హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం

16 Mar, 2019 12:10 IST|Sakshi
 సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ  పత్తికొండ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి 

సాక్షి, పత్తికొండ టౌన్‌: తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తోందని   వైఎస్సార్‌సీపీ పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి ధ్వజమెత్తారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్య చేయడం దారుణమని..దీనిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని   డిమాండ్‌ చేశారు.  శుక్రవారం రాత్రి పత్తికొండలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఐదేళ్ల టీడీపీ  పాలనలో అభివృద్ధి జరగలేదన్నారు.

అవినీతి, అక్రమాలు, కుట్రలు, హత్యలే జరిగాయని ఆరోపించారు. ప్రతిపక్షంలో ప్రజాభిమానం గల నాయకులను హత్య చేయించి భయభ్రాంతులకు గురిచేయాలని  టీడీపీ నాయకులు భావిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వైఎస్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేశారన్నారు. అందులో భాగంగా  వైఎస్‌ రాజారెడ్డిని, వైఎస్‌ వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేయించారనే అనుమానం ఉందన్నారు.   వైఎస్సాఆర్‌ మరణం కూడా   మిస్టరీగానే మిగిలిపోయిందన్నారు.

ఎన్నికలకు ముందు ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మానసిక స్థైర్యం దెబ్బతీయడానికి సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వారి ప్రోద్భలంతోనే మంత్రి ఆదినారాయణరెడ్డి.. వైఎస్‌ వివేకాను హత్య చేయించినట్లు తెలుస్తోందన్నారు. ఈ దారుణం వెనుక జరిగిన కుట్రకోణం వెలుగులోకి రావాలంటే   సీబీఐ విచారణ జరగాలని ఆమె డిమాండ్‌ చేశారు. తన భర్త చెరుకులపాడు నారాయణరెడ్డిని టీడీపీ నాయకులు దారుణంగా హత్య చేయించినా ఇప్పటి వరకు న్యాయం జరగలేదన్నారు.

అధికార బలంతో   కేసును పక్కదారి పట్టించేందుకు కుట్రలు చేశారన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీరంగడు, పత్తికొండ, మద్దికెర మండలాల కన్వీనర్లు జూటూరు బజారప్ప, మురళీధర్‌రెడ్డి, పార్టీ నాయకులు ఎర్రగుడి రామచంద్రారెడ్డి, లలితా రామచంద్ర, దూదేకొండ రహిమాన్, కారం నాగరాజు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు