టీడీపీ నేతల అరాచకాలకు అడ్డేది? మేరుగు

13 Apr, 2019 07:56 IST|Sakshi

మేరుగపై దాడి కారకులపై చర్యలు తీసుకోవాలి

మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు

కొల్లూరు(వేమూరు): గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగ నాగార్జునపై దాడి ఘటనలో తెరవెనుక కథ నడిపిన కథానాయకులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, రేపల్లె నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మోపిదేవి వెంకట రమణారావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం కొల్లూరులోని వేమూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మేరుగను ఆయన పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ, దాడి ఘటనలో అనామకులను ముందుంచి తెరవెనుక వారు తప్పించుకునే ప్రయత్నాలు చేయడం సహజంగా జరుగుతుంటాయని, అయితే పోలీసులు మాత్రం టీడీపీ ప్రలోభాలకు తలొగ్గకుండా దాడి విషయంలో వెనక ఉన్న వ్యక్తులపై సైతం చర్యలు తీసుకుని నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. మంత్రి ఆనందబాబు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ పోలింగ్‌ అధికారులను, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి ఓటమి నుంచి తప్పించుకోవాలని అరాచకాలను ప్రోత్సహించడం దారుణమని మోపిదేవి విమర్శించారు.

ఓటమి భయంతోనే దాడులు : మేరుగ
ఓటమి భయంతోనే మంత్రి స్థాయిని మరచి లింపోగ్‌బూత్‌లలో దౌర్జన్యాలకు పాల్పడుతూ, అమానుషంగా వ్యవహరించడం దారుణమని మేరుగ అన్నారు. రెండు పర్యాయాలు మంత్రి ఆనందబాబుపై పోటీ చేసినా తాను ఎప్పుడూ అతనిలా వ్యవహరించిన దాఖలాలు లేవన్నారు. కొల్లూరు మండలం రావికంపాడు, చుండూరు మండలం చినపరిమి గ్రామాలలోని పోలింగ్‌బూత్‌లలోకి మందీమార్బలంతో వెళ్లి ఇష్టానుసారం వ్యవహరించారని విమర్శించారు. బూతుమల్లిలో ఓటు లేకపోయినా దొంగ ఓటు వేయించడంపై పీవోను ప్రశ్నిస్తున్న తనపై అకారణంగా దాడి చేసి, ఇష్టానుసారం దూషించి, కార్లను ధ్వంసం చేయడం టీడీపీ అరాచక పర్వం పరాకాష్టకు చేరిందనడానికి నిదర్శనమని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నక్కా రావికంపాడులో దళితులపై దాడి చేయించడానికి ట్రాక్టర్లలో కర్రలు వేయించుకుని వచ్చి అలజడులు సృష్టించడంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేరుగ డిమాండ్‌ చేశారు.
     

మరిన్ని వార్తలు