రాష్ట్ర​ వ్యాప్తంగా ప్రజాసంకల్ప మానవహారాలు

19 Mar, 2018 11:34 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు లోక్‌సభలో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం సోమవారం చర్చకు రానున్న సందర్భంగా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజా సంకల్ప మానవహారం కార్యక్రమాలను నిర్వహించారు.

పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పార్టీ సీనియర్‌ నేతలతో చర్చించి నిర్దేశించిన ఈ కార్యక్రమంలో పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు భాగస్వాములయ్యారు. రాష్ట్ర ప్రజల ప్రత్యేక హోదా ఆకాంక్ష ఢిల్లీకి తెలిసివచ్చేలా ప్రజాసంకల్ప మానవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు భారీ ఎత్తున పాల్గొన్నారు. 

గుంటూరు: అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా జిల్లాలోని అన్నీ నియోజక వర్గాల్లో మానవహారాలు చేపట్టారు. వేమూరులో పార్టీ నేత మేరుగ నాగార్జున ఆధ‍్వర్యంలో, వినుకొండ స్తూపం సెంటర్‌లో బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ప్రజా సంకల్ప మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు నినాదాలు చేశారు

కాగా, జిల్లాలో కాకుమాను మండలం కొమ్మూరు వద్ద పార్టీ శ్రేణులు చేపట్టిన ప్రజాసంకల్ప మానవహారంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

విజయవాడ: విజయవాడలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రజాసంకల్ప మానవహారాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొని అవిశ్వాస తీర్మానానికి సంఘీభావం ప్రకటించారు.

కర్నూలు: జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మానవహారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి, బీవై రామయ్యలతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.

అనంతపురం: అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా అనంతపురం క్లాక్‌ టవర్‌ వద్ద ప్రజాసంకల్స మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెన్నుపూస గోపాల్‌ రెడ్డి, అనంత వెంట్రామి రెడ్డి, రాగే పరుశురాం తదితరులు పాల్గొన్నారు.

విశాఖ: జిల్లాలోని ఇసుకతోటలో ప్రజాసంకల్ప మానవహారం చేపట్టారు. తూర్పు నియోజక వర్గ సమన్వయ కర్త వంశీకృష్ణ ఆధ్వర్యంలో చేసిన  మానవహారంలో జిల్లా అధ్యక్షుడు తైనాల విజయ్‌ కుమార్‌ పాల్గొన్నారు. అయితే మానవహారాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తోపులాట చోటు చేసుకోవడంతో విజయ్‌ కుమార్‌కు గాయాలయ్యాయి. పోలీసులు నేతలను అరెస్టు చేసి ఎంవీపీ పీఎస్‌కు తరలించారు.

విజయనగరం : కేంద్ర ప్రభుత్వం పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా పట్టణంలోని గంటస్తంభం వద్ద వైస్సార్ సీపీ, సీపీఐ పార్టీల  ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. వైఎస్‌ఆర్‌ సీపీ పట్టణ అధ్యక్షుడు అశపు వేణు, సీపీఐ నాయకులు కామేశ్వరరావుతో పాటు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కురుపాంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పుష్పవాణి ఆధ్వర్యంలో ప్రజాసంకల్ప మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నేత పరీక్షిత్‌ రాజు కూడా పాల్గొన్నారు.

చిత్తూరు : కేంద్ర ప్రభుత్వం పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా జిల్లాలోని గంగాధర నెల్లురులో ఎమ్మెల్యే నారాయణ స్వామి ఆధ్వర్యంలో ప్రజాసంకల్ప మానవహారం చేపట్టారు. అలాగే పీలేరులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ప్రజాసంకల్ప మానవహారం నిర్వహించారు.

తూర్పు గోదావరి :  కేంద్ర ప్రభుత్వం పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా జిల్లాలోని రాజానగరంలో వైఎస్‌ఆర్‌సీపీ కో-ఆర్డినేటర్‌ జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో, రావులపాలెంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో, రాజోలులో వైసీపీ కో-ఆర్డినేటర్‌ బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రజాసంకల్ప మానవహారం నిర్వహించారు. రాజోలులో నిర్వహించిన మానవహారంలో నేతలు జిల్లెల బెన్నీ, బ్రహ్మాజీ, సింహాద్రి, భగవాన్‌, కాశి తదితరులు పాల్గొన్నారు.

నెల్లూరు : జిల్లాలోని వెంకటగిరి పాతబస్టాండ్‌ వద్ద ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యలో ప్రజాసంకల్ప మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు ఢిల్లీ బాబు, చిట్టేటి హరికృష్ణా, నక్క వెంకటేశ్వర్లు, నెమల్లాపూడి సురేష్‌ రెడ్డి, గిరి రెడ్డితో ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.  అలాగే జిల్లాలోని గూడూరు పట్టణంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్‌ మేరిగ మురళిధర్‌, సీజీసీ సభ్యులు ఎల్లసిరీ గోపాల్‌ రెడ్డి, నేదురుమల్లి పద్మనాభ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపురెడ్డి వినోద్‌ కుమార్‌ రెడ్డి, కన్వీనర్లు బొమ్మిడి శ్రీనివాస్‌, మల్లు విజయ కుమార్‌ రెడ్డి, నేదురుమల్లి ఉదయ్‌ శేఖర్‌ రెడ్డి, సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మీరా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా