‘దేశ చరిత్రలోనే ఓ రికార్డు’

24 Sep, 2018 14:59 IST|Sakshi

వైఎస్‌ జగన్‌ పాదయాత్ర రాజకీయ చరిత్రలో ఓ మైలురాయి

జగన్‌ సీఎం కావాలని అన్నివర్గాల ప్రజలు కోరుకుంటున్నారు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ ఇక్బాల్, మాజీ ఎంపీ వరప్రసాద్‌

సాక్షి, కర్నూల్ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర రాజకీయ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచిపోతుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మహమ్మద్‌ ఇక్బాల్‌ వ్యాఖ్యానించారు. జననేత కొనసాగిస్తున్న ప్రజాసంకల్పయాత్ర మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకోనుండటం ఆనందంగా ఉందన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడిన ఇక్బాల్‌.. జగన్‌మోహన్ రెడ్డికి 43శాతం ప్రజల మద్దతు ఉన్నట్లు సర్వేల్లో తేలిందని పేర్కొన్నారు. పాదయాత్ర పూర్తయ్యేలోపు సుమారు 53శాతం ప్రజల మద్దతు జగన్‌మోహన్ రెడ్డికి లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

అదో బూటక యాత్ర..
బాబుగారి అమెరికా యాత్ర బూటకమని.. అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఇక్బాల్‌ ఎద్దేవా చేశారు. రైతును కుదేలు చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివరామకృష్ణ కమిషన్ రిపోర్ట్ రాకముందే సొంత రిపోర్టులతో చంద్రబాబు రైతాంగానికి తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. బూటకపు ప్రచారాలతో రాష్ట్రం తలదించుకునేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

పిరికిపంద చర్య...
మావోయిస్టులు అరకు ఎమ్మెల్యేను, మరో మాజీ ఎమ్మెల్యేను హతమార్చడం అత్యంత బాధాకరమని ఇక్బాల్‌ విచారం వ్యక్తం చేశారు. దీనిని ఒక పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఇంకా మాట్లాడుతూ.. నారా హమారా టీడీపీ హమారా కార్యక్రమంలో ముస్లిం యువకులపై దాడి అమానుషమని పేర్కొన్నారు. కర్నూల్ జిల్లా అంటేనే చంద్రబాబుకు కోపం అసహనం, ఇక్కడి ప్రజలు, మైనార్టీలు తనకు గత ఎన్నికల్లో ఓట్లు వేయలేదన్న అక్కసుతోనే ముస్లిం యువకులపై అక్రమ కేసులు పెట్టారన్నారు. టీడీపీ నయవంచక పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారని. ఆ పార్టీకి ఇవే చివరి ఎన్నికలని ఇక్బాల్‌ వ్యాఖ్యానించారు.

పాదయాత్ర దేశ చరిత్రలో నిలిచిపోతుంది..
వైఎస్‌ జగన్ పాదయాత్ర దేశ చరిత్రలో నిలిచి పోతోందని వైఎస్సార్‌ సీపీ నాయకులు, మాజీ ఎంపి వరప్రసాద్, యువజన విభాగం నేత భూమన అభినయ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ జగన్ చేస్తున్న పాదయాత్ర 3 వేల కిలోమీటర్లు పూర్తి చేయటం దేశ చరిత్రలో ఓ రికార్డ్ అన్నారు. జగన్ సీఎం కావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని, జగన్‌కు మద్దతుగా తిరుపతిలో రేపటి నుంచి పాదయాత్రలు చేపడతామన్నారు.

మరిన్ని వార్తలు