హామీలనే మాఫీ చేస్తున్న చంద్రబాబు

30 Sep, 2014 03:19 IST|Sakshi

* ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ రైతు విభాగం
* రైతులకిచ్చిన హామీలు అమలు చేయకపోతే పోరాటమే

సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వస్తే రైతుల పంట రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు తానిచ్చిన హామీలనే మాఫీ చేసే యత్నంలో పడిపోయారని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం దుయ్యబట్టింది. బాబు ఎన్నికల సమయంలో రైతులకిచ్చిన హామీలను అమలు చేయకపోతే రైతుల తరపున పోరాటం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ వ్యవసాయరంగం సంక్షోభంలో ఉందని, రైతుల సమస్యలపై క్రియాశీలంగా ఉంటూ ఎప్పటికపుడు వాటి పరిష్కారానికి ఉద్యమించాలని తీర్మానించింది. రైతు విభాగం అధ్యక్షుడు ఎం.వి.ఎస్.నాగిరెడ్డి అధ్యక్షతన సోమవారం మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ పరిస్థితులపై లోతుగా చర్చించారు. పార్టీ పర్యవేక్షణ కమిటీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి హాజరైన ఈ సమావేశంలోనే తొలి అధ్యక్షునిగా నాగిరెడ్డి పదవీ స్వీకారం చేశారు. షరతుల్లేకుండా రైతుల పంట రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని, వ్యవసాయ పంటలకు మద్దతు ధర కల్పిస్తామని, రూ.ఐదు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని చంద్రబాబు ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను అమలు చేయడం లేదని సమావేశం దుయ్యబట్టింది. జిల్లాల వారీ గా పరిస్థితిని సమీక్షిస్తూ మొత్తం మీద ఒక్క ప్రత్తి మినహా అన్ని పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోవడంపట్ల ఆందోళన వ్యక్తం చేసింది.  కనీస మద్దతు ధరను నామమాత్రంగా ప్రకటిస్తున్నా కేంద్రం వైఖరిని రాష్ట్రం ప్రశ్నించకపోవడాన్ని సమావేశం గర్హించింది.
 
 బలవంతంగా భూసేకరణ చేస్తే ఊరుకోం..
 రాజధాని నిర్మాణం పేరుతో కృష్ణా, గుంటూరు జిల్లాల రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తే వైఎస్సార్‌సీపీ రైతు విభాగం ప్రతిఘటిస్తుందని సమావేశం హెచ్చరించింది. స్వచ్ఛం దంగా ముందుకు వచ్చే రైతుల నుంచే ల్యాండ్ పూలింగ్ విధానంలో భూమిని తీసుకుంటామని తొలుత చెప్పిన టీడీపీ ప్రభుత్వం ఇపుడు బల వంతంగానైనా సరే తీసుకుంటామని మాట్లాడుతున్నారని, ఇదెంత మాత్రం శ్రేయస్కరం కాదని రైతు ప్రతినిధులు హెచ్చరించారు. సమావేశానంతరం అధ్యక్షుడు నాగిరెడ్డి, విజయసాయిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ... ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా రైతుల తరపున ఎలా పోరాడాలో అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకున్నామని చెప్పారు. షరతుల్లేకుండా పంట రుణాల మాఫీ, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయకుండా చంద్రబాబు రైతులను మోసం చేశారని విమర్శించారు. సమావేశంలో జిల్లాల రైతు నేతలు కొల్లి రాజశేఖర్, శ్రీధర్, రాజబావు, మధుసూదనరెడ్డి, ప్రసాదరెడ్డి , ఆదికేశవరెడ్డి , సుబ్రమణేశ్వరరెడ్డి,సుబ్బారెడి, శివరామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు