ప్రజాకోర్టులో మంత్రి సుజయ్‌కు శిక్ష తప్పదు

17 Oct, 2018 07:30 IST|Sakshi

ప్రజాసంకల్పయాత్ర బృందం: జిల్లా రాజకీయాల్లో ఎన్నడూ లేని సంస్కృతిని ప్రవేశపెడుతున్న స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావుకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అన్నారు. బొబ్బిలి నియోజకవర్గంలోని బాడంగి మండలంలో ముగడ గ్రామం వద్ద వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయనగరం పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌తో కలిసి ఆయన మంగళవారం మాట్లాడారు. జిల్లాలో ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పాదయాత్ర చేపడుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు.

 ఇంతవరకు ఐదు నియోజకవర్గాల్లో మహిళలు, యువత అశేష జనవాహిని జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా నిలిచారని, ఆరో నియోజవకర్గం బొబ్బిలిలో కూడా చక్కని స్పందన లభిస్తోందన్నారు. దీన్ని చూసి జిల్లాలో అధికార పార్టీ నేతలు  ఓర్వలేక పాత పేపర్‌ క్లిప్పింగ్‌లు ఫ్లెక్సీలు చేసి పెట్టడం, తాజాగా బొబ్బిలి నియోజకవర్గంలో ఫ్లెక్సీలు చింపడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.  ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. 2019 ఎన్నికల్లో స్థానిక మంత్రి సుజయ్‌కృష్ణరంగారావుకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదన్నారు. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందన్నారు. తుపాను ఏర్పడి తీవ్ర నష్టం ఏర్పడినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి.

టీడీపీ నేతలకు ముచ్చెమటలు....
జిల్లాలో జరుగుతున్న ప్రజాసంకల్పయాత్ర చూసి తెలుగుదేశం నేతలకు ముచ్చెమటలు పడుతున్నాయని వైఎస్సార్‌ సీపీ విజయనగరం పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌ అన్నారు. జిల్లాలో జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు పెద్ద ఎత్తున యువ త, మహిళలు తరలి వస్తున్నారని చెప్పారు. ఏ నియోజకవర్గం వెళ్లినా పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారని పేర్కొన్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా నేత చిన్నశ్రీను నేతృత్వంలో పార్టీ బలోపేతం అవుతుండడంతో తట్టుకోలేని ఇక్కడ నేతలు చిలిపి చేష్టలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇలాంటి సంస్కృతి గతంలో ఎన్నడూ లేదని చెప్పారు. బుధవారం బొ బ్బిలిలో జరగబోయే బహిరంగ సభకు అశేష జనవాహిని తరలివచ్చేందుకు ఇప్పటికే సిద్ధమైన తరుణంలో తెలుగుదేశం నేతలు జీర్ణించుకోలేని పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. 2019 ఎన్నికల్లో అధికార పార్టీ నేతలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

>
మరిన్ని వార్తలు