బీసీల అభివృద్ధికి ఏటా 15 వేల కోట్లు

16 Mar, 2019 12:22 IST|Sakshi

సాక్షి, కర్నూలు(అర్బన్‌):  ‘‘రేపు మీ అందరి చల్లని దీవెనలతో దేవుడి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతి ఏటా రూ.15 వేల కోట్లకు తక్కువ కాకుండా ఖర్చు చేస్తామని చెబుతున్నా’’ అంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీన ఏలూరులో జరిగిన బీసీ గర్జన సభలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీపై బీసీ వర్గాలు సర్వత్రా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.  

అష్టకష్టాలు పడి మీ సేవ కేంద్రాలు, తహసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపాలిటీ కార్యాలయాల చుట్టూ తిరిగి, కోరిన ధ్రువీకరణ పత్రాలతో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న బీసీ కులాలకు చెందిన వారికి రుణాలు అందని పరిస్థితి నెలకొంది. 2016–17 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 వరకు 11 బీసీ ఫెడరేషన్లకు సంబంధించి మొత్తం 13,843 మందికి రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు 4,942 మందికి మాత్రమే ఉన్నతాధికారులు రుణాలను మంజూరు చేశారు. వీరిలో ఇంకా 20 నుంచి 30 శాతం మందికి ఆయా బ్యాంకులు రుణాలు అందించని పరిస్థితి నెలకొనింది.  

పాలక వర్గాలు ఉన్నా, ఫలితం శూన్యం ... 
బీసీ జాబితాలోని రజక, నాయి బ్రాహ్మణ, వడ్డెర, సగర/ఉప్పర, క్రిష్ణబలిజ/పూసల, వాల్మీకి/బోయ, బట్రాజు, కుమ్మర, విశ్వ బ్రాహ్మణ, మేదర, గీత కార్మికులకు ఫెడరేషన్లు ఏర్పాటు చేసి పలు కులాలకు పాలకవర్గాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఫెడరేషన్లకు సంబంధించిన కులాలకు చెందిన ప్రజలు సొసైటీలుగా ఏర్పడి వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచుకునేందుకు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నా, నేటికి ఫలితం దక్కని పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  

4,492 మందికి మాత్రమే రుణాలు ... 
బీసీ ఫెడరేషన్ల ద్వారా 10 బీసీ కులాలకు చెందిన సొసైటీలకు మూడు సంవత్సరాలుగా అరకొరగానే రుణాలు అందాయి. 2016–17లో  3,887 మందికి రూ.17.05 కోట్లు సబ్సిడీగా అందించాల్సి ఉండగా.. 860 మందికి రూ.4.05 కోట్లు అందించారు. 2017–18లో 3,233 మందికి రూ.32,33 కోట్లు సబ్సిడీగా అందించాల్సి ఉండగా..1,632 మందికి రూ.9.71 కోట్లు  సబ్సిడీ విడుదలైంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో 6,723 మందికి రూ.67.23 కోట్లను సబ్సిడీగా అందించాల్సి ఉండగా..ఇప్పటి వరకు 2,450 మందికి రూ.15.03 కోట్లు సబ్సిడీని మంజూరు చేశారు. 

వైఎస్‌ జగన్‌తోనే బీసీల అభివృద్ధి  
తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో బీసీలకు ఒరిగింది శూన్యం. సబ్‌ప్లాన్‌ పేరుతో బీసీలను మోసం చేశారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయి తేనే బీసీల అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. బీసీ కార్పొరేషన్‌ ద్వారా గత ఏడాది కూడా సగం మంది బీసీలకు కూడా రుణాలు అందలేదు. అనేక కష్టాలు పడి కార్పొరేషన్‌ కార్యాలయం చుట్టూ తిరిగినా, అర్హులైన బీసీలకు రుణాలు అందించలేని దుస్థితి ఏర్పడింది.  
–శ్రీరంగడు, పత్తికొండ 

సబ్సిడీ విడుదలలో జాప్యం తగదు 
బీసీ వర్గాలకు చెందిన ప్రజలు అనేక కష్టాలకు ఓర్చి మండల పరిషత్, మున్సిపల్‌ కార్యాలయాలు, మీ సేవ కేంద్రాల చుట్టు తిరగడంతో పాటు రిజిస్ట్రేషన్‌ కార్యాలయం చుట్టు తిరిగి ఆన్‌లైన్‌లో సొసైటీలను రిజిస్ట్రేషన్‌ చేయించారు. కోరిన ధ్రువీకరణ పత్రాలను అందించి రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నా వందల సొసైటీలకు నేటికి ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేయకపోవడం దారుణం. జిల్లా కలెక్టర్‌ మంజూరు చేసి ఆప్‌లోడ్‌ చేసిన వాటికి కూడా సబ్సిడి విడుదల కాకపోవడం దురదృష్టకరం.  
–నాగరాజు యాదవ్, కర్నూలు  

మరిన్ని వార్తలు