ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టొద్దు

8 Jun, 2015 03:28 IST|Sakshi

మెజార్టీ లేని చోట అభ్యర్థిని ప్రకటించడంలో ఆంతర్యమేంటి?
సొంతింటి వ్యవహారంలా రాజధాని భూమిపూజ కార్యక్రమం
చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి ధ్వజం
 
 సాక్షి, కర్నూలు : నీతికి నిజాయితీకి మారుపేరు.. అంటూ ఎప్పుడూ గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  కర్నూలు, ప్రకాశం జిల్లాలో టీడీపీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని నిలబెట్టరాదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం ఎస్వీ రెజెన్సీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికలను దమాషా పద్ధతిలో నిర్వహించాలంటున్న చంద్రబాబు మెజార్టీ లేకపోయినా కర్నూలు, ప్రకాశం జిల్లాలో టీడీపీ అభ్యర్థుల్ని నిలబెట్టడం వెనుక ఆంతర్యమేంటో స్పష్టం చేయాలన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంలేని చోట అభ్యర్థుల్ని నిలబెట్టడం లేదన్నారు. కర్నూలు జిల్లాలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు అత్యధికంగా వైఎస్సార్‌సీపీ మద్ధతులో గెలిచిన వారేనని, వారిలో కొందర్ని ప్రలోభాలతో తమవైపు తిప్పుకున్నారని విమర్శించారు. రాజధాని భూమిపూజకు  శాసనసభ్యులకు సమాచారం ఇవ్వలేదని, రాజధాని అంటే ఆయన సొంతింటి వ్యవహారం కాదని ప్రజలు దీన్ని గమనిస్తున్నారన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే మణిగాంధీ, మాజీ కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి డి. వెంకటేశ్వరరెడ్డి, యువజన విభాగం నేత రాజావిష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   
 
 వేరే పార్టీకి ఓటేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్లే
 రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు వైఎస్సార్‌సీపీకి రుణం తీ ర్చుకునే అవకాశం వచ్చిందని కర్నూలు ఎమ్మె ల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. పార్టీ తరపున గెలిచిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు,  కౌన్సిలర్లు వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి కాకుండా వేరొక పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్లే అవుతుందన్నారు.

వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విషయంలో ప్రజాస్వామ్య బద్ధంగా జిల్లా నేతలతో సుదీర్ఘంగా చర్చించాకే అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెంకటేశ్వరరెడ్డిని ప్రకటించారని చెప్పారు. తెలంగాణలో ఓ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం ఏకంగా రూ. 90 కోట్లు వెచ్చించడానికి సిద్ధపడిన టీడీపీ నాయకులు జిల్లాలో ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడతారోనన్న అనుమానాలున్నాయని చెప్పారు. ఎన్నికలు సజావుగా జరగడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను కోరుతామన్నారు.       
     -  ఎస్వీ మోహన్‌రెడ్డి

మరిన్ని వార్తలు