పరిష్కార సూచిక... డీఆర్సీ వేదిక

23 Aug, 2019 11:25 IST|Sakshi
డీఆర్సీ సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం సుభాష్‌చంద్రబోస్‌. చిత్రంలో ఇన్‌చార్జి మంత్రి ఆళ్ల నాని, మంత్రులు పినిపే విశ్వరూప్, కురసాల కన్నబాబు, ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా, కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి

సాక్షి, కాకినాడ : చాలా కాలం తరువాత జిల్లాలో కీలకమైన సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి విధానపరంగా తీసుకున్న మౌలిక నిర్ణయాలకు డీఆర్సీ వేదికైంది. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనా కాలంలో ఒక్కసారి కూడా జిల్లా సమీక్షా మండలి సమావేశం నిర్వహించకుండా ప్రజా సమస్యలను గాలికొదిలేసిన నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు తిరగకుండానే తొలి డీఆర్సీని నిర్వహించడం విపక్ష సభ్యుల ప్రశంసలు అందుకుంది. ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) అధ్యక్షతన కాకినాడ జెడ్పీ సమావేశ మందిరంలో గురువారం జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రులు పినిపే విశ్వరూప్, 

కురసాల కన్నబాబు, ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరిస్తూ అధికార, ప్రతిపక్ష సభ్యులు తీసుకువచ్చిన సమస్యలకు మంత్రులు సమాధానమిచ్చారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన డీఆర్సీ సుదీర్ఘంగా తొమ్మిది గంటలపాటు సాయంత్రం 6.30 గంటల వరకు జరగడం ఒక రికార్డే. శాఖల సమీక్ష అంటే మొక్కుబడిగా నిర్వహించే గత టీడీపీ సర్కార్‌ సంస్కృతికి భిన్నంగా ప్రజాప్రతినిధులు తీసుకువచ్చిన ప్రతి అంశంపై లోతుగా చర్చించి నిర్దేశిత గడువులోగా పరిష్కార మార్గాన్ని కూడా మంత్రులు సూచించడంతో విపక్షం నోరెత్తలేని పరిస్థితి కనిపించింది. తొలిసారి ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ప్రాంత సమస్యలపై డీఆర్సీలో గళం వినిపించేందుకు పోటీపడ్డారు.

విపక్షాలకు అవకాశం ఇస్తూ...
సమస్యలపై చర్చలో పాల్గొనే అవకాశాన్ని కోరినంత సేపు విపక్ష టీడీపీ సభ్యులకు కూడా ఇవ్వడం ద్వారా తమది పూర్తి పారదర్శక ప్రభుత్వమనే విషయాన్ని మంత్రులు నొక్కి చెప్పారు. పది శాఖలను అజెండాలోకి తీసుకువచ్చారు. శుక్రవారం ఎలాగూ వైద్య ఆరోగ్యశాఖపై రోజంతా సమీక్ష ఉండటంతో ఆ శాఖ సమీక్షను డీఆర్సీ నుంచి మినహాయిస్తున్నట్టు జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాని ముందుగానే సభ్యుల దృష్టికి తీసుకు వచ్చారు. మిగిలిన వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్, విద్య, గృహనిర్మాణం, సాంఘిక సంక్షేమం, జిల్లా గ్రామీణాభివృద్ధి, మైనింగ్, గ్రామీణ మంచినీటి సరఫరా, పౌర సరఫరాలు తదితర శాఖలపై లోతైన సమీక్ష నిర్వహించారు. వరదల కారణంగా జరిగిన పంట నష్టంపై ఎకరాకు రూ.25 వేలు డిమాండ్‌ చేస్తున్న చంద్రబాబు తీరును మంత్రి కన్నబాబు తూర్పారబట్టారు.

రూ.2469 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఎగ్గొట్టిన బాబు ఇప్పుడు ఇలా మాట్లాడటాన్ని మంత్రి నిలదీశారు. పంటలు ఆలస్యం కావడంతో ముందస్తు రబీపై ఆలోచన చేయాలనే అంశాన్ని చర్చించారు. స్థానిక రైతులు సంతృప్తి చెందాకనే కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయాలని వ్యవసాయశాఖా మంత్రి కన్నబాబు సూచనతో రైతులకు ఎంతగానో మేలు జరగనుంది. టీడీపీ ప్రభుత్వంలో ఇసుక దోపిడీపై అవగాహన కలిగిన మంత్రి సుభాష్‌చంద్ర బోస్‌ వేమగిరిలో నిల్వ ఉన్న 16 వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుకపై చర్చ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డికి విష్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆ ఇసుక విశాఖలో నేవీకని చెప్పి అనుమతి కోసం తన వద్దకే కొందరు రావడం, తాను తిరస్కరించిన విషయాలను ఎక్కడా దాచుకోకుండా సమావేశం దృష్టిలో పెట్టడం విశేషం.

ఐదేళ్లలో ఒక్కసారి కూడా డీఆర్సీకి పిలవలేదని ఎమ్మెల్సీ సోము వీర్రాజు సమావేశం దృష్టికి తీసుకువచ్చినప్పుడు డీఆర్సీనే నిర్వహించలేదని టీడీపీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు గత సర్కార్‌ వైఫల్యాన్ని ఒప్పుకున్నారు. అందుకే ఐదేళ్లు మీ ప్రభుత్వంలో దుర్మార్గమైన పాలన సాగించారని, మూడు నెలలు తిరగకుండానే వైఎస్సార్‌సీపీ డీఆర్సీ నిర్వహిస్తోందని సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి పినిపే విశ్వరూప్‌ టీడీపీ ఎమ్మెల్యేలకు చురక అంటించారు. కమీషన్ల కోసం పర్యావరణ అనుమతి లేకున్నా లెక్క చేయకుండా రూ.2,600 కోట్లతో చంద్రబాబు చేపట్టిన పురుషోత్తపట్నం పథకంపై సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టులో చంద్రబాబు తీరుపై అధికారపక్షం దాడిని కనీసంగా టీడీపీ సభ్యులు నిలువరించలేక చేతులెత్తేయక తప్పింది కాదు.

మీలా కాదండీ...
మండలి డిప్యుటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం వైఎస్సార్‌ రైతు భరోసా పథకంలో ఇచ్చే రూ.12,500 రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందా అని ప్రభుత్వాన్ని తప్పు పట్టే ప్రయత్నం చేశారు. వాస్తవాలే చెబుతాం, మీలా కేంద్ర నిధులతో నడిచే 27 పథకాలకు చంద్రబాబు పేర్లు పెట్టుకోలేదంటూ మంత్రులు నాని, కన్నబాబు, విశ్వరూప్‌లు దీటుగా బదులిచ్చారు. తమ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఏ పథకానికి ని«ధులు ఇస్తే వాటికి మాత్రమే రైతుల గుండె చప్పుడైన మహానేత వైఎస్‌ పేరు పెట్టిన విషయాన్ని తెలియచేయడం ద్వారా విపక్ష టీడీపీ నేతల మాటలకు ముకుతాడు వేశారు. ఆళ్ల నాని తొలిసారి మంత్రి అయినప్పటికీ ఇంత పెద్ద జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా జిల్లా సమీక్షా మండలి సమావేశాన్ని సమయస్ఫూర్తితో నిర్వహించారు. నానితో కలిసి జిల్లా మంత్రులు, ప్రభుత్వ విప్‌ హోదాలో తొలిసారి తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా  డీఆర్సీని సమన్వయంతో ముందుకు నడిపించి ప్రతిపక్ష సభ్యుల విమర్శలను దీటుగా తిప్పికొట్టి ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలను వివరించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా డీఆర్సీ సమావేశ లక్ష్యం నెరవేరినట్టయ్యింది.

ప్రధానంగా ఎత్తిపోతల పథకాలు, శివారు భూములకు సాగునీరు, డ్రైన్‌లు ఆధునికీకరణ వంటి అంశాలపై నీటిపారుదలశాఖా మంత్రితో ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించారు. కాలువల క్లోజర్‌ పనులు చేయాలంటే ఇప్పుడు ముందస్తు రబీకి వెళ్లడమే మేలనే అభిప్రాయం వచ్చింది. హాస్టళ్ల నిర్వహణపై గత టీడీపీ సర్కార్‌కు, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని మంత్రి విశ్వరూప్‌ గణాంకాలతో వివరించడంతో అప్పటి వరకూ హాస్టళ్లపై విమర్శలు చేసిన విపక్షానికి నోటమాట రాలేదు. ఇసుక విధానం వెలువడే వరకూ జిల్లాలో సీజ్‌ చేసిన ఇసుకను స్థానిక ప్రభుత్వ అవసరాలకే వినియోగించాలని, దొంగ పర్మిట్లతో ఇతర ప్రాంతాలకు తరలించే మాఫియాను నిరోధించాలని అధికార, విపక్ష పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ మురళీథర్‌రెడ్డికి డీఆర్సీ వేదికగా పలు సూచనలు చేశారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా