విద్యార్థి ప్రగతికి ‘హాయ్‌’

25 Sep, 2019 11:15 IST|Sakshi

సాక్షి, నెహ్రూనగర్‌(గుంటూరు) : వసతి గృహ విద్యార్థులకు పూర్తి వివరాలతో కూడిన హెల్త్, అకడమిక్‌ అండ్‌ ఐటెంటిటీ (హాయ్‌) కార్డుల అమలుకు బీసీ సంక్షేమ శాఖ శ్రీకారం చుట్టింది. ఈ విధానం గతంలో ఉండేది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మరుగున పడింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే వెనకబడిన తరగతుల విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపధ్యంలో గుంటూరు జిల్లాలో ముందుగా బీసీ సంక్షేమ శాఖ అడుగు లేసింది.

విద్యార్థి పూర్తి సమాచారం 
హాయ్‌కార్డు చూడగానే విద్యార్థి విద్య, ఆరోగ్యంతో పాటు వ్యక్తిగత వివరాలు ఉంటాయి. విద్యార్థి 3వ తరగతిలో హాస్టల్‌లో చేరగానే ఈ కార్డులో వివరాలు పొందుపరచాలి. మొదటి పేజీలోనే విద్యార్థి వ్యక్తిగత సమాచారం పూరించాలి. పేరు, బాలుడు/బాలిక, స్వస్థలం, చిరునామా, కాంటాక్ట్‌ నంబర్, కులం, ఆధార్‌ నంబర్, సంక్షేమ శాఖలో విద్యార్థి యూనిక్‌ నంబర్, గుర్తింపు చిహ్నాలు ఎంటర్‌ చేసి తండ్రి/సంరక్షకుడు సంతకం చేయాల్సి ఉంటుంది. మరో వైపు వసతి గృహ సంక్షేమ అధికారి సంతకం చేయాల్సి ఉంటుంది. తర్వాత కాలంలో విద్యార్థి, ఎత్తు, బరువు, రక్తం గ్రూపు, ఇతర వివరాలు నమోదు చేస్తారు. విద్యార్థి హాస్టల్‌ నుంచి బయటికి వెళ్లే దాకా కార్డులో అన్ని వివరాలు పొందుపరుస్తూ వస్తారు. హాయ్‌ కార్డులను వార్డెన్లే నిర్వహించాల్సి ఉంటుంది. వారిదే పూర్తి బాధ్యత ఇప్పటికే ముద్రణ జరుగుతుడంటతో...మరి కొద్ది రోజుల్లోనే కార్డులు సరఫరా చేసేందుకు బీసీ సంక్షేమ శాఖ అధికారులు   సిద్ధం చేస్తున్నారు.

విద్యా సంబంధిత వివరాలు...
విద్యార్థి త్రైమాసిక, అర్ధ సంవత్సరం, వార్షిక పరీక్షల్లో సాధించే మార్కుల వివరాలను ఎప్పటికప్పుడు ఇందులో నమోదు చేస్తారు. ఇందుకోసం కార్డులో ప్రత్యేక పట్టిక రూపొందించారు. సబ్జెక్టుల వారీగా సాధించిన మార్కులూ నమోదు చేస్తారు. సాధించిన మార్కులు, గరిష్టం, శాతం నమోదు చేయాల్సి ఉంటుంది.

ఆరోగ్య వివరాలు...
మరోవైపు ప్రతినెలా హాస్టళ్లలను వైద్యాధికారులు సందర్శించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధన ఉన్నా ఇప్పటికి దాకా అమలైన దాఖాలాలు లేవు. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. కచ్చితంగా వైద్యాధికారులు ప్రతినెలా వెళ్లాల్సిందే. వారు వెళ్లి విద్యార్థికి పరీక్షలు నిర్వహించి ఏవైనా ఆరోగ్య ఇబ్బందులను గుర్తిస్తే హాయ్‌కార్డులో పొందుపరచాలి.  

తల్లిదండ్రులకు విద్యార్థుల ప్రగతి...
ప్రతి నెలా జరిగే తల్లిదండ్రుల సమావేశంలో పిల్లల హాయ్‌కార్డులను వార్డెన్‌ తల్లిదండ్రులకు చూపిస్తారు. వీటిని చూసి తమ పిల్లలకు పరీక్షల్లో వస్తున్న మార్కులు, ఏయే సబ్జెక్టులో వెనుక బడ్డారో తెలుసుకుని అవగాహన కల్పించే వీలుంటుంది. ఇది ట్యూటర్లకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి శిక్షణ ఇచ్చే వీలుంటుంది. అలాగే ఎవరైనా అధికారులు ఆకస్మిక తనిఖీ చేసిన సంధర్బంలో కార్డులను పరిశీలించి పిల్లల ప్రగతిని అంచనా వేసే వీలుంటుంది.

పక్కగా అమలు చేస్తాం
 హాయ్‌ కార్డుల విధానాన్ని పక్కగా అమలు చేస్తాం. విద్యార్థుల చదువుతో పాటు, ఆరోగ్యానికి సంబంధించిన సమగ్ర వివరాలు ఇందులో నమోదు చేస్తాం. వీటి నిర్వహణ  బాధ్యత హెచ్‌డబ్ల్యూఓలు   తీసుకోవాలి. కార్డుల ముద్రణ జరుగుతుంది. మరి కొద్ది రోజుల్లోనే ఈ కార్డులను విద్యార్థులకు సరఫరా చేస్తాం.
 – డి.కల్పన, బీసీ సంక్షేమ శాఖ అధికారి  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా