వైఎస్సార్ సీపీకి ఏం సంబంధం?

14 Dec, 2018 13:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీఆర్‌ఎస్‌తో పొత్తుకు ప్రయత్నించి విఫలమయ్యారని వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. కేసీఆర్‌ని టీడీపీ నెత్తినపెట్టుకోవాలని చూసిందని, చంద్రబాబును ఓటుకు కోట్లు కేసులో శిక్షించి ఉంటే నేడు పరిస్థితి వేరుగా ఉండేదని అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను దెబ్బతీసేందుకు చంద్రబాబు ప్రయత్నించారని, దానికిప్రతిగా ఏపీ రాజకీయాల్లో వేలు పెడతానని కేసీఆర్‌ ప్రకటించారని.. ఇందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. చంద్రబాబు ఊసరవెల్లి మాటలపై ఆలోచించాలని ప్రజలను కోరారు. హరికృష్ణ చనిపోయిన సందర్భంలో టీఆర్ఎస్‌తో పొత్తుకు చంద్రబాబు ప్రయత్నించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని చంద్రబాబు ఎంత భ్రష్టుపట్టించారో, కేసీఆర్ అంత నష్టపరిచారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో అన్ని అంశాల్లో రాజీపడింది చంద్రబాబే అన్నారు.

‘కేసీఆర్ యాగం చేస్తుంటే పిలవగానే ఎగేసుకుంటూ చంద్రబాబు స్వయంగా హాజరవుతారు. రాజధాని నిర్మాణ శంకుస్థాపనకు కేసీఆర్‌ను పిలుస్తారు. పరిటాల శ్రీరామ్ వివాహ సందర్బంలో అటు చంద్రబాబు ఇటు కేసీఆర్‌తో కూడిన కటౌట్లు వేసింది ప్రజలు మరిచిపోలేదు. ఇప్పుడేమో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి మాట్లాడతారా? నిన్నటి వరకు బీజేపీ, పవన్ కల్యాణ్‌తో కలసిపోయామని దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు చూస్తే కేసీఆర్‌తో అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు మాయమాటలు నమ్మొద్ద’ని బొత్స కోరారు. కేసీఆర్‌ విజయవాడ వచ్చినప్పుడు ఆయన కోసం ఏపీ మంత్రులు ఎందుకు క్యూ కట్టారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే పార్టీ ​ప్రయోజనాలకే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తారని మండిపడ్డారు. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్  గెలవడానికి తాను చేసిన కృషే కారణమన్న చంద్రబాబు మాటలు వింటుంటే నవ్వొస్తుందన్నారు.

లగడపాటి ఒక బ్యాంక్‌ కరప్ట్‌ అని, సర్వే పేరుతో తెలంగాణ ఎన్నికల్లో ప్రజలను నట్టేట ముంచారని దుయ్యబట్టారు. మనిషి బలహీనతతో ఆడుకోవడం లగడపాటికి అలవాటని పేర్కొన్నారు. వైఎస్సార్‌ సీపీ ఉనికి లేకుండా చేయాలని కుట్రలు పన్నారని ఆరోపించారు. చంద్రబాబు తన సీఎం కుర్చీని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీకి పార్టీ ప్రయోజనాలకంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలే ముఖ్యమని, రానున్న ఎన్నికలలో ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు.

పవన్‌ మానసిన స్థితి బాగోలేదు..
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మానసిక స్థితి బాగోలేదని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ఆయన ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారో ఎవరికీ అర్థం కాదని, పవన్‌ మాట్లాడిన ప్రతి మాటకి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రాజకీయ పరిపక్వత లేనివాళ్లు పవన్‌లా మాట్లాడతారని, రాజకీయమంటే సినిమా డైలాగులు చెప్పినట్లు కాదని హితవు పలికారు.

మరిన్ని వార్తలు