పదో వసంతంలోకి వైఎస్సార్‌ సీపీ, సీఎం జగన్‌ ట్వీట్‌

11 Mar, 2020 21:00 IST|Sakshi

మీ అందరి దీవెనలు పార్టీకి ఎల్లవేళలా ఉండాలి: సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి  ఆశయాల స్ఫూర్తితో పుట్టిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రేపు (గురువారం) తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో ఏడాదిలోకి అడుగుపెట్టబోతుంది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. ‘వైఎస్సార్‌ సీపీ  రేపు 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నా వెంట నడిచిన పార్టీ కుటుంబసభ్యులకు,ఆదరించిన రాష్ట్ర ప్రజలందరికీ వందనాలు. ఏపీని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేలా మీ అందరి దీవెనలు పార్టీకి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.  

దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనే ధ్యేయంగా 12, మార్చి 2011న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించింది. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజానేతగా ఎదిగారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ జనబాహుళ్యం మెచ్చిన నేతగా మన్ననలందుకున్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా సుదీర్ఘ పాదయాత్ర చేసి, ప్రజలలో మమేకం అయిన వైఎస్‌ జగన్‌కు గత ఏడాది జరిగిన ఎన్నికల్లో జనం పట్టం కట్టారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లను గెలుచుకుని ప్రభంజనం సృష్టించింది.

కాగా పార్టీ స్థాపించి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గురువారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించనుంది.

మరిన్ని వార్తలు