సోషల్‌ మీడియాలో తప్పుడు కథనాలు

29 Nov, 2018 13:48 IST|Sakshi
ఏఎస్పీ కార్యాలయానికి ర్యాలీగా వస్తున్న పార్టీ నాయకులు

ప్రచారం చేసిన వారినికఠినంగా శిక్షించాలి

మంత్రి అయ్యన్న హత్యకు

వైఎస్సార్‌సీపీ నాయకుడు జమీలు కుట్ర పన్నారన్నది అవాస్తవం

నియోజకవర్గం కన్వీనర్‌ ఉమాశంకర్‌ గణేష్‌

విశాఖపట్నం, నర్సీపట్నం: మంత్రి సోదరుడు సన్యాసిపాత్రుడుతో కలిసి వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు అంకంరెడ్డి జమీలు మంత్రి అయ్యన్నపాత్రుడు  హత్యకు కుట్రపన్నారని సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గం కన్వీనర్‌ పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ డిమాండ్‌ చేశారు. తప్పుడు వీడియోల ద్వారా సోషల్‌ మీడియా, టీవీల్లో ప్రచారం చేసిన వారిపై  క్రిమినల్‌ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏఎస్పీ కార్యాలయానికి పార్టీ నాయకులంతా ర్యాలీగా వెళ్లారు. ఏఎస్పీ లేకపోవడంతో కార్యాలయం సీసీ సత్యనారాయణకు మెమోరాండం అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత నెలలో పెదబొడ్డేపల్లి సత్య కాంప్లెక్స్‌లో జరిగిన వివాహా కార్యక్రమానికి అంకంరెడ్డి జమీలు వెళ్ళారు. అదే కార్యక్రమానికి వచ్చిన సన్యాసిపాత్రుడిని  పలకరించారన్నారు. సీసీ కెమేరాల్లో రికార్డు అయిన పుటేజ్‌ను  సేకరించి తప్పుడుగా క్రియేట్‌చేసి మంత్రి అయ్యన్నపాత్రుడుపై హత్యకు కుట్ర చేశారని టీవీలు, సోషల్‌ మీడియాలో ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఫంక్షన్‌హాల్‌  యజమానిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ప్రసారం చేసిన చానళ్లపై  కూడా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం అంకంరెడ్డి జమీలు మాట్లాడుతూ తన రాజకీయ భవిష్యత్‌ను దెబ్బతియ్యడానికే తప్పుడు ప్రచారం చేశారన్నారు. తన కుటుంబానికి ఎటువంటి నేర చరిత్ర లేదన్నారు. సన్యాసిపాత్రుడు కుటుంబంతో మాకుటుంబానికి బంధుత్వం ఉందన్నారు. ఎక్కడైనా ఒకరి ఒకరం ఎదురుపడినప్పుడు పలకరించుకుంటామన్నారు. వీడియోను సృష్టించినవారే అయ్యన్నపాత్రుడును హతమార్చాలని, తద్వారా  వారి రాజకీయ భవిష్యత్‌ను పెంచుకోవాలని చూస్తున్నారన్నారు. కార్యక్రమంలో లేని మాజీ మావోయిస్టు బత్తుల కృష్ణను సైతం వీడియోలో ఉన్నట్లు  చూపటం దురదృష్టకరమన్నారు. అనంతరం షేక్‌ రజాక్‌ మాట్లాడుతూ సన్యాసిపాత్రుడు, జమీలు, బత్తుల కృష్ణ, తాను హత్యకు కుట్ర పన్నామని సోషల్‌ మీడియాలో ప్రచారం చేయటం హేయమైన చర్య అన్నారు. లేటరైట్‌ విషయంలో మావోయిస్టులు ఇప్పటికే మంత్రి అయ్యన్న, తనయుడు విజయ్‌ను హెచ్చరించిన విషయం తెలిసిందే. వీటిన్నింటి నేపథ్యంలో మంత్రి అయ్యన్నపాత్రుడుని  టీడీపీ వారే హత్య చేసి తమపై నెట్టడానికి చేసిన పనేనన్నారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ తమరాన అప్పలనాయుడు,  నర్సీపట్నం, నాతవరం మండల పార్టీ అధ్యక్షులు సుర్ల సత్యనారాయణ, శెట్టి నూకరాజు, పార్టీ నాయకులు సుర్లగిరిబాబు, పైల పోతురాజు, బయపురెడ్డి చినబాబు, శెట్టి మోహన్, పెట్ల అప్పలనాయుడు, ఆరుగుల్ల రాజుబాబు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు