ధాన్యాన్ని కాకుండా సోమిరెడ్డిని కొనుగోలు చేశారు

23 Apr, 2018 10:35 IST|Sakshi
వైఎస్సార్సీపీలో చేరిన వారితో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి  

నెల్లూరు(సెంట్రల్‌) : జిల్లాలో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మాత్రం కొనుగోలు చేయకుండా ముడుపులిచ్చి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని మిల్లర్లు కొనుగోలు చేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. అనికేపల్లి పంచాయతీకి చెందిన 250 కుటుంబాలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి నివాసంలో ప్రదీప్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగన్‌మోహన్‌రెడ్డికి అండగా ఉండాలనే ఉద్దేశంతో పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో దొంగ కేసులు, ఇబ్బందులకు గురి చేస్తూ, రాక్షస పాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. అనికేపల్లి పంచాయతీకి చెందిన మాజీ సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, ఇతర ముఖ్య నాయకులు పార్టీలో చేరారు.

గెలుపోటములు ప్రజల చేతుల్లో 
జిల్లాకు చెందిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నిత్యం రైతులను అడ్డుపెట్టుకొని మిల్లర్ల వద్ద దోచుకోవడం, రైతు రథంలో ముడుపులు ఈ విధంగా దాదాపు రూ.100 కోట్ల వరకు సంపాదించారని ఆరోపించారు. తాను చేసే ఆరోపణలకు సమాధానం చెప్పలేని సోమిరెడ్డి తనను ఓడిస్తానని ప్రగల్భాలు పలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జిల్లా చరిత్రలో నాలుగు సార్లు ఓటమి పాలైన చంద్రమోహన్‌రెడ్డికి తన గురించి మాట్లాడే అర్హత లేదని తెలిపారు. గెలుపోటములను ప్రజలే నిర్ణయిస్తారనే విషయాన్ని తెలుసుకుంటే మంచిదన్నారు. ఎవరు ప్రజల పక్షాన ఉండి సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని, సర్వేపల్లి నియోజవర్గంలో టీడీపీ ఖాళీ అవుతుందని పేర్కొన్నారు.

బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు ఎల్లవేళలా పనిచేయవు
సీఎం చంద్రబాబు పుట్టింది ఏప్రిల్‌ 20 అని, ఆయన ఆలోచనలు కూడా 420 తరహాలోనే ఉంటాయని ఎద్దేవా చేశారు. బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు ఎల్లవేళలా పనిచేయవన్నారు. చంద్రబాబు ఒక్క రోజు దీక్షకు రూ.30 కోట్ల వరకు ఖర్చు పెట్టారని, ఆరోగ్య శ్రీ సిబ్బందికి జీతాలను రూ.ఏడు కోట్లను ఇవ్వకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. 40 ఏళ్ల వయస్సు ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల పక్షాన పోరాడుతుంటే, 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు మాత్రం ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ ప్రస్తుతం శవంలా మారిందని, ఐస్‌పెట్టెలో పెట్టి ఉన్నారని, త్వరలో ఐస్‌ కూడా కరిగిపోయి నామరూపాల్లేకుండా పోతుందన్నారు. వెంకటాచలం జెడ్పీటీసీ వెంకటశేషయ్య, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు