పేదోడిపై ప్రతాపం

14 Nov, 2017 13:33 IST|Sakshi
వేపగుంట ఆంజనేయస్వామి దేవాలయం వద్ద జీవీఎంసీ అధికారులు కూలగొట్టిన ఆవాల గొల్లయ్య దుకాణం

వైఎస్సార్‌సీపీ కార్యకర్త గొల్లయ్య పూజాసామగ్రి  దుకాణం కూల్చివేత

పంచగ్రామాల పాదయాత్ర సభకు వెళ్లాడని కక్షగట్టిన టీడీపీ నాయకులు

జీవీఎంసీ అధికారులను ఉసిగొల్పిన  ఎమ్మెల్యే బండారు అనుచరగణం

పేదోడి బతుకుపై ‘పచ్చ’ భూతాలు పడ్డాయి. జీవీఎంసీ యంత్రాంగం ద్వారా ఆ బడుగు కుటుంబాన్ని రోడ్డున పడేశాయి. తమకు వ్యతిరేకంగా ఓ వేదికపై మాట్లాడడన్న ఆక్రోశంతో బతుకుదెరువుగా ఉన్న ఆ నిరుపేదకు ఆసరా లేకుండా చేశాయి. అధికారం ఉందన్న అహంకారానికి.. ప్రజలు మరో పార్టీని అభిమానించకూడదన్న దుర్బిద్ధికి.. టీడీపీ నాయకులు చేస్తున్న అరాచకాలకు నిదర్శనంగా.. పెందుర్తి నియోజకవర్గం వేపగుంట ‘ఆంజనేయస్వామి’ సాక్షిగా ఈ ఘటన సోమవారం జరిగింది.

పెందుర్తి: వేపగుంటలో వైఎస్సార్‌ సీపీ బీసీ సెల్‌ నాయకుడు ఆవాల గొల్లయ్య దుకాణాన్ని టీడీపీ నాయకులు కూలగొట్టించారు. సింహాచలం దేవస్థానం భూ సమస్య పోరాటంలో భాగంగా ఆదివారం సాయంత్రం వేపగుంట కూడలి వద్ద జరిగిన సభలో ప్రజల తరపున ప్రసంగించడమే గొల్లయ్య చేసిన పాపం. దీంతో గొల్లయ్యపై స్థానిక టీడీపీ నాయకులు ఆక్రోశం పెంచుకుని తెల్లారే సరికే అతడి బతుకుదెరువుగా ఉన్న పూజాసామగ్రి దుకాణాన్ని జీవీఎంసీ అధికారులను ఉసిగొల్పి నేలమట్టం చేయించారు. అంతా అయిపోయాక తీరిగ్గా వచ్చిన జోనల్‌ కమిషనర్‌ తమ సిబ్బందిది తొందరపాటు చర్యే అని వ్యాఖ్యానించడం ఈ ఘటనపై టీడీపీ నాయకుల ప్రభావం ఎంత ఉందో తేటతెల్లం అయ్యింది. ఈ ఘటన వెనుక స్థానిక టీడీపీ నాయకులు ప్రత్యక్షంగా, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, అతని కుమారుడు పరోక్షంగా ఉన్నట్లు వైఎస్సార్‌సీపీ నేతలు, బాధితులు ఆరోపించారు.

దగ్గరుండి కూల్చేశారు..
పంచగ్రామాల భూ సమస్యపై పోరాటంలో భాగంగా వైఎస్సార్‌సీపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గొల్లయ్య మాట్లాడుతూ తమ ప్రాంతంలో ప్రజా సమస్యలు చాలా కాలంగా తాను చూస్తున్నానని, ప్రభుత్వ పెద్దలు దాన్ని పరిష్కరించాలని కోరాడు. దీన్ని జీర్ణించుకోలేకపోయిన స్థానిక టీడీపీ నాయకులు గొల్లయ్యను దెబ్బకొట్టాలని కుట్ర పన్ని రాత్రికిరాత్రే స్థానిక ఆంజనేయస్వామి ఆలయం వద్ద(జోనల్‌ కార్యాలయం ఎదురుగా) ఉన్న గొల్లయ్య పూజాసామగ్రి దుకాణాన్ని కూలగొట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రణాళిక ప్రకారం సోమవారం ఉదయాన్నే జీవీఎంసీ సిబ్బందిని పంపి క్షణాల్లో దుకాణాన్ని నేలమట్టం చేయించారు. దుకాణంలోని సామగ్రిని తీసుకుంటామని గొల్లయ్య కుటుంబ సభ్యులు వేడుకున్నా వినిపించుకోలేదు. కూలగొట్టిన దుకాణంలోనే ఆంజనేయస్వామి ఆలయ విద్యుత్‌ మీటర్, ఇతర సామగ్రి ఉండడం గమనార్హం. జీవీఎంసీ అధి కారుల దుందుడుకు చర్య వల్ల సోమవారం రాత్రి ఆలయంలో చీకట్లు అలముకున్నాయి. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అదీప్‌రాజ్‌ నిరసన: విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ సీసీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్‌రాజ్, పార్టీ నాయకులు, గంగిరెడ్లకాలనీ(ఆంజనేయులునగర్‌) వాసులు పెద్దఎత్తున ఘటనాస్థలానికి చేరుకున్నారు. గొల్లయ్యకు మద్దతుగా నిలిచి జోనల్‌ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అదీప్‌రాజ్‌ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీల సమావేశాలకు వెళితే ఇలా దిగజారుడు పనులు చేయడం టీడీపీకి మాత్రమే చెల్లిందని మండిపడ్డారు. 30 ఏళ్లుగా ఇక్కడ ఉన్న గొల్లయ్య దుకాణాన్ని నోటీసులు ఇవ్వకుండా, కనీసం మౌఖిక సమాచారం లేకుండా కూల్చివేసే హక్కు జీవీఎంసీ అధికారులకు ఎక్కడిదని ప్రశ్నించారు. ఫుట్‌పాత్‌లపై దుకాణాలు తీసేస్తున్నామని చెబుతున్న అధికారులు టీడీపీ నాయకుల అజమాయిషీలో ఉన్న దుకాణాలను ఎందుకు పట్టించుకోవడం లేదని అడిగారు. జీవీఎంసీ ఉన్నతాధికారులు వచ్చి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

తమ సిబ్బందిది తొందరపాటు చర్యే అంటూ అదీప్‌రాజ్‌కు సర్దిచెబుతున్న జోనల్‌ కమిషనర్‌ శివాజీ
మా సిబ్బందిది తొందరపాటు చర్యే.. జెడ్పీ శివాజి
జోనల్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న అదీప్‌రాజ్, బాధితులతో జెడ్సీ శివాజీ, పెందుర్తి సీఐ మురళి చర్చించారు. ఫుట్‌పాత్‌లపై దుకాణాలను తొలగించాలని తమకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని, అయితే దుకాణదారులకు సమయం ఇవ్వకుండా కూల్చివేయడం తమ సిబ్బంది తొందరపాటు చర్యే అని జెడ్సీ వివరించారు. దుకాణంలో ఉన్న సామగ్రిని తాను స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం లోపు గొల్లయ్యకు న్యాయం జరగకపోతే తాము మళ్లీ ఆందోళనకు దిగుతామని అదీప్‌రాజ్‌ స్పష్టం చేసి ధర్నా విరమించారు.

రామరాజే దగ్గరుండి కూలగొట్టించాడు
మాది నిరుపేద కుటుంబం. గత 30 ఏళ్లుగా ఈ ఆంజనేయస్వామిని నమ్ముకుని చిన్న దుకాణంలో పూజాసామగ్రి, ఇతర వస్తువులు అమ్ముకుని జీవనం సాగిస్తున్నాం. పంచగ్రామాల ప్రజల సమస్యపై మా పార్టీ నేత అదీప్‌రాజ్‌ చేపట్టిన పాదయాత్రలో పాల్గొని వేదికపై ప్రసంగించాను. అంతే తెల్లారేసరికి టీడీపీ నాయకులు మా పొట్ట కొట్టేశారు. స్థానిక నాయకుడు బుజ్జి(రామరాజు) దగ్గరుండి నా దుకాణాన్ని కూలదోయించాడు. జీవీఎంసీ అధికారులు న్యాయం చేయాలి.–ఆవాల గొల్లయ్య బాధితుడు

మరిన్ని వార్తలు