మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యం

17 Jul, 2019 09:08 IST|Sakshi
మహిళల సమస్యలు తెలుసుకుంటున్న ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని

సాక్షి, ఏలూరు(పశ్చిమ గోదావరి): సమాజంలో మహిళల రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని చెప్పారు. స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో పలువురు మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందించారు. సమాజంలో జరుగుతున్న అత్యాచారాలకు, మహిళలపై వేధింపులకు ఇక కాలం చెల్లిందని మహిళలు ఆత్మగౌరవంతో జీవించేలా తగు చర్యలు చేపట్టామన్నారు. గత టీడీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, అడుగడుగునా మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. ఆయన హయాంలో రౌడీమూకలు విజృంభించి పట్టపగలే మహిళలపై అత్యాచారాలు చేసి దారుణంగా హత్య చేసిన సంఘటనలు జరిగాయన్నారు.

గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయం ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టారని, మరో లక్షా 50 వేల ఉద్యోగాలు భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుందని, మహిళలు ఈ ఉద్యోగాలు చేపట్టి సమాజంలో ఆత్మగౌరవంతో ఆనందంగా జీవించాలని కోరారు. మహిళలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఎప్పుడైనా తన వద్దకు రావచ్చని, అసెంబ్లీ సమావేశాల అనంతరం స్వయంగా ఇంటింటికి తిరిగి పేదల సమస్యలు పరిష్కరిస్తానన్నారు. వైసీపీ నాయకులు మంచెం మైబాబు, బొద్దాని శ్రీనివాస్, ఎన్‌. సుధీర్‌బాబు,నెరుసు చిరంజీవి, గుడిదేశి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం..
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆళ్ళ నాని చెప్పారు. క్యాంపు కార్యాలయంలో పలువురు మైనార్టీ సభ్యులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై నాని స్పందిస్తూ రాష్ట్రంలో మైనార్టీలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడమే కాకుండా మంత్రివర్గంలో స్ధానం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని మైనార్టీల హక్కుల రక్షణ కోసం, సంక్షేమం కోసం రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించడంలో వైఎస్‌ కుటుంబం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.  మైనార్టీలు పిల్లలను చదివించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని, అమ్మ ఒడి కార్యక్రమం పేద వర్గాలకు ఒక సంజీవని లాంటిదని చెప్పారు. మైనార్టీల ఆర్థిక పురోభివృద్ధికి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, వాటిని ప్రతి పేద మైనార్టీ కుటుంబం సద్వినియోగం చేసుకుని సమాజంలో గౌరవంగా బతకాలని కోరారు. 

మరిన్ని వార్తలు