మోసకారి చంద్రబాబు

9 Jun, 2016 00:25 IST|Sakshi

 ప్రజలను వంచించిన టీడీపీ ప్రభుత్వం
 ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలం
  వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి
  ‘బాబు’ మోసాలపై పది పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు

 
 శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళంలో పార్టీ జిల్లా కార్యాలయం నుంచి జీటీ రోడ్డు మీదుగా స్థానిక రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ వరకూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేదని, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం 420 కేసు కిందకి వస్తున్నందున ప్రభుత్వంపై కేసు నమోదు చేయాలని కోరుతూ శ్రీకాకుళం రెండో పట్టణ సీఐ దాడి మోహనరావుకు ఫిర్యాదు అందజేశారు. ప్రభుత్వంపై కేసు నమోదు చేయూలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, నాయకులు అంధవరపు సూరిబాబు, ఎం.వి.పద్మావతి, శిమ్మ రాజశేఖర్, ఎన్ని ధనుంజయ్, సురంగి మోహనరావు పాల్గొన్నారు.
 
 ఆమదాలవలసలో...
 ఆమదాలవలసలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం, జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి పాల్గొన్నారు. తమ్మినేని స్వగృహం నుంచి ర్యాలీగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి బాబు చేసిన మోసంపై సీఐ డి.నవీన్‌కుమార్‌కు ఫిర్యాదు అందజేశారు. తక్షణమే బాబును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు తమ్మినేని చిరంజీవినాగ్, బొడ్డేపల్లి రమేష్‌కుమార్, కేవీజీ సత్యనారాయణ  పాల్గొన్నారు.
 
 ఎచ్చెర్ల నియోజకవర్గంలో..
 చంద్రబాబు రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని వైఎస్సార్‌సీపీ ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వకర్త గొర్లె కిరణ్‌కుమార్ అన్నారు. హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసినందుకుగాను చంద్రబాబును అరెస్టు చేయాలని కోరుతూ రణస్థలం పోలీస్ స్టేషన్‌లో పార్టీ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. ఎచ్చెర్ల, లావేరు, జి. సిగడాం రణస్థలం మండలాలకు చెందిన పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
 
 రాజాంలో..
 రాజాంలో ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి స్థానిక పోలీస్‌స్టేషన్ వరకూ బైక్ ర్యాలీగా వెళ్లి.. బాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై సీఐ శంకరరావుకు ఫిర్యాదు అందజేశారు. ముఖ్యమంత్రిని తక్షణమే అరెస్టు చేయూలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు ఉత్తరావల్లి సురేష్‌ముఖర్జీ, పాలవలస శ్రీనివాసరావు, కరణం సుదర్శనరావు, ఉదయాన మురళి, వావిలపల్లి జగన్మోహనరావు పాల్గొన్నారు.
 
 నరసన్నపేటలో..
 నరసన్నపేటలో నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు పోలీసు స్టేషన్ వరకూ ర్యాలీగా వెళ్లి హెచ్‌సీ అసిరినాయుడుకు చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దాసన్న మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రకటించిన మేనిఫేస్టోలో ఏఒక్క హామీనీ అమలు చేయకుండా ప్రజలను చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. కార్యక్రమంలో సారవకోట జెడ్పీటీసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియ, జలుమూరు ఎంపీటీసీ కొయ్యాన సుశీల, నరసన్నపేట, పోలాకి, జలుమూరు మండలాల నాయకులు చింతు రామారావు, రాజాపు అప్పన్న, కరిమి రాజేశ్వరరావు, కొయ్యాన సూర్యం, మెండ రాంబాబు పాల్గొన్నారు.
 
 పాలకొండలో...
 పాలకొండలో ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి పాలవలస విక్రాంత్‌ల ఆధ్వర్యంలో చంద్రబాబుపై డీఎస్పీ సీహెచ్ ఆదినారాయణ, సీఐ వేణుగోపాలరావుకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో పాటు పథకాల నిర్వహణలో, రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడంలో సీఎం ద్వంద్వ వైఖరి అవలంబించారని, ప్రజలను మోసగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తొలుత స్థానిక ఏలాం కూడలి నుంచి నాలుగు మండలాలకు చెందిన కన్వీనర్లు కనపాక సూర్యప్రకాష్, దమలపాటి వెంకటరమణ, జి.సుమిత్రరావు, తోట సింహాచలం, సీతంపేట ఎంపీపీ ఎస్.లక్ష్మి, జెడ్పిటీసీ సభ్యుడు రాజబాబులతో కలిసి పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు.
 
 పాతపట్నంలో..
  పాతపట్నం నియోజకవర్గంలో చంద్రబాబు నయవంచన పాలనకు నిరసనగా పోలీసులకు వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు ఫిర్యాదు చేశారు. పాతపట్నంలో మెళియాపుట్టి మండలానికి చెందిన  పార్టీ నాయకుడు సలాన మోహనరావు ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి సీఐ జె.శ్రీనివాసరావుకు ఫిర్యాదును అందజేశారు.
 
 టెక్కలిలో..
 ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసగించిన చంద్రబాబును తక్షణమే అరెస్ట్ చేయాలని వైఎస్సాఆర్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి దువ్వాడ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స్థానిక వైఎస్సాఆర్ కూడలిలో గల వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పార్టీ శ్రేణులు నివాలులర్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి న్యాయవాది పి.అరుణ్‌కుమార్ సమక్షంలో సీఎం చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దువ్వాడ వాణి, జిల్లా అధికార ప్రతినిధి రొక్కం సూర్యప్రకాశ్, రాష్ట్ర కార్యదర్శి పీరుపల్లి రాజా, మండల కన్వీనర్ బి.గౌరీపతి తదితరులు పాల్గొన్నారు.

 పలాసలో... ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగించిన చంద్రబాబును అరెస్టు చేయూలని డిమాండ్ చేస్తూ వైఎస్‌ఆర్  కాంగ్రెస్ పార్టీ నాయకులు కాశీబుగ్గ ఎస్‌ఐ బి.శ్రీరామ్మూర్తికి మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జుత్తు జగన్నాయకులు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో పార్టీ పలాస-కాశీబుగ్గ పట్టణ కమిటీ అధ్యక్షుడు, మండల కమిటీ అధ్యక్షుడు, మందస, వజ్రపుకొత్తూరు మండలాల అధ్యక్షులు దువ్వాడ శ్రీకాంత్, పైల వెంకటరావు, గున్న శ్రీనివాసరావు,  మరడ భాస్కరరావు, జిల్లా కార్యదర్శి పాలిన శ్రీనివాసరావు పాల్గొన్నారు.
 
 ఇచ్ఛాపురంలో.. చంద్రబాబుపై ఇచ్ఛాపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అంతకుముందు బస్టాండ్ కూడలిలోని దివగంత వైఎస్  విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. నియోజకవర్గ సమన్వయకర్తలు పిరియా సాయిరాజ్, నర్తు రామారావు, మున్సిపల్ చైర్‌పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, కంచిలి ఎంపీపీ ఇప్పిలి లోలాక్షి పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు