అక్రమ మైనింగ్‌కు ఖాకీ సహకారం

18 Nov, 2018 09:10 IST|Sakshi

అడ్డుకోబోయిన పెద్దారెడ్డి గృహనిర్బంధం 

మైనింగ్‌ పనుల వద్దకు వెళ్లరాదంటూ ఆంక్షలు 

ఎంపీ జేసీ అక్రమాలపై మండి పడ్డ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త  

తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అక్రమంగా నిర్వహిస్తున్న మైనింగ్‌ పనులు నిరాటంకంగా కొనసాగడానికి పోలీసులు తమవంతు సహకారం అందిస్తున్నారు. అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవడానికి బయల్దేరుతున్న తాడిపత్రి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిని గృహనిర్బంధం చేశారు. మైనింగ్‌ పనుల వద్దకు వెళ్లరాదంటూ ఆంక్షలు విధించారు. అక్రమాలకు సహకరిస్తున్న పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

యల్లనూరు: యల్లనూరు మండలం కూచివారిపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మూడు నెలల నుంచి అక్రమంగా నిర్వహిస్తున్నారు. అనుమతులు లేకపోయినా మైనింగ్‌ జరుపుతున్నారని పత్రికల్లో కథనాలు వచ్చాయి. అధికారుల దృష్టికి వెళ్లినా చర్యలు తీసుకోలేదు. శనివారం అక్రమ మైనింగ్‌ పనులను అడ్డుకోవడానికి 600 మంది కార్యకర్తలు, కూచివారిపల్లి చుట్టు పక్కల గ్రామాల ప్రజలతో కలిసి బయల్దేరడానికి సిద్ధమైన తాడిపత్రి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు తిమ్మంపల్లిలో హౌస్‌ అరెస్ట్‌ చేశారు. మైనింగ్‌ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లకూడదని ఆంక్షలు విధించారు. పెద్దారెడ్డితోపాటు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులను కూడా గృహనిర్బంధం చేశారు. ఎవ్వరూ మైనింగ్‌ ప్రాంతానికి వెళ్లకుండా తిమ్మంపల్లి, కూచివారిపల్లితో పాటు అటువైపు వెళ్లే అన్ని అన్ని గ్రామాల దారుల వద్ద పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. 

జేసీ బ్రదర్స్‌ అక్రమాలపై మండిపాటు 
అక్రమ మైనింగ్‌ పనులను అడ్డుకునేందుకు వెళుతున్న తమను హౌస్‌ అరెస్ట్‌ చేయడం దారుణమని కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. ఆయన తిమ్మంపల్లిలోని తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ జేసీ సోదరుల అక్రమాలపై మండిపడ్డారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి దాదాపు 35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారని, కానీ ఆయన ఇప్పటి వరకు ప్రజలకు చేసింది ఏమీ లేదని ధ్వజమెత్తారు. స్వప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబును ఏ విధంగా బ్లాక్‌మేల్‌ చేశావో అదే తరహాలో తాడిపత్రి ప్రాంతంలోని చెరువులన్నింటినీ నీటితో నింపి ప్రజలకు మేలు చేయాలని సూచించారు.  

అనుమతులు లేకుండానే మైనింగ్‌ 
ఎటువంటి అనుమతులు లేకుండానే ఎంపీ జేసీ మైనింగ్‌ నిర్వహిస్తున్నారని పెద్దారెడ్డి ఆరోపించారు. ఇదివరకే తాడిపత్రి ప్రాంతంలోని కోనుప్పలపాడు దేవాలయ ప్రాంతంలో మైనింగ్‌ నిర్వహించడంతో దేవాలయం చీలికలు ఏర్పడిందన్నారు. దేవాదాయ, అటవీ భూములను సైతం వదిలిపెట్టకుండా అక్రమ మైనింగ్‌ నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ముచ్చుకోటలో కూడా అక్రమ మైనింగ్‌ నిర్వహిస్తూ.. ఇటీవలే అనుమతులు తీసుకున్నారన్నారు. జూటూరు ప్రాంతంలో దాదాపు 500 ఎకరాల భూములను పేదల నుంచి దౌర్జన్యంగా లాక్కున్నారని ఆరోపించారు. 

 తాడిపత్రి సమీపంలోని పెన్నా పరిసర ప్రాంతాల్లో మైనింగ్‌ నిర్వహిస్తూ రోజూ వందలాది లారీల రాయిని అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారన్నారు. తాడిపత్రి ప్రాంతంలో చాలా మందికి మైనింగ్‌ చేసుకోవడానికి అనుమతులు ఉన్నప్పటికీ జేసీ దివాకర్‌రెడ్డి వారిని అడ్డుకుంటున్నారన్నారు. తను మాత్రం మైనింగ్‌ జరుపుకుంటున్నారన్నారు. కూచివారిపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో అక్రమంగా నిర్వహిస్తున్న మైనింగ్‌ గురించి అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని పెద్దారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్‌ పనులకు పోలీసులు కూడా సహకరిస్తుండటం బాధాకరమన్నారు. జేసీ ఆదేశాల మేరకే తనను మైనింగ్‌ ప్రదేశానికి వెళ్లకుండా హౌస్‌ అరెస్ట్‌ చేశారని, పోలీసుల ఏకపక్షంగా వ్యవహరించడం తగదని అన్నారు.  

>
మరిన్ని వార్తలు