అచ్చెన్నా.. కులాన్ని అడ్డుపెట్టుకుంటావా? 

24 Feb, 2020 08:42 IST|Sakshi
మాట్లాడుతున్న ఏపీ టెక్‌ మాజీ చైర్మన్‌ కొయ్య ప్రసాదరెడ్డి

కార్మికుల ఆరోగ్య నిధులను కాజేసి.. ఇప్పుడు ఇదేం పని? 

వైఎస్సార్‌సీపీ నేత  కొయ్య ప్రసాదరెడ్డి ధ్వజం 

సాక్షి, విశాఖపట్నం: ఈఎస్‌ఐ వ్యవహారంలో వేల కోట్లు అవినీతికి పాల్పడిన మాజీ మంత్రి అచ్చెన్నాయడు.. ఇప్పుడు తన సామాజికవర్గాన్ని అడ్డుపెట్టుకోవడం ఆశ్చర్యంగా ఉందని ఏపీ టెక్‌ మాజీ చైర్మన్, వైఎస్సార్‌ సీపీ నేత కొయ్య ప్రసాదరెడ్డి అన్నారు. కార్మికుల ఆరోగ్య నిధులని కూడా చూడకుండా తమ ఖాతాల్లోకి మళ్లించుకోవడం సిగ్గు చేటన్నారు. మద్దిలపాలెంలోని పార్టీ నగర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈఎస్‌ఐ కుంభకోణంలో వేల కోట్లు తినేసి, ఇప్పుడు వాటిని కప్పి పుచ్చుకునేందుకు టీడీపీ నేతలు సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుంటున్నారని విమర్శించారు. ఐటీ దాడుల్లో రూ.2 వేల కోట్లు అవినీతి జరిగినట్టు తేటతెల్లమైతే.. టీడీపీ నేతలు తమకు సంబంధం లేదంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పుడు ఈఎస్‌ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు పాత్ర ఉందని నేరుగా విజిలెన్స్‌ అధికారులు చెబుతుంటే.. కక్ష సాధిస్తున్నారంటూ గోల చేయడం తగదన్నారు. గత ఐదేళ్లలో టీడీపీ నేతలు తిన్నదంతా కక్కిస్తామని ఆయన స్పష్టం చేశారు.

 బీసీల అభ్యున్నతికి సీఎం కృషి 
వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏర్పడి 9 నెలల పాలనలో బీసీల అభ్యున్నతికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారని కొయ్య తెలిపారు. ఇది ఓర్వలేకనే టీడీపీ నేతలు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. నిరంతరం కులాల మధ్య.. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చంద్రబాబు అండ్‌ కో చేస్తోందని దుయ్యబట్టారు.  

విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌పై కుట్ర 
పాలన వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని కొయ్య ప్రసాద్‌రెడ్డి అన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానుల ఏర్పాటుపై సీఎం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమన్నారు. ఏపీ తరహాలోనే ఇతర రాష్ట్రాలు కూడా పాలన వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నాయన్నారు. ఇది చూసి ఓర్వలేని టీడీపీ నేతలు పదేపదే విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ని దెబ్బతీయాలనే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. అమరావతి రైతులను రెచ్చగొడుతూ.. మరో వైపు ఉత్తరాంధ్ర ప్రజలకు తప్పుడు సమాచారం పంపించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రొంగలి జగన్నాథం, పార్టీ రాష్ట్ర మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శి ఎండీ ఫరూఖీ, నగర, పార్లమెంట్‌ అనుబంధ సంఘాల అధ్యక్షులు, ముఖ్యనేతలు సతీష్‌ వర్మ, పీలా వెంకటలక్షి్మ, కాళిదాసురెడ్డి, రేయి వెంకటరమణ, బోని శివరామకృష్ణ, రాధ, సత్యాల సాగరిక, అడిగర్ల ఆనంద్‌బాబు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు