'వెంకటేశ్వరరావును సన్మానించకపోయారా..?'

5 Sep, 2017 01:42 IST|Sakshi
'వెంకటేశ్వరరావును సన్మానించకపోయారా..?'

హైదరాబాద్‌: టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏర్పాటు చేసింది అభినందన సభ కాదని, నంద్యాల, కాకినాడ ఎన్నికల జమ లెక్కల కోసమే ఆ సభను నిర్వహించారని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు దుయ్యబట్టారు. ఈ సందర్భంగా వారు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావును కూడా అభినందించాల్సిందని ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలకంటే వెంకటేశ్వరరావే ఎక్కువగా పనిచేశారని చెప్పారు. ఆయనతోపాటు 600మంది సిబ్బంది కూడా ఎన్నికలకోసం బాగా పనిచేసిందని, వారిని కూడా సన్మానించాలని సూచించారు.

అలాగే, నంద్యాల ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లని లోకేష్‌ను కూడా అభినందించాలన్నారు. మనీ, మీడియా, పోల్‌, పొలిటికల్‌ మేనేజ్‌మెంట్‌ వల్లే టీడీపీ గెలిచిందని, వచ్చే ఎన్నికల్లోను ఉప ఎన్నికల ఫలితాల మాదిరిగా ఉంటాయని భ్రమపడితే పొరపాటు అవుతుందని హితవు పలికారు. గౌతం రెడ్డి వ్యాఖ్యలు పార్టీ దృష్టికి రాగానే తక్షణమే సస్పెండ్‌ చేశామని చెప్పారు. అనుచిత వ్యాఖ్యలు చేసే వారిని తమ పార్టీ సహించబోదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.