క్షుద్ర పూజలు చేయించింది నువ్వు కాదా?

4 Oct, 2019 16:46 IST|Sakshi

చంద్రబాబుపై మండిపడ్డ రామచంద్రయ్య

సాక్షి, తాడేపల్లి : ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడిని ప్రజలు శిక్షించి 23 సీట్లకు పరిమితం చేసినా ఆత్మపరిశీలన చేసుకోకుండా ఉన్మాదిలా మాట్లాడుతున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధానకార్యదర్శి సి. రామచంద్రయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత ఐదేళ్లలో చేసిన దరిద్రపాలన గురించి మరిచిపోయారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తాడేపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

‘తిరుపతికి వెళ్ళినప్పుడు సీఎం సంతకం పెట్టలేదని మాట్లాడం సరికాదు. సంతకం అనేది జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగత విషయం. మనిషికి భక్తి ఉందా లేదా అనేది ముఖ్యం. జగన్‌మోహన్‌రెడ్డి ఒక్క తిరుపతినే కాదు అనేక పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై సంతకం చేయకపోతేనే తప్పుపట్టాలి. మరి మీరు చేసిన సంతకాల పరిస్థితి ఏమిటి? రుణమాఫీ, డ్వాక్రా, బెల్ట్ షాపుల రద్దు, బంగారం ఇంటికి తెస్తామని అనేక సంతకాలు చేశారు. కానీ ఏ ఒక్క సంతకాన్ని అమలు చేయలేదు. నీచ సంస్కృతికి చంద్రబాబు విషవృక్షం లాంటివాడు. ఎన్టీఆర్‌పై రాయలేని భాషలో మాట్లాడింది చంద్రబాబు కాదా? టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటంబసభ్యులపై సోషల్‌ మీడియాలో వ్యతిరేకంగా ప్రచారం చేయించలేదా? ఇప్పుడు ప్రజా సంక్షేమం కోసం జగన్‌మోహన్‌రెడ్డి ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు మాత్రం ఆయనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. లోకకల్యాణం కోసం జగన్‌మోహన్‌రెడ్డి యజ్ఞం చేస్తుంటే రాక్షసులు అడ్డుకున్నట్లు చంద్రబాబు అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇందుకు ఎల్లో మీడియా సహకరిస్తోంది.

ప్రభుత్వం చిత్తశుద్ధితో మద్యనిషేధానికి చర్యలు తీసుకుంటుంటే అభినందిం‍చకపోగా ఇష్టారాజ్యంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఎన్టీఆర్ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడిపింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా సీఎం జగన్‌ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. చంద్రబాబు మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ప్రస్తుతం టీడీపీ అనేది ముగిసిన అధ్యాయం. మోదీని జగన్‌ కలిస్తే కేసుల కోసమని మాట్లాడతారా? కేంద్రంలో మోదీ రెండోసారి గెలిచి అధికారంలోకి రావడంతో తనకు ముప్పు రాకుండా చంద్రబాబు తన కోవర్ట్‌లను బీజేపీలోకి పంపింది వాస్తవం కాదా? పోలవరాన్ని ఏటీఎంలా చంద్రబాబు మార్చుకున్నారని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీనే చెప్పడం మర్చిపోయారా? మోదీని కూడా దిగజార్చే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. మోదీపై చేసిన విమర్శలపై బీజేపీ నాయకులు స్పందించాలి. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకోనే చంద్రబాబు మూర్ఖంగా మాట్లాడుతున్నారు. తిరుమలలో పోటును తవ్వించింది నువ్వు కాదా? దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేయించింది నువ్వు కాదా? కనకదుర్గమ్మ వారి భూములను నీకు నచ్చిన వారికి ఇచ్చుకోలేదా?’ అని రామచంద్రయ్య ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు