‘రైతుల దృష్టి మరల్చేందుకే రాజధాని దుమారం’

28 Aug, 2019 12:28 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి 

సాక్షి, విశాఖపట్నం: రైతుల దృష్టి మరల్చేందుకే రాజధానిని మార్పు చేస్తున్నారని టీడీపీ ప్రచారం చేస్తుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. బుధవారం విశాఖ  వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో జరిగిన మహిళా విభాగాల ప్రతినిధుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..దొనకొండకు రాజధాని మార్చుతున్నారని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. సీఎం వైఎస్‌ జగన్‌  రాజధాని మార్చుతామని ఎప్పుడూ చెప్పలేదన్నారు. రాజధాని నిర్మాణం పేరిట చంద్రబాబు అండ్‌ కో.. రైతుల భూములను బలవంతంగా లాగేశారన్నారు.

ట్రేడింగ్‌ చేసేది వాళ్లే...
దొనకొండలో ఇన్‌సైడ్‌ ట్రేడింగ్ జరుగుతోందని చంద్రబాబు అంటున్నారని..ఆ ట్రేడింగ్ చేసేది చంద్రబాబు,ఆయన కుమారుడు లోకేషేనని విమర్శించారు. విశ్వ రాజధాని నిర్మిస్తున్నామని చంద్రబాబు చెప్పినా కూడా అక్కడ ప్రజలు ఎందుకు ఓడించారని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం పేరిట రైతుల భూములను బలవంతంగా లాక్కురన్నారని మండిపడ్డారు. రైతుల దృష్టిని మరల్చేందుకే రాజధాని దుమారం లేపారని వ్యాఖ్యనించారు.

అందరూ  చెప్పుకుంటున్నారు..
బాలకృష్ణ వియ్యంకుడు ఎకరం భూమి లక్ష రూపాయలకు లాగేసినట్టు జనం అందరూ చెప్పుకుంటున్నారని వ్యాఖ్యనించారు. నిరుద్యోగులను భృతి పేరిట చంద్రబాబు మోసం చేస్తే..ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ సచివాలయాలు ద్వారా ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం ఆఖరి రోజుల్లో రెండు వేల కోట్ల నిధులు కూడా మళ్లించారని విమర్శించారు. గతంలో చంద్రబాబు, కిరణ్‌కుమార్‌ రెడ్డి కుమ్మక్కై పాలన సాగించారని..అదే సమయంలో బాలకృష్ణ అల్లుడికి భూమి కేటాయించారన్నారు.

ఎకరం లక్ష రూపాయలకు భూమి కేటాయింపు ఎలా జరిగిందో..టీడీపీ నాయకులే సమాధానం చెప్పాలన్నారు. గత ప్రభుత్వం అన్ని శాఖలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. అక్షరాస్యతలో దేశంలోనే నెంబర్‌వన్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నిలపడానికి అమ్మఒడిని సీఎం జగన్‌ ప్రారంభించారని వెల్లడించారు. కార్యక్రమంలో అనుబంధ సంఘాల ప్రతినిధులు యువశ్రీ, సాగరీక, శ్రీదేవి వర్మ, పీలా ఉమా రాణి, రాధ, గొలగాని లక్ష్మీ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు