మోసం చేయడం బాబు నైజం

11 May, 2015 06:36 IST|Sakshi

ఏం పాపం చేశారని కార్మికుల పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నారు
2001లోను ఇదే తీరు
ఎమ్మెల్యేగా ఉండి...లాఠీ దెబ్బలు తగిలినా ఆర్టీసీ కార్మికులకే అండగా ఉన్నా
నేడు కూడా అందుకు సిద్ధమే.. ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

 
ఒంగోలు : ‘మోసం చేయడం బాబు నైజమని ఆనాడే వైఎస్ చెప్పారు. బాబు నిజం చెబితే అతని తల వెయ్యి వక్కలవుతుందని మునిశాపం ఉందని వైఎస్సార్ అనేవారు. నేడు అదే నిజమవుతోంది. ఎన్నికల సమయంలో ఆల్‌ఫ్రీ అన్న బాబు ఇప్పుడు రాష్ట్రం పరిస్థితి బాగాలేదు అని మాట్లాడటం చూస్తుంటే కేవలం ఓట్ల కోసం ప్రజలను వినియోగించుకున్నారని అర్థమవుతోందని’ వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న 5వ రోజు సమ్మె శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా వారిపై ఎస్మా ప్రయోగిస్తామని రాష్ట్ర రవాణా మంత్రి పేర్కొనడం బాధాకరమన్నారు. ‘2001లో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగానే ఆర్టీసీ కార్మికులు 24 రోజులపాటు సమ్మె చేశారు. ఆరోజు తాను ఎమ్మెల్యేగా ఉన్నా పోలీసులు లాఠీలతో దాడిచేసి సమ్మెను నిర్వీర్యం చేయాలని చూశారు. కానీ చివరకు ఆర్టీసీ కార్మికులదే విజయం. ఈసారి విజయం కూడా ఆర్టీసీ కార్మికులదే. అందుకే భేషజాలకు పోకుండా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులపై ఒత్తిడి మానుకొని వారి న్యాయబద్ధమైన కోర్కెలు పరిష్కరించాలని’ బాలినేని డిమాండ్ చేశారు.

ఆర్టీసీలో అధికారుల జీతాలకు, కార్మికుల జీతాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పరిశీలిస్తే ఎంత శ్రమ దోపిడీ జరుగుతోందో అర్థమవుతోందని వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జ్ వరికూటి అశోక్‌బాబు అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి పూర్తిస్థాయిలో అండగా ఉంటామని చెప్పారు. బాబు మారాడు అంటే జనం ఓట్లేశారని, కానీ ఆయన మారలేదు అనడానికి ఆర్టీసీ కార్మికుల పట్ల చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరే అర్థమవుతోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. 

కార్యక్రమంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ కార్యదర్శి వాకా రమేష్, ఎస్‌డబ్ల్యూఎఫ్ రీజనల్ కార్యదర్శి ఎం.అయ్యపురెడ్డి, వైఎస్సార్‌సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్, నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కేవీ ప్రసాద్, ఉపాధ్యక్షుడు గోవర్థన్‌రెడ్డి, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కఠారి శంకర్, బొగ్గుల శ్రీనివాసరెడ్డి, గొర్రెపాటి శ్రీనివాసరావు, చుండూరి రవి, సింగరాజు వెంకట్రావు తదితరులు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించారు.

బాబు చర్యలే ఆర్టీసీ నష్టాలకు కారణం: ఎమ్మెల్యే డాక్టర్ ఆదిమూలపు సురేష్
ఆర్టీసీ గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించుకుందంటే అది ఆర్టీసీ కార్మికుల వల్లే సాధ్యమైంది తప్ప అధికారుల గొప్పతనం కాదు. కేవలం భద్రతాపరంగా ఆర్టీసీ అనుసరిస్తున్న విధానాలే అందుకు కారణంగా నిలిచాయి. కానీ నేడు సమ్మె సమయంలో ప్రయాణికుల భద్రత పూర్తిగా గాలికి వదిలి ఆర్టీసీ కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో బస్సులను నిరుద్యోగులకు అప్పగించడం బాధాకరం.

తెలంగాణ లో టీడీపీ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా ఉంటూ కార్మికుల పక్షాన కార్యక్రమాల్లో పాల్గొంటారు...కానీ ఏపీలో మాత్రం అదే పార్టీ అధికారంలో ఉన్నా ఆర్టీసీ కార్మికులపై ఎస్మా ప్రయోగిస్తామంటూ ఉక్కుపాదం మోపుతుంటుంది. ఇదే బాబు రెండు కళ్ల సిద్దాంతానికి నిదర్శనం. వైఎస్సార్ కాలంలో లాభాల బాటలో ఉన్న సంస్థ నేడు బాబు పాలనలో అప్పుల ఊబిలో కూరుకుపోతోంది.


మీ ఉసురు ఊరికే పోదు:          ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు
టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతన సవరణ చేస్తామన్నారు.  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. కానీ నేడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో బాబు చర్యల కారణంగా మోసపోని వ్యక్తి  ఒక్కరూ ఉండరని అర్థమవుతోంది. అంగన్‌వాడీలు, గృహ నిర్మాణశాఖలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్, విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఇలా ఎంతోమంది భవితను సైతం బాబు దెబ్బతీస్తున్నారు.  మీ ఉద్యమాన్ని అణిచేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలన్నీ కలిసి మీ ఉసురు ఊరకపోదు. తప్పకుండా ప్రభుత్వం తగిన మూల్యం చెల్లిస్తుంది.

మరిన్ని వార్తలు