కాకినాడ తీరంలో జనజలధి..

9 Apr, 2019 09:22 IST|Sakshi

సాక్షి ,కాకినాడ: సార్వత్రిక ఎన్నికల ప్రచార వేళ.. కాకినాడ తీరంలో జనజలధి ఉప్పొంగింది. ఓవైపు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మరోవైపు ఆయన సోదరి షర్మిల జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలకు ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకున్న తరుణంలో జరిగిన ఈ సభలు విజయవంతం కావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. చంద్రబాబు, పవన్‌ కుమ్మక్కు రాజకీయాలను ఎండగడుతూ జగన్, షర్మిల చేసిన ప్రసంగాలు వారిని మరింత ఉత్సాహపరిచాయి.

కాకినాడ రూరల్‌ ఇంద్రపాలెంలో  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగం ఉత్తేజాన్ని నింపింది. మరోవైపు రాజమహేంద్రవరం సిటీ జాంపేట, రాజమహేంద్రవరం రూరల్‌ ధవళేశ్వరంలలో షర్మిల స్థానిక అంశాలను ప్రస్తావిస్తూ చేసిన ప్రసంగాలు కూడా పార్టీ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపాయి. ‘సింహం సింగిల్‌గానే వస్తుంది’ అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. రెండు సభల్లోనూ ‘జగన్‌ సీఎం’ అంటూ జనం చేసిన నినాదాలు మిన్నంటాయి. ఇరు ప్రాంతాల్లోనూ పార్టీ జెండాల రెపరెపలు, కార్యకర్తల కోలాహలం, ప్రజల నుంచి వచ్చిన అపూర్వ స్పందనతో పార్టీలో సందడి నెలకొంది. రెండు రోజుల్లో పోలింగ్‌ జరగనున్న తరుణంలో అగ్రనేతల సభలు పార్టీ విజయావకాశాలను మరింత మెరుగుపర్చాయంటూ కేడర్‌ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది.


స్మార్ట్‌సిటీ ఎక్కడ?
తూర్పు గోదావరి జిల్లాను, కాకినాడను చంద్రబాబు మోసం చేశారని ఇంద్రపాలెంలో జరిగిన బహిరంగ సభలో జగన్‌ ధ్వజమెత్తారు. కాకినాడను స్మార్ట్‌సిటీ చేస్తానన్న చంద్రబాబు దాని సంగతి దేవుడెరుగు.. కనీసం అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కూడా నిర్మించలేదన్నారు. 19 నియోజకవర్గాలున్న జిల్లాలో ఏకంగా 14 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ప్రజలు టీడీపీకి పట్టం కడితే.. అదిచాలక చంద్రబాబు కుట్రలు చేసి, ప్రలోభాలు పెట్టి సంతలో పశువులను కొన్నట్టుగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని జగన్‌ మండిపడ్డారు.

మొత్తం 19 మంది ఎమ్మెల్యేల్లో 17 మందిని చంకలో పెట్టుకుని ఈ జిల్లాకు చంద్రబాబు చేసిందేమిటని నిలదీశారు. ఇక్కడ భారీ పరిశ్రమల సంగతలా ఉంచితే కనీసం చిన్నతరహా పరిశ్రమలు కూడా ఎక్కడా కనిపించడంలేదని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా రాకుండా కేంద్రం వద్ద ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. వైఎస్సార్‌ సీపీని గెలిపిస్తే ఒకేసారి 2.30 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.


మహిళలకు రక్షణ ఏదీ?
తెలుగుదేశం పాలనలో మహిళలకు రక్షణ కరువైందని రాజమహేంద్రవరం రోడ్‌షోలో షర్మిల విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మహిళా తహసీల్దార్‌ వనజాక్షిని జుట్టు పట్టుకుని ఈడ్చుకు వెళ్తుంటే చంద్రబాబు ఏం చేశారని నిలదీశారు. ఇపుడు అక్కచెల్లెమ్మలకు అన్ననంటూ ఊదరగొడుతున్న చంద్రబాబు.. వనజాక్షి విషయంలో ఏం చేశారని, అప్పుడు ఈ అన్న చచ్చిపోయాడా అని ప్రశ్నించారు. టీడీపీ నాయకుడు హింసిస్తుంటే భరించలేక రిషితేశ్వరి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటనను ప్రస్తావిస్తూ.. ఆ పాప ఆత్మహత్య చేసుకుంటుంటే చంద్రబాబులోని అన్న ఏమైపోయాడని నిలదీశారు.

అంగన్‌వాడీ కార్యకర్తలను లాఠీలతో కొట్టించడం, మధ్యాహ్న భోజనం పథకాలను ప్రైవేటు ఏజెన్సీలకు ఇవ్వవద్దని మహిళలు ఆందోళన చేస్తే కొట్టినప్పుడు చంద్రబాబులోని అన్న  ఎక్కడ ఉన్నాడని షర్మిల ప్రశ్నించినప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.

మరిన్ని వార్తలు