ్డి

వైఎస్సార్ కాంగ్రెస్ నేత మైసూరారెడ్డి స్పష్టీకరణ
పార్లమెంటు 8 రోజులు సమావేశమైతే 7 రోజులు అవిశ్వాస నోటీసులిచ్చాం..
‘లోక్‌పాల్’పై చర్చ నేపథ్యంలో ఆ ఒక్కరోజు మాత్రమే వారుుదా వేయమని కోరాం
ఆ తర్వాత లోక్‌సభను అర్ధంతరంగా ముగించారు

 
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఇచ్చిన అవిశ్వాస నోటీసులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉపసంహరించుకుందంటూ టీడీ పీ అసత్య ప్రచారం చేస్తూ దగుల్బాజీ రాజకీయాలకు పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి ధ్వజమెత్తారు. దేశ ప్రజలందరూ ఎదురుచూస్తున్న లోక్‌పాల్ బిల్లుపై సభలో చర్చ ఉన్న నేపథ్యంలో తామిచ్చిన అవిశ్వాస నోటీసులను ఒక రోజు వాయిదా వేయమని మాత్రమే కోరాం తప్ప ఉపసంహరించుకోలేదని స్పష్టం చేశారు. అబద్ధాలకు అలవాటు పడిన టీడీపీ నేతలు ఈ విషయంలో వైఎస్సార్‌సీపీపై బురద జల్లుతున్నారని చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌లోని అసంతృప్తవాదులు, టీడీపీతో కలసి లోక్‌సభ మొదటిరోజునే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
 
  విచిత్రమేమిటంటే.. అందులో రాష్ట్రాన్ని విభజిస్తున్నది ఒక పార్టీ అయితే, అందుకు సహకారంగా లేఖ ఇచ్చింది మరోపార్టీ. రాష్ట్రాన్ని విభజిస్తున్న కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించి ఈ ప్రక్రియను ఆపాల్సిన ఆ పార్టీ ఎంపీలు ఆ పని చేయకుండా అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. వారు ఏ ఉద్దేశంతో ఇచ్చినా యావత్ దేశానికి పరిస్థితిని వేలెత్తి చూపించడం కోసం, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాటం చేస్తున్న పార్టీగా మేం కూడా మద్దతిచ్చాం. పార్లమెంటు 8 రోజులు సమావేశమైతే అందులో 7 రోజుల పాటు అవిశ్వాస నోటీసులు ఇచ్చాం.  దేశ ప్రజలు ఎదురు చూస్తున్న లోక్‌పాల్ బిల్లు సభలో చర్చకు వచ్చినందున సదుద్దేశంతో ఆ ఒక్క రోజు నోటీసును మరుసటి రోజుకు వాయిదా వేయమని కోరాము తప్ప ఉపసంహరించుకోలేదు. అయితే లోక్‌పాల్ బిల్లు పూర్తికాగానే సభను అర్ధంతరంగా ముగించారు. ఆ రోజే లోక్‌సభకు చివరిరోజున్న విషయం సభలో ఎవరికీ తెలియదు..’’ అని స్పష్టం చేశారు.  
 
 మద్దతు కూడగడితే.. పక్కదారిపట్టించారు!
 ‘‘మా పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి దేశమంతా తిరిగి అన్ని ప్రాంతీయ పార్టీలనూ కలసి రాష్ట్ర విభజన ప్రక్రియలో రాజ్యాంగ దుర్వినియోగం జరుగుతోందని చెప్పి ఒప్పించారు. వారంతా సభలో వాయిదా తీర్మానం ఇస్తే మద్దతిస్తామని హామీ ఇచ్చారు కూడా. కానీ టీడీపీ, కాంగ్రెస్‌కు సంబంధించిన సీమాంధ్ర ఎంపీలు అవిశ్వాస తీర్మానం ఇవ్వడం ద్వారా.. ప్రస్తుత పరిస్థితి అవిశ్వాసానికి అనువైన సమయం కాదంటూ ఇతర ప్రాంతీయ పార్టీలు మద్దతు తెలపకుండా వెనక్కి తగ్గేందుకు కారణమయ్యారు. అయినప్పటికీ రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, కేంద్రం చేస్తున్నది అధికార దుర్వినియోగమని ఎత్తి చూపించడం కోసం, వాళ్ల ఎంపీలే అవిశ్వాసం నోటీసిచ్చినా మేము మద్దతు ఇచ్చాం..’’ అని మైసూరా తెలిపారు.
 
 అవిశ్వాసం వీగిపోతుందనే పాట్నా వెళ్లలేదు
 ‘‘బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను కలిసేందుకు తమకు కేటాయించిన సమయం ప్రకారం అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించిన రోజున మాకు విపత్కర పరిస్థితి ఎదురైంది. ఒక వేళ పాట్నా వెళ్లిన సమయంలో సభలో అవిశ్వాసం ప్రస్తావన వస్తే సరైన బలం లేక వీగిపోతే రాష్ట్రం పరువు పోతుందని ఆ కార్యక్రమం రద్దు చేసుకున్నాం. అవిశ్వాసం ఇచ్చిన ఎంపీలు దానిపై చర్చకు కావాల్సిన కనీసం 50 మంది ఎంపీల మద్దతును కూడగట్టలేకపోయారు. నోటీసులిచ్చిన సభ్యులు మీ స్థానాల్లో నిలబడితే లెక్కించి.. 50 మంది ఉంటే అనుమతిస్తానని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నేతలు పట్టించుకోకుండా సభలో గందరగోళం సృష్టించారు..’’ అని ఆయన గుర్తుచేశారు.
 
 అసెంబ్లీలో పారిపోరుుంది టీడీపీ కాదా?
 ‘‘విభజనకు కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏడాది క్రితం అసెంబ్లీలో అన్ని పార్టీలు కలసి అవిశ్వాసం పెడితే మద్దతివ్వకుండా పారిపోయి, పరోక్షంగా ప్రభుత్వం నిలవడానికి కారణమైంది టీడీపీ కాదా? సిగ్గులేని వ్యవహారాలు నెరపడం టీడీపీ నేతలకే చెల్లుబాటవుతుంది. ప్రస్తుతం అసెంబ్లీలో కూడా రాష్ట్ర విభజన కావాలని తెలంగాణకు చెందిన టీడీపీ నేతలు మాట్లాడుతున్నా.. బాబు మౌనంగా కూర్చుండిపోవడం ఎంత సిగ్గుచేటు వ్యవహారం?. పార్టీకి ఒక లైను, సిద్ధాంతమంటూ లేకుండా లేనిపోని ఆరోపణలు చేయడం టీడీపీ నేతలకే తగును’’అని అన్నారు.

మరిన్ని వార్తలు