రాప్తాడులో రాజకీయ హత్య

11 Oct, 2018 08:20 IST|Sakshi
కేశవరెడ్డి మృతదేహాన్ని పరిశీలిస్తున్న తోపుదుర్తి చందు, తదితరులు

బరితెగించిన పరిటాల కుటుంబం

నాలుగేళ్లలో ముఖ్యనాయకులను కడతేర్చిన వైనం 

అనంతపురం సెంట్రల్‌: రాప్తాడు నియోజకవర్గంలో హత్యారాజకీయాలకు అంతులేకుండా పోతోంది. జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తుండగానే విపక్ష వైఎస్సార్‌ సీపీకి చెందిన ప్రముఖ నేతను దారుణంగా హతమార్చడం సంచలనం రేకెత్తించింది. టీడీపీ నాయకులు ఎంతటికి బరితెగిస్తున్నారని చెప్పేందుకు బుధవారం ఆత్మకూరులో జరిగిన కేశవరెడ్డి హత్యనే నిదర్శనం. 

దృష్టి మళ్లించి.. 
బుధవారం ఉదయం 11 గంటలకు గుమ్మఘట్ట మండలం భైరవాని తిప్ప ప్రాజెక్ట్‌ వద్ద సీఎం చంద్రబాబు పైలాన్‌ ఆవిష్కరణకు వచ్చారు. ఇందుకు జిల్లా పోలీస్‌ యంత్రాంగాన్ని సీఎం కార్యక్రమానికి ఆత్మకూరు మీదుగానే తరలించారు. సీఎం చంద్రబాబు బీటీపీలో కాలు పెట్టే గంట ముందు అంటే పది గంటల సమయంలో ఆత్మకూరులో కాపు కాచి వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత జి.కేశవరెడ్డిని హతమార్చారు. పథకం ప్రకారం జరిగిన ఈ దాడిలో తాము ఎంతకైనా తెగిస్తామంటూ టీడీపీ నేతలు చెప్పకనే చెప్పినట్లేంది.  

పరిటాల కుటుంబం ప్రమేయంతోనే.. 
టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాప్తాడు నియోజకవర్గంలో దౌర్జన్యాలు, హత్యారాజకీయాలు శ్రుతిమించిపోయాయి. ఆధిపత్యం నిలుపుకునేందుకు విపక్ష వైఎస్సార్‌సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు,  హత్యలకు తెగబడుతున్నారు. మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరాం ప్రమేయంతోనే నియోజకవర్గంలో దౌర్జన్యాలు, హత్యారాజకీయాలు పెరిగిపోతున్నాయంటూ విపక్ష పార్టీలే ఏక కంఠంతో నినదిస్తున్నాయి. 

గతంలోనూ ఇలానే.. 
రాప్తాడు వైఎస్సార్‌సీపీ మాజీ కన్వీనర్‌ భూమిరెడ్డి ప్రసాద్‌రెడ్డి విషయంలోనూ ఇలానే జరిగింది. పథకం ప్రకారం తహసీల్దార్‌ కార్యాలయానికి రప్పించుకుని అతన్ని అధికార పార్టీ నాయకులు హత్య చేశారు. వైఎస్సార్‌ సీపీలో ముఖ్య నేతలకు ప్రత్యర్థులను పరిటాల కుటుంబం చేరదీస్తూ.. వారిద్వారా హత్యారాజకీయాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అల్లరి మూకలు, కిడ్నాపర్లు, నేరాలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న వారిని శ్రీరాం తన కోటరీలో చేర్చుకుంటూ దారుణాలకు తెగబడుతున్నాడనే విమర్శలు ఉన్నాయి. బెంగుళూరుకు చెందిన ఓ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారిని కిడ్నాప్‌చేసి రామగిరి మండలం కొత్తపల్లి బంధించిన ఘటనలోనూ పరిటాల కుటుంబం హస్తమున్నట్లు అప్పట్లో ఆరోపణలు వెలువడ్డాయి. బుధవారం ఆత్మకూరులో జరిగిన కేశవరెడ్డి హత్యలోనూ మంత్రి పరిటాల సునీత సోదరుడు బాలాజీ ప్రమేయమున్నట్లు హతుడి బార్య స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.  

తండ్రి బాటలో తనయుడు
తన తండ్రి పరిటాల రవీంద్ర బాటలోనే హత్యారాజకీయాలతో ఆధిపత్యం చెలాయించేందుకు శ్రీరాం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నియోజకవర్గంలోని విపక్ష వైఎస్సార్‌సీపీలో ముఖ్య నేతలను హతమారుస్తూ వచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. పక్కా పథకం ప్రకారమే ఈ హత్యలు కొనసాగిస్తున్నట్లు ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. 2004కు ముందు శత్రుశేషం లేకుండా జిల్లాలో పరిటాల రవీంద్ర మారణకాండను సృష్టించారు. వందల సంఖ్యలో విపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నాయకుల ఆచూకీ లభ్యం కాకుండా పోయింది. పదుల సంఖ్యలో మృతదేహాలు వెలుగు చూశాయి. ఇదంతా పరిటాల రవి కనుసన్నల్లోనే జరిగాయనేది బహిరంగ రహస్యం. శ్రీరాం అదే బాటలో పయనిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. 

► 2015 ఏప్రిల్‌ 29న రాప్తాడు వైఎస్సార్‌సీపీ మాజీ కన్వీనర్‌ భూమిరెడ్డి ప్రసాద్‌రెడ్డిని తహసీల్దార్‌ కార్యాలయంలో దారుణంగా హత్య చేశారు. 

► 2016 మే 30న కనగానపల్లి మండలం కుర్లపల్లిలో వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడి చేశారు. బాధితులను పరామర్శిం చేందుకు ఆస్పత్రికి చేరుకున్న వైఎస్సార్‌సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై హత్యాయత్నం. 

► 2017 నవంబర్‌లో గొందిరెడ్డిపల్లిలో సర్పంచ్‌ కుమారుడు బాబయ్యపై టీడీపీ వర్గీయుల దాడి.

► 2017 నవంబర్‌ 12న రామగిరి మండలం పేరూరులో వైఎస్సార్‌సీపీ కార్యకర్త సుబ్బుకృష్ణపై దాడి. 

►  2018 మార్చి 30 అనంతపురం రూరల్‌ మండలం కందుకూరులో శివారెడ్డి హత్య. 

► అనంతరం రూరల్‌ మండలంలో ఎంపీటీసీ ధనుంజయయాదవ్‌ హత్యకు కుట్ర. టీడీపీలోకి చేర్చుకునేలా పథక రచన. 

మరిన్ని వార్తలు