నిర్వాసితులను ఆదుకోని ప్రభుత్వం

12 Oct, 2018 08:58 IST|Sakshi

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వంశధార ప్రాజెక్టు పనులు పూర్తి చేసేస్తామంటూ నిర్వాసిత గ్రామాలను బలవంతంగా ఖాళీ చేయించి, వారిని నిరాశ్రయులను చేసి రోడ్డున పడేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి విమర్శించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తిత్లీ తుఫాన్‌ దెబ్బకు రేకుల షెడ్‌లు, పూరి గుడిసెలు ఎగిరిపోయి కట్టుబట్ట, తాగునీరు లేకుండా ఎక్కడ తలదాచుకోవాలో తెలియక, దిక్కులేని వారిగా ఉన్న నిర్వాసితులను పట్టించుకున్నవారే కరువయ్యారన్నారు.

 హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, ఆమదాలవలస, సరుబుజ్జిలి మండలాల్లో దాదాపుగా వెయ్యి కుటుంబాలకు పైగా తలదాచుకునే పరిస్థితి లేకుండా నానాపాట్లు పడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం సభలు, సమావేశాల్లో నిర్వాసితులకు అన్ని చేసేశామంటూ ఊకదంపుడు ప్రచారాలు చేస్తున్నారు మినహా, ఇప్పటికీ మౌలిక వసతులు కల్పించలేదని వ్యాఖ్యానించారు. వంశధార నదీ పరివాహక ప్రాంతంలోని గ్రామాల్లోకి ఎప్పుడు వరదనీరు వస్తుందోనని భయాందోళన చెందుతున్నారని, తంపర భూములు నీటమునిగి నష్టాల పాలయ్యారని గుర్తుచేశారు.

 ప్రభుత్వం ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు హడావిడి చేయడం తప్పితే, ముందస్తుగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే ఆలోచన లేకపోవడం కారణంగానే విపత్తుల సమయంలో తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి నష్టాలబారిన పడిన నిర్వాసితులను ఆదుకుని, తక్షణమే అన్ని సౌకర్యాలతో కూడిన వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రకృతి విపత్తుల పేరుతో విరాళాలు సేకరించి టీడీపీ పెద్దలు తమ జేబులు నింపుకుంటున్నారు తప్పితే, నష్టపోయిన వారికి అందడం లేదన్నారు. పరిహారాలు అందించడంలో చవకబారు రాజకీయాలు విరమించి, అర్హులైన లబ్ధిదారులకు పరిహారం అందించాలని ఆమె డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు