దొంగ పట్టాలు కాకపోతే దాగుడు మూతలెందుకు?

19 Dec, 2018 13:27 IST|Sakshi
మాట్లాడుతున్న శింగరాజు వెంకట్రావు

దర్జాగా లబ్ధిదారుల పేర్లు ప్రకటించండి

వైఎస్సార్‌ సీపీ నగరాధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు

ఒంగోలు: ఒంగోలు నగరంలోని కేశవరాజుకుంట వెనుక ఎన్‌ఎస్‌పీ స్థలంలో టీడీపీ కార్యకర్తలకు ఇచ్చిన పట్టాలు దొంగపట్టాలు కాకపోతే దాడుగు మూతలెందుకని వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు ప్రశ్నించారు. దర్జాగా వచ్చి అర్హులైన టీడీపీ నేతలకే ఇచ్చామంటూ వారి పేర్లను ప్రకటించాలని, అదేవిధంగా ఎన్‌ఎస్‌పీ అధికారులు, మండల రెవెన్యూ అధికారులతో బహిరంగంగా ప్రకటింపజేయాలని టీడీపీ నేతలకు, స్థానిక ఎమ్మెల్యేకు సవాల్‌ విసిరారు. 10 రోజులుగా ఎన్‌ఎస్‌పీ స్థలంలో టీడీపీ నేతలు దౌర్జన్యంగా ఆక్రమణలకు దిగడాన్ని ప్రజానీకం గమనిస్తున్నారన్న విషయం మరువరాదన్నారు. కేశవరాజుకుంట, రాజీవ్‌గృహ కల్ప కాలనీ, ఇందిరమ్మ కాలనీలలో భూసేకరణ చేసింది టీడీపీ అంటూ టిడిపి నేతలు ప్రకటించడం చూస్తుంటే కనీస అవగాహన లేనివారే మాట్లాడుతున్నట్లు స్పష్టం అవుతుందన్నారు.

టీడీపీ ప్రభుత్వం పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ పేరుతో కాలనీలు ఏర్పాటు చేసిందా అంటూ ఎద్దేవా చేశారు. నగరపాలక సంస్థ, ఆర్‌అండ్‌బీ, పీడబ్లు్యడీ పంచాయతీరాజ్‌ శాఖలలో మీ నాలుగున్నరేళ్ల పాలనలో ఒక్క శాతం లెస్‌కు అయినా టెండర్లు ఖరారు కాలేదని, తద్వారా పెద్ద మొత్తంలో ప్రజాథనం దోపిడీ అయిందన్నారు. ఎవరైనా పోటీపడి లెస్‌కు వేస్తే వారిపై కక్షపూరితంగా వ్యవహరించడం, రోడ్లమీద రోడ్లు వేసి శివారు కాలనీలను నిర్లక్ష్యం చేయడమేనా అభివృద్ధి అంటూ మండిపడ్డారు. బాలినేనిపై తెలుగుదేశం నేతలు చూస్తున్న ఆరోపణలు చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు. శివారు కాలనీలకు వెళ్ళి ఎవరిని అడిగితే పేదలకు పట్టాలు ఇచ్చింది ఎవరో, ప్రభుత్వ భూమిని కార్యకర్తలకు, పార్టీ నేతలకు పంచుకున్నది ఎవరో కూడా ప్రజలే చెబుతారన్నారు.

పెళ్లూరు చెరువు వద్ద గుడిసెలు వేయించి వాటిని ఆక్రమించుకుంది, పేదలకు పట్టాలు ఇవ్వడానికి భూమి లేదంటున్న మీరు మీ పార్టీ కార్యాలయం కోసం రెండెకరాల భూమిని ఎందుకు స్వాధీనం చేసుకుంటున్నారు, «ధారావారికుంటలో పారిశుధ్య కార్మికులను సైతం మోసం చేయాలని చూస్తోంది ఎవరు, ఊరచెరువు స్థలంపై హైకోర్టుకు వెళ్లిన మాలకొండయ్యకు నాలుగు పట్టాలు ఇచ్చి రాజీ చేసుకోవాలనుకుంటున్నది ఎవరు, రాష్ట్రంలో ఐఏఎస్‌ల కొరత ఉన్నట్లు చిన్న కమిషనర్‌ను నగరపాలక సంస్థకు తీసుకువచ్చింది కోట్లు దండుకోవడానికి కాదా..? అంటూ ప్రశ్నించారు.  ఎన్‌ఎస్‌పీ స్థలం ఆక్రమణలను అడ్డుకునేందుకు యత్నించిన మహిళలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని లేని పక్షంలో వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు.  కార్యక్రమంలో బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కఠారి శంకర్, సేవాదళ్‌ జిల్లా అధ్యక్షుడు ఓబుల్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గంటా రామానాయుడు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు దేవరపల్లి అంజిరెడ్డి, జానీ, నాయకులు చిన్నపురెడ్డి అశోక్‌రెడ్డి,  మీరావలి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు