ఫ్రంట్‌ పేరు చెబితే ఉలుకెందుకు?

20 Jan, 2019 11:02 IST|Sakshi
ఒంగోలు 43వ డివిజన్‌లో నవరత్నాలపై ప్రచారం చేస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి

టీఆర్‌ఎస్, వైఎస్సార్‌ సీపీ చర్చలను చంద్రబాబు వక్రీకరిస్తున్నారు

ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారం చేస్తున్నారు

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

ఒంగోలు సిటీ: వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డితో టీఆర్‌ఎస్‌ నేతలు జరిపిన చర్చలను వక్రీకరించి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజకీయ రాద్దాంతానికి తెర లేపారని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరు వింటేనే చంద్రబాబు ఉలిక్కి పడుతున్నారని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ విధానాలను వ్యతిరేకిస్తూ ఆ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆవిర్భవించిందని అన్నారు.

శనివారం ఒంగోలు నగరంలోని 43వ డివిజన్‌లో జరిగిన రావాలి జగన్‌.. కావాలి జగన్‌ కార్యక్రమంలో నవరత్నాలపై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసినప్పటి నుంచి చంద్రబాబుకు భయం పట్టుకుందని విమర్శించారు. రాష్ట్రంలో లేని టీఆర్‌ఎస్‌తో వైఎస్సార్‌ సీపీ పొత్తులు పెట్టుకుందని ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకొని విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్టానికి ప్రత్యేక హోదా సాధించే దిశగా టీఆర్‌ఎస్‌ కలిసి వస్తుందని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఫెడరల్‌ ఫ్రంట్‌లో కలిసి ప్రజల సంక్షేమం కోసం పని చేయడానికి జరిగిన చర్చలను చంద్రబాబు వక్రీకరించి, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.

కాపీల బాబును ప్రజలు నమ్మరు..
ఎన్నికలు సమీపిస్తున్నాయి కనుకనే జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలను కాపీ కొట్టి చంద్రబాబు పింఛన్‌ మొత్తాన్ని పెంచారన్నారు. నిజంగా పేదలపై అంత ప్రేమ ఉంటే నాలుగేళ్ల నుంచి పింఛన్‌ ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. కాపీల బాబును ప్రజలు నమ్మడం లేదన్నారు. చంద్రబాబు ఓటమి భయంతోనే పింఛన్‌ రూ.2 వేలకు పెంచారన్నారు. ఎన్నికల్లో ఎక్కడ వెనుకబడిపోతామోనన్న భయంతో హడావుడిగా పెంచిన పింఛన్‌ అమలుకు పూనుకున్నారన్నారు.

ఆటో, ట్రాక్టర్లకు పన్నుల రద్దు జగన్‌ ప్రకటించిన నవరత్నాల్లోనివేనని ప్రస్తావించారు. చంద్రబాబు ఇంకా రైతుబంధు పథకం కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నారన్నారు. కనీసం ఎన్నికల సమీపంలోనైనా ప్రజలకు కొంత మేలు జరుగుతుందంటే అది ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి చలవేనన్నారు. చంద్రబాబు ఎన్ని తాయిలాలు ప్రకటించినా ప్రజలు అర్థం చేసుకొని రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీని గెలిపించేందుకు మానసికంగా సిద్ధమయ్యారన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

నాలుగున్నరేళ్లల్లో తెలుగుదేశం చేసిన అభివృద్ధి లేకపోగా ప్రజాధనాన్ని వాటాలు వేసుకొని లూఠీ చేశారని విమర్శించారు. ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో చంద్రబాబు ఉలికిపాటుకు గురవుతున్నారని, జగన్‌కు వస్తున్న ప్రజాదరణ ఓర్వలేక ఉద్వేగానికి లోనవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, అదనపు కార్యదర్శి వేమూరి సూర్యనారాయణ,  తదితరులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు