టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు..

21 Jun, 2019 11:00 IST|Sakshi

రాజధాని కుంభకోణాలపై ప్రభుత్వం దృష్టి సారింపు

అవకతవకలకు పాల్పడిన అధికారుల్లో వణుకు

టీడీపీ నేతలకు సహకరించి అడ్డంగా బుక్కయ్యామని ఆందోళన

రాజధాని అమరావతి ఏర్పాటు.. అంతా గ్రాఫిక్స్‌ మాయాజాలం.. భూములు తీసుకునేటప్పుడు రైతులకు అరచేతిలో సింగపూర్‌ చూపించారు. తీరా భూములు లాక్కున్నాక సవాలక్ష చిక్కుముడులు వేసి చుక్కలు లెక్క పెట్టించారు. రాజధాని ఏర్పాటుకు ముందే టీడీపీ నేతలు అమరావతి ప్రాంతంలో భూములు కొనేసి భారీగా లబ్ధి పొందారు. భూములు అమ్ముకున్న రైతులు లబోదిబోమన్నారు. పంట భూములకు కౌలు నిర్ధారణలో నిజమైన రైతులను నిలువునా ముంచారు. టీడీపీ నేతల మెట్ట భూములను సైతం జరీబుగా నిర్ధారించేశారు. అసైన్డ్, లంక భూముల పేరుతో దళితులకు రిక్తహస్తం చూపారు. ఆ భూములు లాక్కున్నాక కౌలు లెక్కలు కట్టించారు. ఇలా అడుగడుగునా అవకతవకలతో అడ్డగోలుగా దోపిడీకి పాల్పడ్డారు. కొందరు అధికారులు అధికారానికి కొమ్ముకాసి రైతులకు అన్యాయం చేశారు. ప్రభుత్వం మారడంతో అక్రమార్కులంతా గుండెలు గుప్పిట్లో పెట్టుకుని వణికిపోతున్నారు. తమ దురాగతాలు ఎక్కడ బయటపడతాయోనని బెంబేలెత్తుతున్నారు.

సాక్షి, అమరావతి

: టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయ్‌. రాజధాని అమరావతి పేరుతో ఐదేళ్లపాటు టీడీపీ నాయకులు సాగించిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటికి రానున్నాయి. లేనిభూములు ఉన్నట్లు సృష్టించి ప్లాట్లు పొందిన వైనం, భూమి ఉన్నా కూలీలకు ఇచ్చే పింఛన్‌ కాజేసిన వారి వివరాలు, సాధారణ రైతుల భూమిలో నుంచి కొంత భాగం ఆక్రమించి వాటిని తమ పేరు మీద దొంగ పత్రాలు సృష్టించి పరిహారం.. ఇలా ఒక్కటేమిటి ఐదేళ్లలో రాజధాని ప్రాంతంలో టీడీపీ నాయకులు పాల్పడిన కుంభకోణాలు, దురాగతాలు, అరాచకాలు, ఆక్రమణలను తవ్వే పనిలో అధికారం పక్షం సిద్ధమైంది. 

ప్రకటనకు ముందే భూముల కొనుగోలు..!
రాజధాని ప్రకటనకు ముందే మంగళగిరి, తాడికొండ నియోజకవర్గ పరిధిలో టీడీపీ నాయకులు వారి అనుయాయులు పెద్ద సంఖ్యలో భూములు కొనుగోలు చేశారు. రైతుల నుంచి కారు చౌకగా వేల ఎకరాలను కొనుగోలు చేసిన తర్వాత తీరిగ్గా ఈ ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారు. దీంతో భూములు విక్రయించిన రైతులు లబోదిబోమన్నారు. అలాగే దళితులు సాగు చేసుకుంటున్న లంక, అసైన్డ్‌ భూములకు పరిహారం ఇవ్వదని నమ్మించి... ఆ భూములను టీడీపీ నాయకులు కొనుగోలు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం ఈ భూములకు ప్యాకేజీ ప్రకటించింది. ఇలా దళితులను దగా చేసిన  వారి వెన్నులో ప్రస్తుతం వణుకు పుడుతోంది.

భారీగా ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌...!
రాజధాని భూముల విషయంలో భారీ కుంభకోణం జరిగిందని మొదటి నుంచి వైఎస్సార్‌ సీపీ ఆరోపిస్తూ వచ్చింది. ఇప్పుడు అధికారంలోకి రావడంతో ఆ తీగను లాగేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో గత ప్రభుత్వం పాల్పడిన కుంభకోణాలపై అధికార వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం సమాచారాన్ని సేకరించింది. ఇప్పటికే రైతులతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమై వారి బాధలు, ఇబ్బందులు తెలుసుకుంటున్నారు.  

ఒక్కో భూమికి ఒక్కో ప్యాకేజీ
రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో టీడీపీ నాయకుల అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. సీఆర్‌డీఏ గ్రామ కమిటీలుగా టీడీపీ నాయకులు సాగించిన అరాచకం అంతా ఇంతా కాదు. ఒక్కో భూమికి ఒక్కో ప్యాకేజీ నిర్ణయించారు. కొంత మంది టీడీపీ నాయకులు తమది మెట్ట భూమి అని తెలిసినా రికార్డుల్లో జరీబుగా నిర్ధారించి ప్యాకేజీ కొట్టేశారు. మంగళగిరి మండలం కురగల్లు గ్రామంలో దాదాపు 90 మంది టీడీపీ సానుభూతి పరులు కలిసి కూలీలకు ఇచ్చే పింఛన్‌ను 18 నెలలపాటు అక్రమంగా బొక్కేశారు.

తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో రైతుల భూముల్లో కొద్ది భాగాన్ని ఆక్రమించి... ఆ భూమిపై నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి అక్రమంగా ప్లాట్లు కొట్టేయడంతోపాటు కౌలు చెక్కులు తీసుకున్నారు. ఇలా ఐదేళ్లపాటు సాగించిన అక్రమాలన్నీ ఇప్పుడు బట్టబయలు కానున్నాయి. 

దళితులను తీవ్రంగా మోసగించారు
తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలో సుమారు 2,200 ఎకరాల అసైన్డ్‌ భూములు ఉన్నాయి. వీటిలో అధిక శాతం కృష్ణా తీరం వెంబడి ఉన్న లంకల్లోని దళిత రైతుల చేతుల్లోనే ఉన్నాయి. అసైన్డ్‌ భూములకు ప్యాకేజీ ఇవ్వబోమని చెప్పడంతో మొదట్లో దళిత రైతులంతా కారుచౌకగా విక్రయించేసుకున్నారు. దళిత రైతుల మధ్య చిచ్చు పెట్టి వారిని విభజించి పాలించాలని గత టీడీపీ ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగా పావులు కదిపింది. ఇందులో భాగంగానే అసైన్డ్‌ భూములను దళిత రైతులు విక్రయించిన తర్వాత ప్యాకేజీ ప్రకటించి తీవ్రంగా మోసగించారు. మోసపోయిన దళిత రైతులంతా ఇప్పుడు ఎదురు తిరుగేందుకు సిద్ధంగా ఉన్నారు. 

మొత్తం పరిణామాలపై సమీక్ష
రాజధాని ప్రకటన... అంతకు ముందు టీడీపీ నాయకులు పాల్పడిన ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌పై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దృష్టి సారించారు. ఈ మొత్తం కుంభకోణాలపై విచారణకు ఆదేశించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అప్పట్లో టీడీపీ నాయకుల అడుగులకు మడుగులు ఒత్తిన అధికారుల్లోనూ ఆందోళన మొదలైంది. అక్రమాలకు సహకరించి అడ్డంగా బుక్కయ్యామనే భయం వారిని వెంటాడుతోంది. దీనికి తోడు ఐదేళ్లలో అక్రమాలకు పాల్పడిన అధికారుల జాబితా తన వద్ద ఉందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే ప్రకటించారు.

దీంతో ఏం చేయాలో పాలుపోక దిక్కుతోచనిస్థితిలో అధికారులు పడ్డారు. సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశిస్తే మాజీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌తో పాటు గత ప్రభుత్వంలో మంత్రులకు పనిచేసిన నాయకులు, స్థానికంగా ఒక సామాజిక వర్గానికి చెందిన వారి అక్రమాలు బయటికి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.     

మరిన్ని వార్తలు