సమైక్యమన్నందుకు సంకెళ్లు

19 Dec, 2013 02:54 IST|Sakshi
సమైక్యమన్నందుకు సంకెళ్లు

చింతలపూడి, న్యూస్‌లైన్: కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు దురహంకార వైఖరికి పరాకాష్ట ఇది. సమైక్యాంధ్రప్రదేశ్ పరిరక్షణ కోసమే తాను మంత్రి పదవిలో కొనసాగుతున్నానని బీరాలు పలుకుతూ వచ్చిన ఆయన ఇప్పుడు తన అధికారబలంతో సమైక్యవాదులను కేసుల ఉచ్చులో బిగిస్తున్నారు. సమైక్యవాదులు తనను అడ్డుకోవడాన్ని జీర్ణించుకోలేని కావూరి వారిపై కక్షగట్టి  కేసుల మీద కేసులు నమోదుచేసి వేధింపులకు గురి చేస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గసమన్వయకర్త  మద్దాల రాజేశ్ ఆధ్వర్యంలో సమైక్యవాదులు, ఉద్యోగులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు మంత్రి కావూరిని అడ్డుకున్న విషయం తెలిసిందే. బస్ షెల్టర్‌ను ప్రారంభించేందుకు వచ్చిన ఆయన కాన్వాయ్‌ను అడ్డుకుని గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. సమైక్యవాదులపై కావూరి అసహనం వ్యక్తం చేయడంతో ఆవేశానికి గురైన కొందరు యువకులు ఆయన కాన్వాయ్‌పై కోడిగుడ్లు విసిరారు.  

దీంతో కావూరి రెచ్చిపోయి   ‘వెధవల్లారా.. సన్నాసుల్లారా.. ఎవరు డబ్బులిచ్చి మిమ్మల్ని ఇక్కడకు పంపార్రా..’ అంటూ నానా దుర్భాషలాడారు. ‘అర్థరూపాయికి అమ్ముడుపోయేవాళ్లు నన్ను ప్రశ్నిస్తారా’ అనడంతో పాటు పదేపదే వెధవలు, సన్నాసులంటూ తిట్టారు. పత్రికలో రాయలేని భాషలో దుర్భాషలాడారు. కావూరి ఆదేశాలతో రెచ్చిపోయిన పోలీసులు రాజేశ్‌తోపాటు మరో 21 మంది సమైక్యవాదులను బలవంతంగా ఈడ్చుకెళ్లి లారీలో పడేశారు. అక్కడి నుంచి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి 151 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అదే రోజు సాయంత్రం వారందరినీ వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.
 
కావూరి ఆదేశాలతో రెండోసారి...

అయితే, తనను అడ్డుకున్న వారికి వెంటనే స్టేషన్ బెయిల్ రావడం జీర్ణించుకోలేని కావూరి పోలీసు అధికారులపై ఒత్తిడి తెచ్చి బుధవారం మరోమారు అరెస్టులు చేయించారు. రాజేశ్‌తోపాటు మరో 19 మందిని బుధవారం రెండోసారి పోలీసులు అరెస్టు చేశారు. ఈసారి ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారనే అభియోగంపై 341, 143, రెడ్‌విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
 
అడ్డగోలుగా అరెస్టులు

బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో రాజేశ్ నివాసానికి పోలీసు అధికారులు భారీ  బలగాలతో చేరుకున్నారు. ఆయన్ను మళ్లీ అరెస్టు చేస్తారనే సమాచారంతో అప్పటికే వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, సమైక్యవాదులు ఆయన నివాసం వద్దకు భారీగా చేరుకున్నారు. అరెస్టు చేయడానికి ఇంట్లోకి వెళుతున్న పోలీసులను వారంతా అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. చివరికి పోలీసులు కార్యకర్తలను నెట్టుకుంటూ లోపలికి వెళ్లి నిద్రపోతున్న రాజేశ్‌ను లేపి అరెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు.  

కార్యకర్తలు ప్రతిఘటించడంతో పోలీసులు బలవంతంగా రాజేష్‌ను ఎత్తుకుని జీపు వద్దకు తీసుకువెళ్లారు. దీంతో సమైక్యవాదులు పెద్దఎత్తున కావూరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీమాంధ్ర ద్రోహి, దళిత ద్రోహి కావూరి అన్న నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది.  పోలీసు జీపు ఎక్కడానికి రాజేశ్ నిరాకరించడంతో పోలీసులు ఆయన్ను కాలి నడకన పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. మార్గమధ్యంలో సమైక్యవాదులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు అడుగడుగునా పోలీసులను అడ్డుకుని సమైక్య నినాదాలు చేశారు.
 
కాళ్లకు కనీసం చెప్పులు లేకుండా రాజేశ్‌ను రెండు కిలోమీటర్ల దూరం నడిపించడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత స్టేషన్ నుంచి రాజేశ్ సహా 20 మందిని జీపుల్లో జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు తరలించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా కేంద్ర మంత్రిని నిలదీశానని తాను బెయిల్‌కు దరఖాస్తు చేయనని రాజేశ్ స్పష్టం చేశారు. దీంతో న్యాయవాదుల జేఏసీ ముందుకొచ్చి రాజేశ్‌తో సహా 20 మందికి బెయిల్ కోసం దరఖాస్తు చేసింది. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో సాయంత్రం మాజీ ఎమ్మెల్యే  సహా 20 మంది విడుదలయ్యారు.
 
సమైక్యవాదులను దూషించిన కావూరిపై ఎందుకు కేసులు పెట్టరు: మద్దాల రాజేశ్
 
బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత రాజేష్ విలేకరులతో మాట్లాడుతూ అక్రమ కేసులు, అరెస్ట్‌లకు భయపడమని స్పష్టం చేశారు. సమైక్యవాదాన్ని వినిపించడానికి వెళ్ళిన తమపై అసభ్య పదజాలంతో కావూరి దూషించారని చెప్పారు. సమైక్యవాదులను వెధవలు, సన్నాసులు, చెత్త వెధవలు అని దూషించిన కావూరిపై ఎందుకు కేసులు పెట్టరని ప్రశ్నించారు. పోలీసులతో దాడులు చేయించి , సమైక్యవాదులను భయభ్రాంతులకు గురి చేయాలని చూశారని చెప్పారు. మంగళవారం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేసిన పోలీసులు, రాత్రికి రాత్రి కావూరి ఒత్తిళ్లకు లొంగి అక్రమ కేసులు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 నేడు బంద్‌కు సమైక్య జేఏసీ పిలుపు


 రాజేశ్, సమైక్యవాదుల అక్రమ అరెస్టును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సమైక్యాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ గురువారం చింతలపూడి నియోజకవర్గ బంద్‌కు పిలుపునిచ్చింది. కేంద్ర మంత్రి వైఖరికి నిరసనగా అందరూ బంద్‌లో పాల్గొనాలని నాన్‌పొలిటికల్ జేఏసీ కోరింది. మరోవైపు రాజేశ్ అరెస్టును ఖండిస్తూ గురువారం జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌ను ముట్టడిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రకటించారు.
 

మరిన్ని వార్తలు