-

అదంతా దోపిడీ సొమ్మేగా..!

10 Mar, 2017 01:00 IST|Sakshi
అదంతా దోపిడీ సొమ్మేగా..!

లోకేశ్‌ ఆస్తులు భారీ పెరుగుదలపై అంబటి రాంబాబు విమర్శ

సాక్షి, అమరావతి బ్యూరో: ముఖ్యమంత్రి, తన తండ్రి చంద్రబాబు పేరు చెప్పి లోకేశ్‌ బాబు వేలకోట్ల రూపాయలు కొల్లగొట్టి దోపిడీకి కేరాఫ్‌ అడ్రస్‌గా మారారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. గుంటూరులోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు కుటుంబం రెండు ఎకరాల నుంచి రూ. వేల కోట్లు ఎలా సంపాదించారో  చెప్పాలన్నారు. గతేడాది అక్టోబర్‌లో లోకేశ్‌ తనకు రూ.14.50 కోట్ల ఆస్తి ఉన్నట్లు ప్రకటించారని, ఆశ్చర్యం కలిగించేలా ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల అఫిడ విట్‌లో తన ఆస్తిని రూ. 330.14 కోట్లుగా చూపారని చెప్పారు. ఆరు నెలల్లో ఇన్ని కోట్లు ఎలా పెరిగాయో  చెప్పాల్సిన బాధ్యత లోకేశ్‌తో పాటు, టీడీపీకి ఉందన్నారు.

 ఆస్తుల ప్రకటన సమయంలో అప్పుడు కొన్న విలువ ప్రకటించానని, మార్కెట్‌ విలువ ప్రకటించలేదని డొంక తిరుగుడు సమాధానాలు చెబుతున్నారని రాంబాబు మండిపడ్డారు. ఏటా ఆస్తుల ప్రకటన అంటూ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. నారా భువనేశ్వరి, బ్రాహ్మిణి పేరుతో రూ. వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని, చంద్రబాబు కొద్ది మేర లెక్కలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని.. దీనికి ఉదాహరణ లోకేశ్‌ సమర్పించిన అఫిడవిటేనని పేర్కొన్నారు. సాక్షి పత్రిక, చానల్‌ తన ఆస్తుల పెంపు విషయాన్ని వెలుగులోకి తెచ్చాయని లోకే‹శ్‌ పేర్కొంటున్నారని, ముందుగా ఈ విషయాన్ని హిందుస్తాన్‌ టైమ్స్‌ వెలుగులోకి తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తన ఆస్తుల ఎలా పెరిగాయో లోకేశ్‌ చెప్పకుండా జగన్‌పై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ ఎన్నికల్లో పోటీచేసిన ప్రతిసారీ ఆస్తుల వివరాలను అఫిడవిట్‌లో దాఖలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

హెరిటేజ్‌ షేర్‌ ఎలా పెరిగింది..: జనవరి 2004లో హెరిటేజ్‌ షేర్‌ విలువ రూ. 55.40 ఉండగా, 2007 నాటికి రూ. 41.20కు దిగజారిందన్నారు. 2014 మార్చి నాటికి దాని విలువ రూ. 200 ఉండగా.. 2017 ఫిబ్రవరికి కేవలం మూడేళ్లలో రూ. 1,134కు ఎలా పెరిగిందో చెప్పాలని అంబ టి డిమాండ్‌ చేశారు. కేవలం అధికార దుర్వినియోగం వల్లనే షేర్‌ ధర అంతలా పెరిగిందన్నారు. సాక్షి, భారతి సిమెంట్‌ షేర్‌ ధరలు పెరిగాయని లోకేశ్‌ అంటున్నారని, వాటిపైన సీబీఐ విచారణ జరుగుతోందని తెలిపారు. కాంగ్రెస్‌ హయంలో బాబు 40 కేసుల్లో స్టే తెచ్చుకొన్నార న్నారు. 2019 ఎన్నికల్లో జగన్‌ గెలువలేరని లోకేశ్‌ అవాకులు, చెవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తిన అంబటి.. అంత ధైర్యం ఉంటే దొడ్డిదారిన ఎందుకు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారని లోకేశ్‌ను ప్రశ్నించారు. సాక్షి పత్రిక, టీవీ చూడొద్దని గగ్గోలు పెడుతున్న లోకేశ్‌.. వాస్తవాలను బయటికి తీసుకొచ్చే  మీడియాను చూసి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు